పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్‌!

ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించాననిమరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్‌!

Published : 18 Apr 2024 03:49 IST

ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిన సీఎం
వైకాపా ఐదేళ్ల పాలనలో అటకెక్కిన అభివృద్ధి
చేయాల్సిన ప్రగతి పనులను పక్కన పెట్టిన వైనం
తెదేపా హయాంలో ప్రారంభించిన వాటికీ పాతర

ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా...
తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా...  
ఇరుకు రోడ్లను విస్తరించకున్నా...  
తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా...  
లేశమాత్రమైనా జంకు లేకుండా...
పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని
మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్‌!

వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో జగన్‌ సర్కారు శ్రద్ధ   చూపలేదు. సీఎం స్వయంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. అదే    సమయంలో తెదేపా హయాంలో ప్రారంభించిన ప్రగతి పనులకు నిధులివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేసి... రాజకీయ పైశాచిక ఆనందం పొందారు. తాను అధికారంలోకి వచ్చాక... ప్రారంభించిన అరకొర పనులకూ బిల్లులివ్వకుండా పట్టణాభివృద్ధికి పాడెకట్టారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేం ఉంటుంది? పైగా అభివృద్ధి నమూనాకు ఆద్యుడినంటూ ఇప్పుడు వాడవాడకు డప్పుకొంటుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో అసంపూర్తిగా    నిలిచిన పనులు, వీటితో ప్రజలు పడుతున్న   అవస్థలు జగన్‌కు కనిపించడం లేదు. అస్మదీయులకు పదవులు కట్టబెట్టడంలో, సొంత మనుషులైన గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించడంలో చూపించిన శ్రద్ధలో పది శాతం కనబరిచినా పట్టణాల్లో పెండింగ్‌ పనులు పూర్తయ్యేవి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి. ఆయన ఉదాసీనత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు.


ఇవిగో హామీలు... ఏవీ నిధులు..?

  • గుంటూరులో యూజీడీ పనుల పూర్తికి రూ.200 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు అప్పట్లోనే 60% పూర్తయ్యాయి. వైకాపా సర్కారు వచ్చాక మిగిలిన పనులను పూర్తి చేయాలని స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు విన్నవించగా... నిధులిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాకుండా నగరంలోని శంకర్‌ విలాస్‌ వంతెన విస్తరణ, శ్యామలానగర్‌-నంది వెలుగు రోడ్డులో, రైలు మార్గంపై వంతెనల పనులు నిలిచిపోయాయి. ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు  ఆధ్వర్యంలో నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించినా ఫలితం శూన్యం. వర్షాకాలంలో మూడు వంతెనల కింద మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దాంతో   వాహనాలన్నీ శంకర్‌ విలాస్‌ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
  • విజయవాడ పరిధిలోని నియోజకవర్గాల్లో సిమెంట్‌ రోడ్లు, రిటైనింగ్‌ కాలువలు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ(యూజీడీ)లతో కలిపి మొత్తం 152 పనులను చేపట్టడానికి స్థానిక ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వాలని సీఎం జగన్‌కు విన్నవించారు. దాంతో 2021 సంవత్సరంలో ఒకసారి రూ.100కోట్లు, మరోసారి రూ.50.96 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ, చేసిన పనులకు రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఫలితంగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగి, చాలావరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నింటికి తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్‌  సాధారణ నిధుల పద్దు నుంచి రూ.20 కోట్ల వరకు విడుదల చేశారు. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన  పనులను ప్రారంభించేందుకు గుత్తేదారులు సాహసించలేదు.

  • కర్నూలు జిల్లా ఆదోనిలోని బంగారు బజార్‌ రోడ్డు, పండిట్‌ నెహ్రూ రోడ్డు, తానాజీ రోడ్డు, మున్సిపల్‌ రోడ్డు వంటి పది ప్రధాన రహదారుల విస్తరణకు అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు 2022లో విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌ రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత షరామామూలుగా వదిలేశారు. వాటిని చేపట్టడానికి తాజా అంచనాల ప్రకారం రూ.150 కోట్లు అవసరమవుతాయి.
  • కాకినాడలో వివిధ సామాజిక వర్గాల కోసం తెదేపా హయాంలో ప్రారంభించిన భవనాలు జగన్‌ నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. డెయిరీ ఫాంలో పీఎంపీల అసోసియేషన్‌ భవనం పనులు శ్లాబ్‌ వరకు వచ్చాక ఆగిపోయాయి. నాయీ బ్రాహ్మణుల భవన నిర్మాణం పునాదుల దశలో నిలిచిపోయింది. కన్నయ్యకాపునగర్‌లో బ్రాహ్మణ  సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గౌడ వర్గానికి రెవెన్యూ  కాలనీలో స్థలం కేటాయించి శంకు స్థాపన చేసినా పనులు మొదలవలేదు.

  • అనంతపురం జిల్లా గుంతకల్లులో తెదేపా హయాంలో దళితుల కోసం రూ.63 లక్షల అంచనాతో అంబేడ్కర్‌ సామాజిక భవన నిర్మాణం ప్రారంభించారు. రూ.28 లక్షలు ఖర్చయ్యాక... వైకాపా అధికారంలోకి వచ్చింది. వివాహ వేదిక, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పనకు మరో రూ.35 లక్షలు ఖర్చు చేస్తే భవనం పూర్తయ్యేది. కానీ, జగన్‌ బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి. ఇదే పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2018లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఇండోర్‌ స్టేడియం పనులు పైకప్పు దశలో నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడమే దీనికి కారణం.
  • బాపట్లలోని రాజీవ్‌గాంధీ హిందూ శ్మశానవాటికలో తెదేపా హయాంలో రూ.1.50 కోట్లతో ప్రారంభించిన గ్యాస్‌ ఆధారిత దహన వాటిక పనులు జగన్‌ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఆగాయి. గత ప్రభుత్వంలోనే రూ.60 లక్షలకుపైగా వెచ్చించారు. వైకాపా సర్కారు వచ్చాక పెండింగ్‌ బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు. పట్టణంలోని ఉప్పరపాలెంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు గత ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తయినా నీటిని నింపే పైపులు అనుసంధానించలేదు. చీలురోడ్డు నుంచి ఏబీఎం కాంపౌండ్‌ వరకు రహదారి విస్తరణ పనులు వైకాపా ప్రభుత్వమే ప్రారంభించినా... నిధులివ్వకుండా అసంపూర్తిగా నిలిపేసింది.

పనులంటే గుత్తేదారుల్లో వణుకు

  • చిత్తూరులో రోజూ పది మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే ప్లాంటుకు రూ.35 లక్షలతో మరమ్మతు చేసేందుకు అనేకసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు.  ఇదే నగరంలోని కొండమిట్టలో 1,100 లీటర్ల నీటి సామర్థ్యమున్న ట్యాంకుకు రూ.26లక్షలతో మరమ్మతులకు ఏకంగా తొమ్మిదిసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల్లో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు.
  • తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్టాండు ఎదురు మలుపు నుంచి ఓవర్‌ బ్రిడ్జి వరకు ప్రధాన కాలువ పనులకు రూ.కోటితో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. జాతీయ రహదారుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో రూ.75 లక్షలతో కల్వర్టు నిర్మించినా.. ప్రధాన కాలువ సరిగా లేకపోవడంతో మురుగు ముందుకు పారడంలేదు. చదలవాడ కృష్ణమూర్తి దుకాణ సముదాయం ఎదుట మరో ప్రధాన మురుగు కాలువ పనులకు రూ.35 లక్షలతో టెండర్లు పిలిచినా ఇప్పటికీ మొదలు కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
  • విజయనగరం జిల్లా బొబ్బిలిలో భైరవసాగరం గట్టు వద్ద ఆరు వార్డులకు సంబంధించిన శ్మశానవాటిక అభివృద్ధి పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. రాణిమల్లమ్మదేవి పార్కు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని బిల్లులు అందని కారణంగా గుత్తేదారులు మధ్యలోనే ఆపేశారు.
  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పైవంతెన సమీపంలో శిథిలావస్థకు చేరిన తాగునీటి రిజర్వాయర్‌ స్థానంలో కొత్తది నిర్మించడానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసినా పనులు పునాదుల దశను దాటలేదు. దీని నిర్మాణానికి మొదట 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి రూ.1.50 కోట్లు కేటాయించినా సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. తర్వాత సాధారణ నిధుల నుంచి రూ.3.20 కోట్లు ఖర్చు చేయాలన్న పాలకవర్గం తీర్మానం మేరకు పనులకు శంకుస్థాపన చేయగా... మూడేళ్ల నుంచి 15% కూడా పూర్తి కాలేదు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని