జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Updated : 19 Apr 2024 06:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు పలువురు నిందితులు దాఖలు చేసిన 123కుపైగా డిశ్ఛార్జి పిటిషన్ల విచారణనూ వాయిదా వేసింది. నేతలపై ఉన్న కేసులను విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టి డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చాలంటూ సీబీఐ కోర్టుకు గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్లు, డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువ కావడంతో గడువు పొడిగించాలని సీబీఐ కోర్టు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు ఈ నెల 30 వరకు గడువు పొడిగించింది. ఈ నేపథ్యంలో డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రధాన కేసులతోపాటు డిశ్ఛార్జి పిటిషన్లనూ ఈ నెల 30కి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని