వైకాపా వైన్స్‌.. ప్రొప్రయిటర్‌ జగన్‌

రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి.

Updated : 20 Apr 2024 07:06 IST

సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ
షెడ్యూలుకు ముందే భారీగా మద్యం నిల్వలు
ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరకు
ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంప్‌లు
సహకరించిన అధికార యంత్రాంగం
నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు
పలు చోట్ల వెలుగుచూస్తున్న నిల్వలు
ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం
ఈనాడు - అమరావతి


తడబడిన మాట

నాడు మద్యాన్ని తీసేస్తానని.. నేడు పోసేస్తున్నారు


రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యమంత్రి సభల నుంచే చట్ట ఉల్లంఘన మొదలవుతోంది. ఇప్పటివరకూ ‘సిద్ధం’ సభలు-4, ‘మేమంతా సిద్ధం’ సభలు-12 నిర్వహించారు. ప్రతి సభకు 1,000 నుంచి 1,200 ఆర్టీసీ బస్సుల్లో జనాల్ని తరలిస్తున్నారు. వాటిలో ఎక్కిన కాసేపటి తర్వాత దారిలో మద్యం తీసుకొచ్చి లోడ్‌ చేస్తున్నారు. ప్రతి బస్సులో 98-100 క్వార్టర్‌ సీసాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో సభకు 1.15 లక్షల క్వార్టర్‌ సీసాలు పంపుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన 12 సభల్లో దాదాపు 14 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. సిద్ధం సభలవీ పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 20 లక్షలు దాటిపోతుంది. అసలంత మద్యం అధికార పార్టీ నాయకుల వద్దకు ఎలా చేరింది? మూడు సీసాలు ఉండటమే చట్టవిరుద్ధమైతే.. అన్ని లక్షల సీసాలు వారికి ఎలా చేరాయో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఎన్నికల సంఘానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ సభలకు జనాల్ని తరలిస్తున్న ఏ బస్సులో చూసినా, ఏ సభ వద్దకు వెళ్లినా కేసుల కొద్దీ మద్యం పట్టుబడుతుంది. కానీ ఎందుకు దాడులు చేయట్లేదు? అసలు వారికి అంత పెద్ద ఎత్తున మద్యం ఎలా సమకూరిందో ఎందుకు దర్యాప్తు జరపట్లేదు?

రెండు మార్గాల్లో...

వైకాపా నాయకులు రెండు మార్గాల్లో మద్యం సమకూర్చుకుంటున్నారు. వాసుదేవరెడ్డి ఇటీవలి వరకూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా కొనసాగడంతో ప్రభుత్వ దుకాణాల్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం సమకూర్చుకున్నారు. ఇప్పటికీ ఇది సాగుతోంది. ఇంకా గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సుంకం చెల్లించని మద్యం తెప్పించుకున్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను దాటించి మరీ ఇక్కడికి మద్యం తీసుకొస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. 2014 సమయంలోనే వైకాపా నాయకులు పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారుచేసి పంపిణీ చేశారన్న అభియోగాలున్నాయి. దీనిపై అప్పట్లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. కావలి వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అధికారంలో లేనప్పుడే అంత పెద్ద ఎత్తున దందా చేసిన వైకాపా నాయకులు.. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా పేట్రేగిపోతున్నారు.

మొన్న దర్శి.. నిన్న చిత్తూరు.. తాజాగా నగరి

మొన్న దర్శి, నిన్న చిత్తూరు, ఆలమూరు.. తాజాగా నగరి.. రాష్ట్రంలో ఎక్కడికక్కడే వైకాపా నాయకుల మద్యం డంప్‌లు బయటపడుతున్నాయి. అడ్డదారుల్లోనైనా సరే గెలవడమే లక్ష్యంగా మద్యం దారి పట్టిన అధికారపార్టీ నాయకులు.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే భారీగా మద్యం సమకూర్చుకుని వారి స్థావరాల్లో నిల్వ చేసుకున్నారు. ఇప్పటికీ తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లకు కొన్ని నెలలుగా వచ్చిన నిల్వలు.. వచ్చినట్లే తరలించేసుకుంటున్నారు. డిస్టిలరీలు, బ్రూవరీస్‌ నుంచి డిపోలకు వెళ్లాల్సిన సరకును తాము చెప్పిన పాయింట్ల వద్ద అన్‌లోడ్‌ చేయించుకున్నారు. ఇది చాలదన్నట్లుగా గోవా, కర్ణాటక, తెలంగాణల నుంచి లారీల కొద్దీ మద్యం తెప్పించుకుని నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం నామినేషన్ల తరుణంలో మద్యం సీసాలను బయటకు తెస్తుండటంతో పలుచోట్ల ఈ డంప్‌ల ఉనికి బయటపడుతోంది. వాస్తవంగా వైకాపా నాయకుల గోదాములు, ఇతర స్థావరాల్లో ఉన్న మద్యం నిల్వలతో పాటు, వారు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నది పోలిస్తే ఇప్పుడు పోలీసులు, సెబ్‌ సిబ్బంది, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పట్టుకుంటున్నది, వారికి పట్టుబడింది ఒక్క శాతమైనా లేదు.

ఖాన్సార్‌లా.. వైకాపా ముద్ర ఉందని వదిలేశారా?

సలార్‌ సినిమాలో మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ఓ వాహనంపై ఖాన్సార్‌ రాజముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉంటే రాష్ట్రాల, దేశాల సరిహద్దులు దాటినా ఎక్కడా తనిఖీలు ఉండవు. ఆ ముద్ర చూస్తేనే చాలు అందరూ వణికిపోతారు. అలాగే గోవా, కర్ణాటక, తెలంగాణల నుంచి పెద్ద ఎత్తున లారీల్లో వైకాపా నాయకులు ఏపీలోకి మద్యం తరలిస్తుంటే ఏ ఒక్కరూ వాటిని ఆపట్లేదు. పోలీసులు, సెబ్‌ సిబ్బంది ఇలా ఆపకపోవడానికి కారణం వారి స్వామిభక్తి.

గోవా, కర్ణాటక మద్యం ఏపీలోకి

డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులో... మండపేట నియోజకవర్గ వైకాపా ఎన్నికల పరిశీలకుడు సీహెచ్‌ ప్రభాకర్‌రావుకు చెందిన ఇటుకలబట్టీలో 130 బాక్సుల్లో 6,240 గోవా మద్యం సీసాల డంప్‌ పట్టుబడింది. ఆ సరకు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటాలి. ఎక్కడా చిక్కకుండా అంత మద్యం ఎలా తెచ్చారు? ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల్లో వీటిని తనిఖీ చేయలేదా? లేకుంటే అది వైకాపా నాయకులదని తెలిసి వదిలేశారా? పుత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ వైకాపా నాయకుడు ఒకరు శుక్రవారం పట్టుబడ్డారు. ఆరాతీస్తే ఆ కళాశాలలో 250 కేసుల మద్యం నిల్వలు ఉన్నట్లు తేలింది. నగరి నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంత్రి రోజా నామినేషన్‌ వేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి మద్యం పంపిణీ చేయడానికి తరలిస్తుండగా ఆ వైకాపా నాయకుడు చిక్కారు. ఇదంతా కర్ణాటక మద్యమే. చిత్తూరు డిప్యూటీ మేయర్‌ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై దాడిచేయగా... 170 కేసుల మద్యం పట్టుబడింది. ఇదంతా కర్ణాటక మద్యమే. ఈ దారిలో పదుల సంఖ్యలో చెక్‌పోస్టులున్నాయి. వాటన్నింటినీ దాటుకుని మరీ ఏపీలోకి మద్యం ఎలా వచ్చింది?

వైకాపా నాయకులదే మద్యం దందా

రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా.. సెబ్‌ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ను విచారిస్తే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంటికి తరలిస్తున్నట్లు తేలింది. అక్కడ తనిఖీ చేయగా.. 223 మద్యం కేసులు బయటపడ్డాయి. అవన్నీ పెద ఉల్లగల్లు, ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వ దుకాణాల నుంచి తరలించినవే. వైకాపా ముఖ్యనాయకుడు మేడం రమణారెడ్డి ఈ డంప్‌ నిర్వహిస్తున్నట్లు తేలింది.

తనిఖీ కేంద్రాలు పెట్టకుండా.. మద్యానికి రాచబాట

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జనవరి 9న విజయవాడ సీపీ కాంతిరాణాపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తుంటే ఎందుకు నిలువరించట్లేదని అప్పటి ఎస్పీ అన్బురాజన్‌ను ప్రశ్నించింది. తమిళనాడు, కర్ణాటక మద్యం వచ్చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని అప్పటి తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డిలను నిలదీసింది. మద్యం సరఫరా కాకుండా కట్టుదిట్టంగా నిలువరించాలని, సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం డిసెంబరు, జనవరి నెలల నుంచే ఆదేశించినా.. వైకాపాతో అంటకాగిన అధికారులు వాటిని లెక్కేచేయలేదు. మొదట్లో అసలు తనిఖీ కేంద్రాలే ఏర్పాటుచేయలేదు. తర్వాత వాటిని పెట్టినా మొక్కుబడి తనిఖీలకు పరిమితమయ్యారు. తనిఖీల్లోనూ వివక్ష చూపించి అధికారపార్టీ నాయకులు మద్యం అక్రమ రవాణాకు అడుగడుగునా సహకరించారు. అప్పట్లో నిల్వచేసిన మద్యాన్నే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు.

వైకాపా నాయకులు చెప్పిన చోటే అన్‌లోడ్‌

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఇటీవల వరకూ పనిచేసి ఈసీ ఆదేశాలతో బదిలీ వేటుకు గురైన వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు ముందుగానే భారీ ఎత్తున మద్యం నిల్వలు సమకూర్చుకున్నారు. షెడ్యూలు విడుదలకు ముందే వైకాపా ముఖ్య నాయకులు కోరుకున్న చోటకు వారికి కావాల్సినంత మద్యం చేరింది. కోడ్‌ అమల్లోకి వచ్చాక... ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, బార్లలో విక్రయాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గతేడాది ఇదే రోజున విక్రయించిన దానికంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదని నిర్దేశించింది. ఆ పరిమితి మేరకు చాలాచోట్ల సరకంతా వైకాపా నేతలకే చేరవేస్తున్నారు. తర్వాత విక్రయాలు లేవంటూ మధ్యాహ్నానికే దుకాణాలు మూసేస్తున్నారు. ఇతర రాష్ట్రాలది, ఏపీ మద్యం కలిపి ఇటుక బట్టీలు, గోదాములు, ప్రైవేటు కళాశాలలు, మారుమూల ప్రాంతాలు, స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యమే దిక్కా?

అధికార వైకాపా ఇప్పటికే రూ.కోట్లు కుమ్మరిస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యంపైనే ఆధారపడింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తే ఈ మద్యం డంప్‌లు భారీగా బయటపడే అవకాశముంది. గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.15.71 కోట్ల విలువైన 5.59 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవంగా ఇంతకు అనేక రెట్లు వైకాపా నేతల రహస్య స్థావరాల్లో ఉంది. దానిపై ఎన్నికల సంఘం దృష్టిసారించి.. దాడులు చేయాల్సిన అవసరం ఉంది.


పుత్తూరులో వైకాపా మద్యం డంప్‌ పట్టివేత

మంత్రి రోజా నామినేషన్‌ కోసం తెచ్చారని అనుమానాలు

చిత్తూరు, న్యూస్‌టుడే: మంత్రి రోజా నామినేషన్‌ను పురస్కరించుకుని అధికార వైకాపా నేతలు పంపిణీ కోసం దాచారని అనుమానిస్తున్న రూ.17.23 లక్షల విలువైన మద్యం డంప్‌ను తిరుపతి జిల్లా నారాయణవనం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎక్కడా అధికారపార్టీ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. సరకును విడుదల చేయాలని డీఎస్పీపై మంత్రి ఒత్తిడి చేసినా ఆయన పట్టించుకోలేదని సమాచారం. కర్ణాటక నుంచి భారీగా మద్యం తెచ్చి పుత్తూరులోని శ్రీవిద్య విద్యాసంస్థల యజమాని ఉమామహేశ్వర్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌ వేబ్రిడ్జి ప్రాంతంలోని గదిలో ఉంచారు. గురువారం అర్ధరాత్రి ఓ ఆటోలో తరలిస్తుండగా గోవిందపాళెం వద్ద నారాయణవనం పోలీసులు గుర్తించడంతో పోలీసులను చూసి ఆటోడ్రైవర్‌ ఉజ్జనాయుడు కండ్రిగ వైపు వెళ్లి మళ్లీ తిరుపతి-చెన్నై హైవేపైకి వచ్చారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఆటోను తనిఖీ చేసి, విచారించి.. డంప్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉన్న పుత్తూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ అల్లుడు, గుత్తేదారు తిరునావుక్కరసు, కామరాజ్‌నగర్‌కు చెందిన కృష్ణమూర్తి శివ, ఉమామహేశ్వర్‌, లీలాకృష్ణ, ఎంఎల్‌వో దిలీప్‌ను అదుపులోకి తీసుకుని 239 మద్యం కేసులు సీజ్‌ చేశారు. తాము రూ.17.23 లక్షల విలువచేసే మద్యం డంప్‌ స్వాధీనం చేసుకున్నామని పుత్తూరు రూరల్‌ సీఐ భాస్కర్‌నాయక్‌ నారాయణవనం పోలీసు స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని