మిగిలింది కన్నీరే

అయిదేళ్ల పాలనలో సీఎం జగన్‌ ఏనాడూ తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. రక్షిత నీరివ్వడం పాలకుల కనీస బాధ్యత అని ఎప్పుడూ ఆలోచించలేదు.

Published : 21 Apr 2024 06:32 IST

గుక్కెడు తాగు నీరివ్వని జగనన్న.. ‘నీరో’కు పెద్దన్న
వందల గ్రామాల్లో దాహం కేకలు
కరవు తరుముతున్నా మొద్దునిద్రే
5 ఏళ్లలో కానరాని కొత్త ప్రాజెక్టులు
గత ప్రభుత్వం చేపట్టినవీ నిలుపుదల
ఈనాడు - అమరావతి

యిదేళ్ల పాలనలో సీఎం జగన్‌ ఏనాడూ తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. రక్షిత నీరివ్వడం పాలకుల కనీస బాధ్యత అని ఎప్పుడూ ఆలోచించలేదు. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులున్నా అయిదారు నెలలుగా కోస్తా, రాయలసీమలోని వేల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నా దాన్నొక సమస్యగానే గుర్తించకుండా మొద్దునిద్రలో జోగారు. కరవును గుర్తించలేదు సరికదా దుర్భిక్షం వెంటాడుతున్న సమయంలోనూ కనికరం లేకుండా అక్కడక్కడా తిరిగే నీటి ట్యాంకర్లనూ నిలిపేయించారు. కిలోమీటర్లు ప్రయాణించినా బిందెడు నీరు దొరక్క జనం విలవిల్లాడుతుంటే తాను మాత్రం మేమంతా సిద్ధమంటూ వెళుతున్నారు. వైకాపా వచ్చాక రాష్ట్రంలో అయిదేళ్లుగా కొత్త తాగునీటి ప్రాజెక్టులు లేవు. 250కి పైగా రక్షిత నీటి పథకాల నిర్వహణకు నిధులివ్వకుండా చేసి వాటిని పాడుబెట్టారు. 

ఇంటింటికీ రక్షిత నీరిచ్చేందుకు తెదేపా హయాంలో ప్రారంభించిన రూ.26,769 కోట్ల ప్రాజెక్టును అటకెక్కించేశారు. ప్రతిపక్షనేతలపై దాడులు, అక్రమ కేసులే తప్ప ఓటేసిన ప్రజలకు గుక్కెడు నీరిచ్చి దాహం తీరుద్దామనే ఆలోచన గతంలో పంచాయతీరాజ్‌శాఖ చూసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ లేకపోయింది. తాగునీటి పథకాల నిర్వహణను పక్కన పడేసి గనులు, తవ్వకాలు, విద్యుత్తు కాంట్రాక్టులే లక్ష్యంగా ఆయన అధికారం వెలగబెట్టారు. ఆ శాఖ ప్రస్తుత మంత్రి ముత్యాలనాయుడికి రాష్ట్రంలో ఎక్కడెలాంటి పరిస్థితి ఉందో అసలే తెలియదు. తీవ్ర కరవు నేపథ్యంలో ఉపశమన ప్రణాళిక అమలు చేయాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి.. తనకు జీతమిచ్చే ప్రజల కంటే పదవిలో కూర్చోబెట్టిన జగన్‌ సేవే ముఖ్యం అన్నట్లుగా తరిస్తున్నారు.

డిసెంబరు నుంచే నీటి ఎద్దడి

రాష్ట్రంలో డిసెంబరు నుంచి నీటి ఎద్దడి మొదలైంది. పల్లెల్లో వేల బోర్లు నీరులేక మొరాయిస్తున్నాయి. చెరువుల్లో చుక్కనీరు లేదు. వాస్తవానికి 2023 ఆగస్టులో సాధారణం కంటే 55% తక్కువ వర్షపాతం నమోదైంది. అక్టోబరులో 88%, నవంబరులో 31% తక్కువ వానలు కురిశాయి. డిసెంబరులో తుపాను ప్రభావంతో వారంపాటు వానలు కురిసినా తర్వాత మళ్లీ కరవు పరిస్థితులే. ఈ ఏడాది జనవరిలో 77.5%, ఫిబ్రవరిలో 99% తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇంతగా వర్షాభావం వెంటాడుతుంటే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా.. ప్రజలకు తాగునీటి ఎద్దడి వస్తుందని ముందే ఆలోచిస్తుంది. ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. అయితే జగన్‌ సర్కారు మాత్రం పల్లెజనాన్ని బూటకపు మాటలతో మాయచేయాలనే చూస్తోంది.

నీళ్లు లేవు, నిధులూ ఇవ్వరు

తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభించి.. తర్వాత కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది. వైకాపా వచ్చాక ముందు అనుమతి తీసుకున్నాకే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించింది. ఆ అనుమతులకు కనీసం 10 రోజులు పడుతుండటంతో అప్పటి వరకు ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వందల గ్రామాల్లో తాగడానికి నీరు దొరకడం లేదు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోని అత్యధిక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నంద్యాల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల ట్యాంకర్ల యజమానులను ఒప్పించి నీటి సరఫరా చేయిస్తున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రజలు పది రోజులకోసారి స్నానం చేస్తున్నారంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని చోట్లా తాగునీటి సమస్య ప్రబలమవుతోంది. అధికారులు రూ.70 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా.. ముందు నీటి ఇబ్బంది లేకుండా చూడండి, నిధుల సంగతి తర్వాత చూద్దామని ప్రభుత్వం చెబుతోంది.


సీఎంను నిలదీస్తేనే.. నీరిస్తారా!

స్సు యాత్ర సందర్భంగా మార్చి 29న కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కొత్తూరు మహిళలు బిందెలతో వచ్చి తాగునీరు ఇవ్వాలంటూ సీఎంను నిలదీశారు. వారంతా రెండు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. జగన్‌ను అడ్డుకున్న తర్వాత తుంగభద్ర లోలెవల్‌ కెనాల్‌ నుంచి నీటిని తీసుకొచ్చి కుంటలో నింపారు. అంటే సీఎంను అడ్డుకుంటేనే నీరు.. లేదంటే పట్టించుకునే పరిస్థితే లేదు. మరోవైపు చాలా ప్రాంతాల్లో బిందెలతో మహిళలు రోడ్డెక్కుతున్నా వారంతా ఎక్కడ సీఎం దగ్గరకు వస్తారో అని పోలీసులు ముందే అప్రమత్తమై దగ్గరకు రానీయడం లేదు.


అబద్ధాల ఫిడేలు వాయిస్తూ..

తీవ్ర కరవు.. మండే ఎండలు.. అయిదారు రోజులకోసారి తాగునీళ్లు.. 10 రోజులకోసారి స్నానం.. ప్రకాశం సహా రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితులివి. ఇంతటి దుర్భిక్షంలోనూ ప్రజలగోడు పట్టించుకోని ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేసే ఆయనకు గ్రామాల్లో నీటి సరఫరాకు రూ.70 కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు రక్షిత నీరివ్వాలనే ప్రభుత్వ బాధ్యతను పక్కన పడేసి పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. గుక్కెడు నీరు దొరక్క జనం గొంతెండుతుంటే.. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి తీరున.. జగన్‌ కూడా ఎన్నికల బస్సెక్కి ఐప్యాక్‌ ప్రాయోజిత నటనతో అబద్ధాల ఫిడేలు వాయిస్తున్నారు. కరవు రోజుల్లోనూ కళ్లు తెరవని ఇలాంటి నేతలు మళ్లీ గెలిస్తే పల్లెలు బతికేదెలా? జనం గొంతు తడిచేదెలా?


సొంత జిల్లాలోనూ నీరివ్వలేని జగన్‌

ఉమ్మడి కడప జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రమైనా జగన్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. బిందెడు నీటి కోసం వ్యవసాయ పొలాల్లోకి, పొరుగు గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల నాలుగైదు రోజులకోసారి నీళ్లిస్తున్నారు. 18 మండలాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది.

  •  ఒంటిమిట్ట మండలం దర్జివపల్లిలో ప్రజలు తాగునీరు కొనుక్కుని తాగాల్సిన దుస్థితి ఉంది. నిరుపేద కుటుంబాలు మండుటెండల్లో గ్రామ సమీపంలోని పెన్నా నదిలోని చెలమల వద్దకెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. గతంలో ఒకటి, రెండు అడుగుల్లో లభించే ఊటనీరు అక్రమ ఇసుక తవ్వకాలతో 15 అడుగుల దిగువకు వెళ్లిపోయింది.
  •  సంబేపల్లి మండలం శెట్టిపల్లె పంచాయతీ దొడ్డిసిద్దయ్యగారిపల్లెలో నెల రోజులుగా నీటి సమస్య వెంటాడుతోంది. పనులు కూడా మానుకుని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు.
  • పులివెందుల నియోజకవర్గంలోని పెద్దూరులో ట్యాంకర్ల ద్వారా అరకొరగా ఇచ్చే నీటితోనే దాహం తీరుతోంది. చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లెలో కుళాయి నీరు రావడం లేదు. తోటల్లోని పంపుసెట్ల వద్దకు వెళ్లి రోజూ నీరు తెచ్చుకుంటున్నారు.
  • మైలవరం మండలం వద్దిరాలలో బోర్లు ఎండిపోయినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లపై దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు.
  • రాయచోటి మండలం కాటిమాయకుంట పంచాయతీ కురవపల్లెలో మూడువారాలుగా దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పంచాయతీ బోర్ల నుంచి నీరివ్వకపోవడంతో సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తున్నారు.
  • జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం జంగాలపల్లెలో ప్రజలు.. ఎద్దులబండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీటిని తెచ్చుకుంటున్నారు.

నీళ్లిచ్చేదాకా ఓట్లు వేయం

‘గ్రామానికి నీళ్లిచ్చేవరకు ఓట్లేయం. బిందెడు నీటికి రెండు కి.మీ. వెళ్లాల్సి వస్తోంది. పది రోజులకోసారి స్నానాలు చేస్తున్నాం. రోజూ బయటకు వెళ్లే పిల్లలూ నీరు లేక స్నానాలు చేయడం లేదు. ఎమ్మెల్యే ఏడాదికోసారి గ్రామానికి వస్తుంటారు. ఏం చేశారని వారికి ఓట్లేయాలి? తాగునీటి సమస్యను పరిష్కరించాలి’.

గోవిందమ్మ, ములకలపెంట, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా


కొట్లాటలు అవుతున్నాయి

‘నీటి కోసం పంపుల దగ్గర కొట్లాటలు జరిగి పోలీస్‌స్టేషన్ల వరకు వెళుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కాలనీలో పంపులు వేసినా ఎప్పుడు నీరిస్తారో తెలియదు. పనులు మానుకుని ఎదురు చూడాలి. సమస్య పరిష్కారానికి ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు’

జార్జి ముల్లర్‌, నిడుమోలు, కృష్ణా జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని