ఎట్టకేలకు దుర్గారావు విడుదల

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న తెదేపా నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు.

Updated : 21 Apr 2024 09:41 IST

గులకరాయి కేసులో నాలుగు రోజులుగా పోలీసుల నిర్బంధంలో
 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడానికి సిద్ధమవడంతో శనివారం రాత్రి విముక్తి

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు: ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న తెదేపా నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ నాలుగు రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలుకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెరకాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ‘ఎన్నిసార్లు వేడుకున్నా కనికరంలేదా.. నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి’ అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. 

చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్‌ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. మళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.

సీపీ కార్యాలయం వద్ద మహిళలు కన్నీటి పర్యంతం

దుర్గారావు ఆచూకీ విషయమై శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దాదాపు 60 మంది వడ్డెర కులస్థులు సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరి నేతృత్వంలో మహిళా పోలీసులు వారిని చుట్టుముట్టారు. రోడ్డుపై నిరసనలకు వీల్లేదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళలను, సంఘ పెద్దలను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. నాలుగు రోజులుగా దుర్గారావును ఎక్కడ దాచి ఉంచారని మహిళలు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసుకుని బతికే తమను రోడ్డు పైకి ఈడ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను, వడ్డెర నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనా పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో వెనక్కి తగ్గారు. ‘నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి’ అంటూ వేముల దుర్గారావు భార్య శాంతి, ఇతర మహిళలతో కలిసి భీష్మించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా ఆటోల్లో డీసీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారు టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరికి వినతిపత్రం అందించారు.

నీ వెనుక ఎవరున్నారని నిలదీశారు

విడుదలైన అనంతరం దుర్గారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘ఈనెల 16వ తేదీన.. సింగ్‌ నగర్‌ డాబాకొట్ల రోడ్డులోని టీకొట్టు వద్ద టీ తాగుతున్నా.. అంతలోనే పోలీసులు వచ్చి మాట్లాడాల్సిన పని ఉందంటూ వాహనం ఎక్కించారు. ఇంటరాగేషన్‌ మొదలుపెట్టారు. నేను ఏ తప్పూ చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబిచ్చాను. సీసీఎస్‌లో నన్ను, సతీష్‌ను పక్కపక్క గదుల్లో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి.. జగన్‌పై రాయి వేస్తే రూ. వెయ్యి ఇస్తానన్నావట కదా అని అడిగారు. సతీష్‌ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరినీ కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్థమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారు..’ అని దుర్గారావు వివరించారు. తొలుత నన్ను.. విజయవాడ సీసీఎస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. తర్వాత మైలవరంలోని సీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2 వరకు ఉంచారు. అక్కడి నుంచి మళ్లీ విజయవాడ సీసీఎస్‌ స్టేషన్‌కు తెచ్చారు. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు’ అని తెలిపారు. 

22న మేజిస్ట్రేట్‌ ఎదుట సతీష్‌ వాంగ్మూలం రికార్డు!

మరోవైపు ఈ కేసులో నిందితుడు సతీష్‌ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్‌ సిద్ధం చేసినా పోలీసులు దానిని పక్కనపెట్టి.. మేజిస్ట్రేట్‌ వద్ద వాంగ్మూలం నమోదుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు రాయి విసిరిన సమయంలో చూసిన వారు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 164 కింద సతీష్‌ను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లి అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది సోమవారం కావచ్చని తెలిసింది.

తుపాకీతో బెదిరించారట

‘జైలులో సతీష్‌ను కలసి మాట్లాడాం. ఏం జరిగిందని అడిగితే.. పోలీసులు తనను చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపించి బెదిరించారని చెప్పాడు. అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు. తానేం చేయలేదు. తనకు ఏ సంబంధం లేదని అంటున్నాడు.’

 నిందితుడు సతీష్‌ తండ్రి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు