బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు

‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్‌పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు.

Updated : 22 Apr 2024 07:01 IST

సతీష్‌ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్లు తనతో చెప్పించారు
నన్నూ భయపెట్టాలని చూశారు.. గట్టిగా నిలబడ్డా
పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బందే
‘ఈనాడు’తో తెదేపా నాయకుడు వేముల దుర్గారావు

ఈనాడు, అమరావతి: ‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్‌పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. చేయని నేరానికి నేను నాలుగు రోజులు పోలీసు కస్టడీలో ఉండాల్సి వచ్చింది. రోజుకు అయిదు గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నేను వారికి భయపడి ఉంటే.. నన్ను ఈపాటికి జైల్లో పెట్టేవారు’ అని పోలీసుల చెర నుంచి శనివారం రాత్రి విముక్తుడైన తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన, తన కుటుంబ సభ్యులతో కలసి న్యాయవాది సలీం కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. పోలీసు కస్టడీలో తన అనుభవాలను దుర్గారావు ‘ఈనాడు’తో పంచుకున్నారు.

రాయి వేయించినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి

‘నన్ను గత వారం సింగ్‌నగర్‌ నుంచి వన్‌టౌన్‌లోని సీసీఎస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌)కు తీసుకెళ్లారు. రోడ్‌షోలో సీఎం జగన్‌పైకి రాయి ఎందుకు వేశావని ప్రశ్నించారు. నువ్వే రాయి వేయించావటగా అని గద్దించి అడిగారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేనే చేయించానని చెప్పడానికి రుజువు చూపించమని అడిగా. దీనికి పోలీసు అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నువ్వు మర్యాదగా అంగీకరిస్తే శిక్ష తగ్గే మార్గం చూస్తాం. లేదంటే నీ ఇష్టం అని బెదిరించారు. చేయని నేరాన్ని అంగీకరించేది లేదని బలంగా నిలబడ్డా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. దానికి సాక్ష్యం మా దగ్గర ఉందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేను. స్థానిక తెదేపా కార్యాలయంలో ఉన్నా.. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించాను’ అని దుర్గారావు తెలిపారు.

మానసికంగా ఇబ్బంది పెట్టారు

‘విజయవాడ సీసీఎస్‌ నుంచి 18వ తేదీన నన్ను మైలవరం సర్కిల్‌ కార్యాలయానికి తరలించారు. ఏంటి ఇక్కడికి తెచ్చారని ప్రశ్నించే సరికి.. సాయంత్రానికి పంపిస్తాములే అని పోలీసులు చెప్పారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ సాగింది. రెండుసార్లు కొట్టారు. దీని కంటే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు చెప్పాల్సిందే... లేకపోతే రేపటికైనా తెలుస్తుందని బెదిరించారు. మా సామాజికవర్గం వారినే ఏడుగురిని తీసుకెళ్లి.. నన్ను ఇరికిద్దామని పెద్ద ప్లాన్‌ చేశారు’  అని వివరించారు.

ఖాళీ కాగితాలపై సంతకాలు

‘నాకు మున్ముందు పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నేను తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందున నన్ను లక్ష్యంగా చేసుకుంటారు. శనివారం (20వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల సమయంలో నన్ను మైలవరం సీఐ కార్యాలయం నుంచి మళ్లీ విజయవాడ వన్‌టౌన్‌లోని సీసీఎస్‌కు తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో నార్త్‌ ఏసీపీ, సింగ్‌నగర్‌ సీఐ నా వద్దకు వచ్చి.. నీ పాత్ర ఏమీ లేదు.. నిన్ను వదిలేస్తున్నామని చెప్పి.. కొన్ని ఖాళీ కాగితాలు ఇచ్చి సంతకాలు చేయమన్నారు. ఎటూ ఇంటికి వెళుతున్నానులే అని సంతకాలు చేశా. తర్వాత 160 సీఆర్పీసీ నోటీసులపై సంతకాలు తీసుకుని.. మా ఇంటి వద్ద రాత్రి పొద్దుపోయాక వదిలిపెట్టారు. వాటిపై పోలీసులు ఏమి రాసుకుని భవిష్యత్తులో నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయంగా ఉంది’ అని తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు.


ఎదురుతిరిగే సరికి పోలీసులు కొట్టారు

‘నన్ను అదుపులోకి తీసుకున్న రోజు తెల్లవారుజామున మా కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న సతీష్‌ను పక్క గది నుంచి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఆ యువకుడిని బెదిరించి.. నేను చెప్పిన మీదటే రాయి వేసినట్లు చెప్పించారు. నేను నిన్ను ఎప్పుడు కలిశాను? రాయి వేయమని ఎప్పుడు చెప్పాను అని సతీష్‌ను అడిగాను. ఏం మాట్లాడకుండా బిక్క మొహం వేసి చూస్తుండిపోయాడు. అతడిని భయపెట్టి చెప్పించారని నాకు అర్థమైంది. మీరు నన్నెందుకు ఈ కేసులో ఇరికిస్తున్నారని పోలీసులతో వాదనకు దిగాను. దీంతో వారు ఆగ్రహంతో నాపై రెండు దెబ్బలేశారు. నీ వెనుక ఎవరున్నారో..? వాళ్ల పేర్లు చెప్పు.. అని నన్ను వెనక్కి తోశారు. సతీష్‌ మా కాలనీకి చెందిన వ్యక్తే. కాకపోతే నాకు పరిచయం లేదన్నాను. బొండా ఉమా నీ వెనుక ఉండడంతో నువ్వే చేయించావటకదా అని పోలీసు అధికారులు నన్ను అడిగారు. నేను చేయనప్పుడు ఆయన నా వెనుక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానమిచ్చాను’ అని దుర్గారావు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు