భూమి నీదే.. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం!

‘భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైకాపా నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..?

Updated : 22 Apr 2024 17:21 IST

అయినా మమ్మల్ని ఏమీ చేయలేవ్‌.. కోర్టుకు వెళ్లలేవు
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తెచ్చాం.. నీదైనా నిరూపించుకోలేవు
వైకాపా అరాచకాలకు దర్పణం పట్టిన జనసేన టీజర్‌

ఈనాడు-అమరావతి: ‘భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైకాపా నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..? ఈ ఇతివృత్తంతో జనసేన రూపొందించిన టీజర్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో.. అన్నదాతల తలరాతలు ఎలా మారబోతున్నాయో, రాత్రికి రాత్రే భూముల్ని ఎలా కొట్టేస్తారో రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న టీజర్‌లో తెలియజేశారు. ‘ఎంత అధికారం మీదైతే మాత్రం రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారా?’ అని సామాన్య పౌరుడు ప్రశ్నిస్తే.. ‘నిజమే.. అయితే నువ్వేం చేయగలవు’ అని ఎదురుదాడి చేసే ప్రజాప్రతినిధి తీరు అధికార పార్టీ దురాగతాలకు అద్దం పడుతోంది. ప్రజాప్రతినిధి పాత్రలో సినీ నటుడు పృథ్వీ నటించారు. ‘చెమటలు పడుతున్నాయా.. ఫ్యాన్‌ వేయమంటావా?’ అని పృథ్వీ అడిగితే.. ‘అయిదేళ్లు వేసింది చాలయ్యా’ అని సామాన్యుడి పాత్రధారి సాగనంపే రీతిలో సమాధానమిస్తారు. ‘ఇలాంటి వారిని మనమేమీ చేయలేమా’ అని ఆవేదన వ్యక్తం చేసే సామాన్యుడి కుమార్తె ప్రశ్నకు.. ఓటుతోనే సమాధానం చెప్పగలమనే సందేశం ఇచ్చారు.

మేం తెచ్చిన చట్టమే.. అధికారీ మావాడే!

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ అనే కొత్త చట్టాన్ని తెచ్చింది వైకాపా ప్రభుత్వమే. అక్కడ టైటిల్‌ రిజిస్టర్డ్‌ అధికారి (టీఆర్‌వో) అని ఒకరు ఉంటారు. రాత్రికి రాత్రే ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే.. కోర్టుకెళ్లే వీలుండదు. టీఆర్‌వో దగ్గరకెళ్లి మీ భూమి మీదే అని నిరూపించుకోవాలి’ అని పృథ్వీ చెప్పే సంభాషణలు అధికారపక్ష నేతల అరాచక శైలిని ప్రతిబింబించాయి. ఆ ‘అధికారిని ఏర్పాటు చేసేదే ప్రభుత్వమైనప్పుడు.. ఆయన ప్రభుత్వంలోని వైకాపా నేతల మాటే వింటాడుగానీ.. రైతుల గోడు పట్టించుకుంటారా’ అనే ప్రశ్నలూ సంధించారు. ‘వైకాపా ప్రభుత్వంలో భూమి కబ్జాకు గురైతే.. ఎవరైనా చేయగలిగేదేమీ ఉండదు. ఎంతోకొంతకు సెటిల్‌ చేసుకోవడమే’ అని అంతిమంగా రైతుల్లోని భయాలను వెల్లడించే ప్రయత్నం చేశారు.

వెర్రిపప్పా.. అంటే బుజ్జినాన్నా అని అర్ధం

భూమిని ఆక్రమించడమే కాకుండా, తమనేమీ చేయలేరని మితిమీరిన అహంకారంతో విర్రవీగే ప్రజాప్రతినిధి.. చివరకు ఆ సామాన్యుడిని ‘వెర్రిపప్పా’ అంటూ దూషిస్తారు. ఆ వెంటనే అదేమీ తిట్టు కాదని, వాడుక భాషలో బుజ్జినాన్నా అని అర్థమని సమర్థించుకుంటారు. తణుకు నుంచి పోటీ చేస్తున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గతంలో రైతుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని