నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా

మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్‌ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు.

Updated : 23 Apr 2024 06:51 IST

ఐదేళ్లుగా దళిత, గిరిజనులకు జగన్‌ నమ్మకద్రోహం
వారి ప్రత్యేక సంక్షేమ పథకాల రద్దు
విద్య, ఉపాధి అవకాశాలపై దెబ్బ
రాజ్యాంగ హక్కులనూ కాలరాశారు
వారికి నాణ్యమైన బతుకే లేకుండా చేసిన దుర్మార్గం
విదేశీ విద్యకు అంబేడ్కర్‌  పేరు తీసేసే బరితెగింపు
ఈనాడు, అమరావతి

నోరు తెరిస్తే... నా ఎస్సీలు, నా ఎస్టీలని బాకా...

వారి మద్దతుతోనే అధికారంలోకి వస్తానని ధీమా...

కానీ... ఐదేళ్ల పాలనలో

వారికి ఎకరం పొలం ఇవ్వాలన్నా చేయిరాలేదు
స్వయం ఉపాధి రుణాలివ్వటానికి మనసొప్పలేదు
ఉన్నత చదువుల ఆశలకు గండికొట్టారు...
విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారు...
అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను నామమాత్రం చేశారు...
సంక్షేమ వసతి గృహాలను వదిలేశారు...
ఇన్ని రకాలుగా నిరు పేదలను చావుదెబ్బ కొట్టి...
నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ రాగం అందుకోవడం జగన్‌కే చెల్లింది!

మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్‌ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. వారి కోసమే దశాబ్దాలుగా అమలైన పథకాలను రద్దు చేశారు. వారి బిడ్డలకు ఉన్నత చదువులు అందే అవకాశాలు మొదలు... సంక్షేమం వరకు అన్నింటికీ పాతరేశారు. వారి అభివృద్ధికి మాత్రమే ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధులనూ మళ్లించారు. అందరికీ ఇచ్చే పింఛన్లు, ఉపకార వేతనాలు, ఇతర పథకాలకే వారిని పరిమితం చేశారు. ఇదే గొప్ప సాయమంటూ ప్రచారం చేసుకున్నారు. ఐదేళ్లుగా ‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ గుండెలు బాదుకుంటూనే జగన్‌ చేసిన ద్రోహమిది. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ చేయని దారుణమిది.


జగన్‌ దెబ్బ-10

కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత

వైద్య రంగానికి రాష్ట్రంలో తానే పురుడు పోసినట్టు ప్రగల్భాలు పలికే జగన్‌... కొత్త వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కకుండా కుతంత్రాన్ని నడిపారు. వాటిలో 50శాతం సీట్లు అమ్మకానికి పెట్టారు. అంటే ఆ మేరకు రిజర్వేషన్‌లోనూ కోత పడినట్లే. డబ్బు పెట్టి సీటు కొనగలిగే స్తోమత ఎస్సీ, ఎస్టీలకు ఉంటుందా? ఉన్నా అది ఎంత మందికి సాధ్యం...? ఇది తెలిసీ తన నిర్ణయాన్ని అమలు చేశారంటే అణగారిన వర్గాలకు వైద్య విద్య అందకూడదనే కదా?


జగన్‌ దెబ్బ-9

ప్రైవేటు పీజీ చదువులపైనా కత్తి

ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు కేంద్రమిచ్చే ఆర్థిక సాయాన్ని కూడా తన ఖాతాలోకి వేసుకున్న ప్రభుత్వమిది. పైగా ఏ ప్రభుత్వమూ విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంటే ఇవ్వలేదన్నట్లుగా జగన్‌ ఇన్నాళ్లూ కట్టుకథలు చెప్పారు. అంతటితోనే ఆగకుండా ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటుగా పీజీ చదివేందుకు గత ప్రభుత్వాలు అందించిన చేయూత కూడా లేకుండా చేశారు. ప్రైవేటులో పీజీ చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటును సైతం రద్దు చేశారు. అంటే వారు ఉన్నత విద్య చదవడం ఆయనకు ఇష్టం లేనట్టే కదా?


జగన్‌ దెబ్బ-8

అవన్నీ సంక్షోభ వసతి గృహాలు

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని వైకాపా ప్రభుత్వమే సర్వే చేయించి తేల్చింది. నాడు-నేడు కింద రూ.3,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు ఆయా పనులకు అతీగతీ లేదు. విద్యార్థులు ఉండటానికి సరైన వసతి లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో పిల్లల్ని కుక్కుతున్నారు. చాలాచోట్ల సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. దుప్పట్లు, దోమతెరల మాట దేవుడెరుగు చాలాచోట్ల తినడానికి పళ్లాలు, నీళ్లు తాగేందుకు గ్లాసులూ సరిపడా లేని దుస్థితి. అయినా జగన్‌ పట్టించుకున్న దాఖలాలే లేవు. మరో దారుణమైన విషయమేంటంటే... విద్యార్థులకు డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలను నాలుగు నెలలుగా చెల్లించడంలేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన జగన్‌ తాను పిల్లలకు మేనమామనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆఖరికి వంట చేసుకోడానికి సరిపడా గ్యాస్‌ కూడా ప్రభుత్వం అందించడం లేదు. పిల్లలే బయటకు వెళ్లి వంటచెరకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని జగన్‌ ఎంతగా క్షోభకు గురిచేస్తున్నారో... ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి?


జగన్‌ దెబ్బ-7

సివిల్స్‌లో శిక్షణకు విముఖత

తెదేపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులుగా మారితే చూడాలని కలలుకంది. అందుకే సివిల్‌ సర్వీసెస్‌ పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ ఇలా కోరుకున్నచోట ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది. ఒక్కో విద్యార్థిపై రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు ఖర్చు చేసింది. పుస్తకాలు, మెటీరియల్‌, ఇతర ఖర్చులకు నెలనెలా రూ.12 వేల చొప్పున 9 నెలలపాటు అందించింది. మొత్తంగా 1,200 మంది ఎస్సీ విద్యార్థులకు, 910 మంది గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించింది. జగన్‌ అధికారంలోకి రాగానే దీన్ని కూడా రద్దు చేశారు.


జగన్‌ దెబ్బ-6

పోటీలో నిలవకుండా కుట్ర

పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను కూడా నామమాత్రంగా మార్చేశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. తెదేపా హయాంలో వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, డీఎస్సీ, బ్యాంకు క్లర్క్‌, పీవో, పోలీస్‌ కానిస్టేబుల్‌, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్‌-డి(రైల్వే), ఇతర పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చారు. అప్పట్లో విజయవాడలో శిక్షణ తీసుకున్న 385 మంది విద్యార్థుల్లో 121 మంది, తిరుపతిలో 402 మందిలో 78 మంది ఉద్యోగాలు సాధించారు. విశాఖ స్టడీ సర్కిల్‌లోనూ వందల మందికి శిక్షణ అందించారు. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత మొదటి రెండేళ్లు స్టడీ సర్కిళ్లను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకసారి మాత్రమే సివిల్‌ సర్వీసెస్‌కు, గ్రూప్‌-1, బ్యాంకు పీవో ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించినా అది నామమాత్రమే.


జగన్‌ దెబ్బ-5

విదేశీ విద్యకు కొర్రీలు

తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించి, వారు గొప్పగా జీవించేలా చేయాలనేది తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేర్చేందుకు గత ప్రభుత్వాలు చేసిన సాయాన్ని జగన్‌ వారికి దూరం చేశారు. దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఆ పథకానికి ఉండే అంబేడ్కర్‌ పేరును తీసేసి తన పేరును పెట్టుకున్నారంటేనే ఆయన ఆలోచన తీరేంటో ఇట్టే తెలిసిపోతుంది. 15 దేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెదేపా ప్రభుత్వం అవకాశం కల్పించి 2014-19 మధ్య 491 మందికి ఆర్థికసాయం అందించింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు పథకాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా ఎక్కడలేని నిబంధనలు తెచ్చి అర్హుల సంఖ్యను కుదించారు. క్యూఎస్‌ ర్యాకింగ్‌లో టాప్‌ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత నిబంధనలు మరింత కఠినతరం చేసి టాప్‌-50 ర్యాంకుల్లో(సబ్జెక్టుల వారీగా) సీటు పొందిన వారికి మాత్రమే సాయం చేస్తామన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయమే జరిగింది. వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు విదేశీ విద్య కింద సాయానికి అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు 50 మందికి కూడా మించలేదు. ఇక అర్హత సాధించిన ఎస్టీ విద్యార్థులు ఎందరో తెలుసా? ఒక్కరంటే ఒక్కరే. జగన్‌ చేసిన దారుణానికి ఇంతకంటే రుజువు ఏంకావాలి?


జగన్‌ దెబ్బ-4

కేంద్ర సాయానికీ మోకాలడ్డు

జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ)లు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ రాష్ట్రం మోకాలడ్డింది. కేంద్రమిచ్చే నిధులకు తనవంతు వాటా కలిపి రుణాలివ్వకుండా... దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది. ఈ సంస్థలు టర్మ్‌ లోన్‌ పేరిట గరిష్ఠంగా రూ.50 లక్షలు, సూక్ష్మరుణం కింద రూ.3 లక్షల వరకు ఇస్తాయి. రాయితీ గరిష్ఠంగా 50% ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60% రుణానికి... రాష్ట్రం 35% రాయితీని జోడించి ఇవ్వాలి. లబ్ధిదారుడి వాటా 5%. కానీ, వైకాపా ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపేసింది. 2015-19 మధ్య రాష్ట్రంలో 23 వేల మంది ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకుపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ టర్మ్‌ రుణాల కింద ఏపీకి రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్రం రాయితీ ఇవ్వలేదు. గిరిజనుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు మొత్తం ప్రక్రియనే నిలిపేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయని జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన రూ.38 కోట్లతో ఇటీవల 100 మందికి మురుగు శుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.


జగన్‌ దెబ్బ-3

స్వయం ఉపాధికి చెల్లు

సొంత కాళ్లపై నిలబడి పేదరికం నుంచి బయటపడేందుకు అణగారిన వర్గాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు తిరుగులేని దన్నుగా నిలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఉద్దేశించిన స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాన్ని జగన్‌ తీసేశారు. తెదేపా ప్రభుత్వంలో 40-90% రాయితీతో రూ.1-5 లక్షల వరకు రుణాలుగా ఇచ్చారు. ఏటా లక్షల మంది లబ్ధిపొందారు. ఇదేకాకుండా రూ.85 కోట్లు ఖర్చు చేసి 1,739 మందికి ఏడు సీట్ల కార్లను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందించారు. కానీ, జగనేం చేశారో తెలుసా? 2019లో 3.15 లక్షల మంది ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ఒక్కరికంటే ఒక్కరికి కూడా రాయితీ రుణాలు అందించలేదు. పైగా తెదేపా ప్రభుత్వం ఎస్సీలకు ఉపాధి కల్పించేందుకు వినియోగించిన రూ.200 కోట్లు బ్యాంకుల్లో ఉంటే తీసేసుకుని ఇతర పథకాలకు మళ్లించారు.


జగన్‌ దెబ్బ-2

సాగుకు సెంటు భూమీ ఇవ్వలేదు

భూమి ఉన్న వారి జీవితాలకు ధీమా దక్కుతుంది. ఎస్సీల జీవనానికి భరోసా కల్పించడానికి గత ప్రభుత్వాలు తపనపడ్డాయి. వారికి మేలు చేకూర్చేందుకు శతథా ప్రయత్నించాయి. అందులో భాగంగా 30 ఏళ్లుగా ఎస్సీల కోసం వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని జగన్‌ రద్దు చేశారు. ఈ పథకం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి, సాగుకు అనుకూలంగా మార్చి ఇవ్వాలి. 1988 నుంచి 2019 వరకు 23,802 మంది ఎస్సీ మహిళలకు 24 వేల ఎకరాలను అందించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఒక సెంటు సాగుభూమిని ఇవ్వలేదు. 2019 బడ్జెట్‌లో రూ.35 కోట్లు కేటాయించి, తర్వాత ఇతర పథకాలకు మళ్లించారు.


జగన్‌ దెబ్బ-1

బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌కు గండి

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించి, ప్రోత్సహించేందుకు బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని గత తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను జల్లెడ పట్టి వారు కోరుకున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చదివేందుకు అవకాశమిచ్చింది. వారికి పుస్తకాల నుంచి యూనిఫాం వరకు సమకూర్చింది. ఇలా 2014-19 మధ్య 1.40 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క పథకం కోసమే ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌... తొలి దెబ్బ వీరి మీదనే వేశారు. బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని రద్దు చేశారు. అంతేకాదు... పథకాన్ని కొనసాగించాలని ఎస్సీ సంఘాలు న్యాయస్థానంలో పోరాటం చేస్తే... జగన్‌ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి చివరికి మొట్టికాయలు తిన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎంత కక్ష ఉంటే వారి బిడ్డలకు అందే పథకాన్ని అమలు చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతారు? తెదేపా ప్రభుత్వం ఈ పథకాన్ని 3 నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తే... జగన్‌ 9, 10 తరగతులకే పరిమితం చేశారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందనే. లేదంటే దాన్ని కూడా కొనసాగించడం ఆయనకు ఇష్టమే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని