వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?

మారు సుధాకర్‌రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు.

Published : 23 Apr 2024 08:12 IST

మంత్రి కాకాణి ప్రధాన అనుచరుడి వద్ద పట్టుబడ్డ భారీ డంప్‌
ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ కాకాణి వైపే
లోతుగా దర్యాప్తు చేయకుండా తేల్చేస్తున్న పోలీసులు
సర్వేపల్లిలో వైకాపా వద్ద లక్ష సీసాల మద్యం ఉన్నట్లు ప్రతిపక్షాల ఆరోపణ
కల్తీ మద్యం కావచ్చన్న అనుమానాలు

ఈనాడు, అమరావతి: మారు సుధాకర్‌రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. ఆయన ఇంట్లో భారీగా మద్యం నిల్వలున్నాయన్న ఫిర్యాదుతో సెబ్‌, పోలీసు సిబ్బంది ముత్తుకూరు మండలం పంటపాళెంలో తనిఖీలకు వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న సుధాకర్‌రెడ్డి 4,232 పైగా మద్యం సీసాలను 20 బస్తాల్లో నింపి మూడు కార్లలో తరలించేందుకు ప్రయత్నించారు. సెబ్‌, పోలీసు సిబ్బంది వెంబడించి, సుధాకర్‌రెడ్డి కారులో 7 బస్తాల్లో ఉన్న మద్యం సీసాలను పట్టుకున్నారు. మిగతా 13 బస్తాల మద్యం ఆయన బంధువుల రొయ్యల చెరువులో డంప్‌ చేసినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున ఓటర్లకు పంపిణీ చేసేందుకే వీటిని నిల్వ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంటపాళెంలో పట్టుబడ్డ మద్యంలో రాయల్‌ ప్యాలెస్‌, వైట్‌హాల్‌ బ్రాండ్ల సీసాలున్నాయి. ఇవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే బ్రాండ్లు. ఒకరి వద్ద మూడుకు మించి మద్యం సీసాలు ఉండటం నేరం. అలాంటిది వైకాపా నాయకుడి వద్దకు అన్ని వేల మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన సరకును నేరుగా డిపోల నుంచి వైకాపా నాయకుడి ఇంటికి చేర్చారా? లేదంటే మద్యం దుకాణాల నుంచే తరలించారా? అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇది సాధ్యమవుతుందా? ఎవరి కోసం వీటిని నిల్వ చేశారు? వాటికి డబ్బులు చెల్లించింది ఎవరనే కోణంలో తీగలాగితే.. ఆ డొంకంతా కాకాణి వద్దకే వెళ్తుంది. అయితే సెబ్‌, పోలీసు సిబ్బంది మద్యంతో పట్టుబడ్డ వారిపైనే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

వైకాపాది మొదటి నుంచీ అదే తీరు

వైకాపా నాయకులు 2014 ఎన్నికల సమయంలో గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. అందులో హానికారక రసాయనాలు ఉన్నాయని తెలిసినా వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో అప్పట్లో ఈ నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి వైకాపా నాయకులపై 32 కేసులు నమోదయ్యాయి. 87 మంది అరెస్టయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ సీఐడీకి అప్పగించింది. న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో తాజాగా పట్టుబడిన మద్యం డంప్‌పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించి స్వతంత్రంగా దర్యాప్తు చేయించకపోతే.. ప్రజల ప్రాణాలతో అధికార పార్టీ నాయకులు మళ్లీ       చెలగాటమాడతారు.


కల్తీ మద్యం తయారు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

న్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే వైకాపా నాయకులు, కార్యకర్తల ఇళ్లు, గోదాములు, రహస్య స్థావరాల్లో దాదాపు లక్షకు పైగా క్వార్టర్‌ సీసాల మద్యం నిల్వ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మద్యం సీసాలు ప్రభుత్వ దుకాణాల నుంచి వెళ్లటం కష్టం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా నాయకులే కల్తీ మద్యం తయారు చేయించారు. దాని సీసాలపై నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లు వేసి ఓటర్లకు పంచారు. ఆ మద్యం తాగి అప్పట్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో అప్పట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్‌ కంసాని గోపాలకృష్ణస్వామి (అప్పూ)తో కలిసి ఈ కల్తీ మద్యం దందా నడిపించారనేది అభియోగం. ఏ అధికారమూ లేనప్పుడే వైకాపా నాయకులు కల్తీ మద్యం తయారుచేయించారు. ఇప్పుడు అధికారంలో ఉండటంతో 2014 మాదిరిగానే కల్తీ మద్యం తయారు చేసి నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లతో కూడిన సీసాల్లో నింపి ఓటర్లకు పంచడానికి సిద్ధం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని