జాతీయ రహదారిని.. జగన్‌కు రాసిచ్చేశారా?

నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్‌ డైలాగ్‌. సీఎం జగన్‌ కూడా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు.

Updated : 24 Apr 2024 09:42 IST

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర  పేరిట వాహనదారులపై యుద్ధం
చెన్నై- కోల్‌కతా హైవేపై నిత్యం నరకమే
ప్రతిచోటా ఐదారు గంటలు ట్రాఫిక్‌ నిలిపేస్తున్న పోలీసులు

ఈనాడు - అమరావతి: నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్‌ డైలాగ్‌. సీఎం జగన్‌ కూడా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. తన ఇడుపులపాయ ఎస్టేట్‌లో తిరిగినట్లుగా జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. వేల మంది వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి నరకం చూస్తున్నా సరే.. రోజుల తరబడి ఆ హైవేపై బస్సు యాత్ర చేస్తూ.. మధ్యలో బహిరంగ సభల్లో పాల్గొంటూ అందరికీ చుక్కలు చూపిస్తున్నారు. వాహనదారులు ఎలా పోతే నాకేంటి అంటూ తాపీగా బస్సు యాత్ర చేస్తున్నారు. హైవేపై సీఎం బస్సు యాత్ర షెడ్యూల్‌ను కేవలం ఒకటి, రెండు రోజుల ముందు వైకాపా ఖరారు చేస్తుంటే.. పోలీసులు వెనువెంటనే అనుమతులిచ్చేస్తున్నారు. అప్పటికప్పుడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్ర పరిధిలో ఉండే ఈ హైవేపై సైతం సీఎం బస్‌ వెళ్లేందుకు వీలుగా ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. ఇలా సీఎం హాయిగా ఏసీ బస్సులో యాత్ర చేస్తుంటే.. మండుటెండలో వాహనదారులు హైవేపై ఐదారు గంటలు నరకయాతన పడుతున్నారు.  

15 కి.మీ. ముందే నిలిపేస్తూ..

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి నిత్యం సగటున 60-70 వేల వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళలకు రాకపోకలు సాగించేందుకు ఇదే అత్యంత కీలకమైన హైవే. దీనిపై పది నిమిషాలు అంతరాయం కలిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతుంది.  జగన్‌ బస్సు యాత్ర ఈ హైవేపైకి చేరినప్పటి నుంచి నిత్యం అయిదారు గంటలు ట్రాఫిక్‌ నిలిపేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడా వాహనాలు ఆగకూడదు. అత్యవసర పరిస్థితిలో ట్రాఫిక్‌ నిలపాల్సి వస్తే వాహనాలు మళ్లించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ జగన్‌ బస్సు యాత్రలో అటువంటిదేమీ ఉండటం లేదు. హైవే పైనే అయిదారు గంటలు ట్రాఫిక్‌ ఆపేస్తున్నారు. ఆయన బస్సు 15 కి.మీ. దూరంలో ఉండగానే ఇరువైపులా వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ హైవే నెల్లూరు నుంచి తాడేపల్లి వారధి వరకు ఆరు వరుసలుగా ఉంది. గన్నవరం నుంచి దెందులూరు వరకు కూడా ఆరు వరుసలే. వీటికి సర్వీసు రోడ్లు కూడా ఉన్నాయి. సీఎం ఒకవైపు వెళ్తుంటే, మరొకవైపు ట్రాఫిక్‌ను వదలొచ్చు. అయినా ఏ వాహనాన్ని వెళ్లనివ్వకుండా పోలీసులు అష్టదిగ్బంధం చేస్తున్నారు.


నరకం చూపిస్తున్న జగన్‌

న బస్సు యాత్రతో వాహనదారులు, ప్రయాణికులకు జగన్‌ నరకం చూపిస్తున్నారు. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. జగన్‌ ప్రయాణిస్తున్న బస్సు, కాన్వాయ్‌ రాకపోకల కోసం హైవేలో అనేకచోట్ల అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. నెల్లూరు వైపు నుంచి బస్సు యాత్ర వస్తున్నప్పుడు కావలి వద్ద కుడివైపు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సీఎం బస్‌, కాన్వాయ్‌ అక్కడికి వెళ్లడానికి హైవేపై డివైడర్‌ను తవ్వేశారు. గుంటూరు శివారులోని ఏటుకూరు వద్ద కూడా ఇదే పరిస్థితి. అయినా సరే అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని