నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్‌ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?

నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్‌ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 25 Apr 2024 05:50 IST

విస్మయం కలిగిస్తున్న సీఎస్‌ ప్రతిపాదనలు

ఈనాడు-అమరావతి: నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్‌ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపాతో అంటకాగుతూ, ఆ పార్టీకి మేలు కలిగించడం కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అలాంటి ఆరోపణలే ఉన్న సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌ పేరును ఈ ప్యానల్‌ జాబితాలో జవహర్‌రెడ్డి ప్రతిపాదించడం విస్మయం కలిగిస్తోంది.

వైకాపా చెప్పినదే చేస్తారని సంజయ్‌పై ఫిర్యాదులు

వైకాపా నాయకులు చెప్పిందే చట్టం.. వారి ఆదేశాలే శాసనం అన్నట్లుగా సంజయ్‌ పనిచేస్తారనే ఫిర్యాదులున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబుపై నైపుణ్యాభివృద్ధి కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేసిన సమయంలో సంజయ్‌ అత్యుత్సాహం చూపిస్తూ.. రాజకీయ నాయకుడి మాదిరిగా ప్రకటనలిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దిల్లీ, హైదరాబాద్‌ల్లో ప్రెస్‌మీట్లు పెట్టి వైకాపా ఎజెండాను భుజాలకెత్తుకుని మాట్లాడారన్న విమర్శలున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సర్వీసు, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆయన మాట్లాడారంటూ తెదేపా అప్పట్లో ఫిర్యాదు చేసింది. అలాంటి ఫిర్యాదులు, విమర్శలూ ఉన్న అధికారి పేరును ఎన్నికల వేళ.. కీలకమైన నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ఎలా ప్రతిపాదిస్తారు? అలాంటప్పుడు ఇదివరకు ఉన్న అధికారుల్ని బదిలీ చేసి ప్రయోజనమేంటి? ఇది ఈసీ కళ్లకు గంతలు కట్టడం కాదా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు