పేరుకే పెంపు.. ఊకదంపు

పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్‌ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!!

Updated : 25 Apr 2024 13:55 IST

ఆరోగ్యశ్రీ పై ప్రచార ఆర్భాటం
ఉచిత వైద్యమంటూ పేదోళ్లకు జగన్‌ వంచన
పథకానికి అస్వస్థత... రోగులకు అవస్థ
నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనూ అదనపు వసూళ్లు
ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్‌ విధానంలోనే చికిత్స
గొప్పలు చెప్పడంలో మాత్రం ముందున్న సీఎం

పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్‌ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! బీమా కార్డు తీసుకెళితే ధీమా దక్కడంలేదు! అయినా గొప్పలు చెప్పుకోవడంలో జగన్‌ తగ్గేదేలేదు!!

ముఖ్యమంత్రి జగన్‌... ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురిచేసి, అనారోగ్య పీడితుల్ని వంచిస్తున్నారు. నవరత్నాల్లో పేర్కొన్న ప్రకారం ఈ పథకం సేవలను ఉద్ధరించేసినట్లు తన భుజాలను తానే చరుచుకుంటున్న సీఎం తీరు విస్తుగొలుపుతోంది. చికిత్స చేసే వ్యాధుల సంఖ్యను, ఖర్చు చేసే డబ్బుల పరిధినీ పెంచామని ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడికి వెళ్లినా ఉచిత చికిత్స దొరుకుతుందని ఊదరగొడుతున్నారు. గ్రీన్‌ఛానెల్‌ ద్వారా ట్రస్టు కార్యకలాపాలకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామనీ బాకాలు ఊదుతున్నారు. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆసుపత్రులకు రూ.800 కోట్ల వరకు బిల్లుల బకాయిలు ఉండటమే ఇందుకు తార్కాణం. ట్రస్టుకు ప్రతినెలా రూ.300 చెల్లించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వైద్యం సక్రమంగా అందడంలేదు. సొంతంగా ఖర్చులు భరించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలడంలేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నా పట్టింపే లేదు. సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు అల్టిమేటం ఇవ్వడం, చివరి నిమిషంలో ప్రభుత్వం ఎంతోకొంత సర్దుబాటు చేయడం... ఐదేళ్లుగా ఒక ఆనవాయితీగా మారిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అత్యవసరంగా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లిన రోగులకు ఆరోగ్యశ్రీ కింద తక్షణమే చికిత్స అందడం లేదు. రోగుల వివరాలను ట్రస్టుకు పంపి, అక్కడి నుంచి ప్రీ-ఆథరైజేషన్‌ వచ్చే వరకు వేచి చూస్తున్నారు. అప్పటివరకు చేసిన చికిత్సకు ఫీజులు వసూలు చేస్తుండటం గమనార్హం.

వ్యాధి నిర్ధారణ పేరిట అదనపు వసూళ్లు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చేరిన వారికి ఉచితంగా చికిత్స, శస్త్రచికిత్సలు చేయాలంటే వారికి అంతకుముందు జరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా ఫీజులు వసూలు చేయకూడదు. అయితే... ఆసుపత్రుల వారు రోగులకు రూ.10-30 వేల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. వారం తర్వాత రావాలని పంపిస్తూ... అప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు. ఆపరేషన్‌ జరిగి, ఇళ్లకు వెళ్లిన అనంతరం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఫాలోఅప్‌ కింద రూ.10 వేల విలువైన వైద్యసేవలను ఉచితంగా పొందే అవకాశముంది. ఈ అవకాశాన్ని ప్రతి వంద మందిలో 10% మందే ఉపయోగించుకుంటున్నా అధికారులు దృష్టి పెట్టడంలేదు.

వాటా చెల్లించే ఉద్యోగులకూ చుక్కలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఉద్యోగస్తుల ఆరోగ్య పథకం’ కింద ఇచ్చిన కార్డులను ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు గౌరవించడంలేదు. ఉద్యోగులంతా కలిసి ప్రభుత్వానికి ప్రతినెలా రూ.225, రూ.300 చొప్పున మొత్తం రూ.218 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఇవ్వాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి 22 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో అనారోగ్యానికి గురైన వారు బీమా కార్డులతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే... చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు త్వరగా రావడంలేదని, రీయింబర్స్‌మెంట్‌ కింద మాత్రమే చికిత్స అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లించి, చికిత్స పొందుతున్నారు.

సగం కోత... అదీ ఆరు నెలల తర్వాతే చెల్లింపు

పొందిన చికిత్సకు తగ్గట్లు ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి రీయింబర్స్‌మెంట్‌ కింద దరఖాస్తు చేసుకోవడం, పరిశీలన పూర్తవడం, తిరిగి చెల్లింపులు జరగడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. చికిత్స/శస్త్రచికిత్సకు ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు రూ.2 లక్షల వరకు వసూలు చేస్తే... ప్రభుత్వం 50% కోత విధిస్తోంది.

ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో విశ్రాంత, ఒప్పంద ఉద్యోగుల ఇష్టారాజ్యం నడుస్తోంది. దీనిపై సీఎంవో ప్రభావం ఎక్కువగా ఉంది. ట్రస్టు తరఫున ఆసుపత్రుల ఎంపిక, వాటిపై వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల మీద జరిగే విచారణలు, జరిమానాల విధింపుల్లో... రాజకీయ జోక్యం, వసూళ్ల దందా భారీగా ఉంటోందనే ఆరోపణలున్నాయి.

చికిత్సలపై ప్యాకేజీ ధరల ప్రభావం

చాలా చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ఛార్జీలు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ఆస్పత్రులు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. స్పందన లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు రకరకాల దారులు వెతుక్కుంటున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు శస్త్రచికిత్స పరికరాలను ఒకరికంటే ఎక్కువ మందికి వాడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ‘ఆరోగ్యశ్రీ’ కింద గుండెకు బైపాస్‌ సర్జరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,18,881 ఇస్తోంది. అదే ఆపరేషన్‌కి ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేంద్రం రూ.1,84,500 ఇస్తోంది. ఇదేకాకుండా పెద్దలు, పిల్లల్లో హృద్రోగ సమస్యల్ని సరిదిద్దేందుకు చేసే వందకుపైగా శస్త్రచికిత్సలకు...కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ డబ్బులివ్వడం పేదలపాలిట శాపంగా మారింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను ప్రతి ఏడాది సమీక్షిస్తేనే తమకు కార్డుతో చికిత్స అందుతుందని, లేదంటే నెలనెలా వాటా చెల్లిస్తున్న నష్టపోతున్నామని ఉద్యోగుల సంఘం నేత ఒకరు వాపోయారు.

నగరాల్లో పరిమితంగా సేవలు

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ప్రయోజనం పొందే వారు తక్కువగా ఉన్నారు. పైగా బిల్లుల చెల్లింపులు సక్రమంగా లేనందున చాలా ఆసుపత్రులు అత్యవసర కేసులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాయి. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందకపోవడంతో రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.


క్లెయిమ్‌లు పంపక... ‘ఆసరా’ రాక..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగిన వారికి ఆసరా కింద రూ.5 వేల వరకు అందాలి. వీరి  వివరాలను ఆసుపత్రుల వారు ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్‌ చేయకపోవడంతో అర్హతలున్న వారికి కూడా ఆర్థిక సాయం అందడంలేదు. దాంతో వారంతా నష్టపోతున్నారు.


గుండె సమస్యలతో ఏటా 6వేల మంది జననం

రాష్ట్రంలో గుండె సంబంధిత సమస్యలతో ప్రతి ఏడాది 6వేల మంది శిశువులు జన్మిస్తుంటారని అంచనా. వీరిలో 80% మందికి ఆపరేషన్లు చేయాల్సిందే. బాధితుల్లో అత్యధికులు పేదలే. ముఖ్యంగా పిల్లల గుండెల్లో రంధ్రం పూడ్చడానికి ఖర్చులనే పరిగణనలోకి తీసుకున్నా ఒక్కొక్కరికి రూ.95 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతుందని, ప్రభుత్వం రూ.87 వేలు మాత్రమే ఇస్తోందని ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. పిల్లల గుండె శస్త్రచికిత్సలకు వాడే వైద్య పరికరాలకు పెద్దవారితో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని వెల్లడించారు. ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులు ప్రస్తుతం తిరుపతి (ప్రభుత్వ)లో ఒకటి, విజయవాడ (ప్రైవేటు)లో మరోటి ఉన్నాయి. విజయవాడ, విశాఖలో ప్రత్యేకంగా రెండు ఆసుపత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు.


కాగ్‌ హెచ్చరించినా బేఖాతర్‌

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులను వేగంగా చెల్లించకుంటే... దాని ప్రభావం రోగులకు అందించే వైద్యంపై పడుతుందని కాగ్‌ హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. క్లెయిమ్‌ పంపిన 60 రోజుల్లో జరగాల్సిన చెల్లింపులకు కొన్నిసార్లు 400 రోజుల సమయం పడుతుండటం గమనార్హం. ఈ ఆసుపత్రుల్లో అందిన చికిత్సలపై థర్డ్‌ పార్టీ ద్వారా క్లినికల్‌, మెడికల్‌, డెత్‌ ఆడిట్‌లు చేయించడం లేదనీ కాగ్‌ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని