ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్‌ కాపీలే!

నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది.

Updated : 28 Apr 2024 20:10 IST

త్వరలో వాటి ద్వారానే  క్రయ, విక్రయాలు!
వైకాపా ప్రభుత్వ యత్నాలపై సర్వత్రా మండిపాటు

ఈనాడు, అమరావతి: నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. ప్రస్తుతానికి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు, ఈ-స్టాంప్‌ పేపర్లపైనా కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. క్రమంగా స్టాంప్‌ పేపర్ల స్థానంలో కేవలం ఈ-స్టాంప్‌ పేపర్ల పైనే లావాదేవీలు జరిగేలా చేసేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేయింబవళ్లు శ్రమించి.. సంపాదించిన డబ్బుతో జీవితంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే జరిగే ఆస్తుల కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు కేవలం కాగితాలపైనే (జిరాక్స్‌ మాదిరిగా) చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లపైనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ కారణంగా పాత తేదీలతో పత్రాలు సృష్టించి వివాదాలు తెస్తున్నారని, నాసిక్‌ నుంచి స్టాంపులు రప్పించడం భద్రతాపరంగానూ కష్టంగా ఉందని సాకులు చెబుతూ వైకాపా ప్రభుత్వం ఈ-స్టాంపింగ్‌ విధానం అమలుకు తెరలేపింది. నిజానికి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లయితే ఎంతకాలమైనా దాచుకోడానికి వీలుగా ఉంటాయి. కానీ.. ఈ-స్టాంప్‌ల మన్నిక కూడా తక్కువ. ఇవి ఇంచుమించు జిరాక్స్‌ కాపీల్లాగే కనిపిస్తున్నాయి. విలువైన ఆస్తుల కొనుగోళ్ల విషయంలో ఇలాంటి ప్రయత్నాలు తగవని జనం మండిపడుతున్నారు.

ఇదొక తలనొప్పి..

రిజిస్ట్రేషన్ల విషయంలో సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య కార్డ్‌ 2.0 ప్రైమ్‌ డేటా ఎంట్రీ విధానం తీసుకొచ్చి గందరగోళం చేసింది. తాజాగా పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం తీసుకురావాలని భావిస్తోంది. దాని ద్వారా 135 రకాల డాక్యుమెంట్లను ఎవరికి వారే తయారు చేసుకునేలా.. డెమో రూపంలో పరిశీలించి, సమస్యలు ఉంటే చెప్పాలని ఎంపిక చేసిన 16 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. ఎవరికివారు ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్‌రిజిస్ట్రార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేస్తారు. అనంతరం ప్రింటు తీసుకొని వెళ్లిపోవచ్చు. దాన్నే ఆస్తి దస్త్రంగా భావించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో కొనుగోలు, అమ్మకందారులు తమకు నచ్చిన వివరాలను పొందుపరచడానికి వీలుపడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు