యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు

పోలింగ్‌ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. లెట్స్‌ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్‌ నిర్వహించాయి.

Updated : 28 Apr 2024 06:28 IST

పోలింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: పోలింగ్‌ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. లెట్స్‌ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్‌ నిర్వహించాయి. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతీ, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ ‘ దేశ భవిష్యత్తు, రాష్ట్రం అభివృద్ధి యువ ఓటర్ల భుజస్కంధాలపై ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఎప్పుడూ యువ ఓటర్లను ప్రోత్సహిస్తుంది.

గతేడాది అక్టోబర్‌లో 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లు 2.5 లక్షలు మాత్రమే ఉండగా.. ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10.3 లక్షల మంది యువ ఓటర్లను నమోదు చేశాం. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి’  అని పిలుపునిచ్చారు. ‘పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ శాతం బాగా పెరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి’ అని కోరారు. అనంతరం ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటామని యువతీ, యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, పలు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని