గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్‌ఛానల్‌!

సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 28 Apr 2024 06:28 IST

అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నేతల ‘మద్య’ మార్గం
గోవాలో నాసిరకం సరకు తయారుచేయించి, రాష్ట్రానికి రప్పిస్తున్న వైనం
మూడు రాష్ట్రాలు దాటి ఎలా వస్తుందో విచారించని అధికారులు
ఈనాడు - అమరావతి

సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు ‘మద్య’ మార్గం పట్టిన కొందరు నాయకులు భారీ కుట్రకు తెరతీశారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది ఓటర్లకు మద్యం పంపిణీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే గోవాలో మద్యం అక్రమంగా తయారు చేసే డిస్టిలరీల్లో నామమాత్రపు ఖర్చుతో నకిలీ మద్యాన్ని తయారు చేయిస్తున్నారు. ఉదాహరణకు ఏపీలో క్వార్టర్‌ మద్యం సీసా కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకూ ఖర్చవుతుంది. అదే గోవాలో నకిలీ మద్యం తయారు చేయిస్తే క్వార్టర్‌కు రూ.20- రూ.30 వెచ్చిస్తే చాలు. దీంతో అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేయించి వాటిని సీసాల్లో నింపి అచ్చం అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హాలోగ్రామ్‌లు అతికించి, సీళ్లు వేయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఈ మద్యం అత్యంత నాసిరకమైనది. దీన్ని తాగితే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. అయితే కొంతమంది వైకాపా నాయకులు మాత్రం పోయేది ప్రజలే కదా! మనకేం నష్టం అన్నట్లుగా ప్రజల ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు. నకిలీ, హానికరమైన మద్యాన్ని రాష్ట్రాలు దాటించి తీసుకొస్తుంటే పోలీసులు, సెబ్‌ అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘పెద్ద’ల ఆదేశాలతో గ్రీన్‌ ఛానల్‌?

ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు వారి రహస్య స్థావరాలు, డంప్‌ల్లో నిల్వ చేసిన మద్యంలో ప్రస్తుతం పట్టుకున్నది, పట్టుబడింది కనీసం ఒక్క శాతమైనా ఉండదు. వందల కోట్ల విలువైన మద్యాన్ని వారు ఇప్పటికే నిల్వ చేసుకున్నారు. ఇంకా తెచ్చుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో గోవా మద్యం వారికి ఎలా చేరుతోంది? దాదాపు మూడు రాష్ట్రాలు.. దారి పొడవునా పదుల సంఖ్యలో చెక్‌పోస్టులను దాటుకుని మరీ రాష్ట్రంలోకి ఈ మద్యం ఎలా వస్తోంది? ఎక్కడా తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదు? సరకు వైకాపా నాయకులదని వదిలేశారా? లేకుంటే అడ్డుకోవద్దని పెద్దల ఆదేశాలతో ప్రత్యేకంగా ఆ మద్యం తీసుకొచ్చే వాహనాలను ఎవరూ ఆపకుండా ‘గ్రీన్‌ ఛానల్‌’ ఏమైనా ఏర్పాటు చేశారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో మద్యం సరఫరా కాకుండా నిలువరించాలని, తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం డిసెంబరు, జనవరి నెలల్లోనే ఆదేశించింది. వైకాపాతో అంటకాగిన అధికారులు మొదట్లో తనిఖీ కేంద్రాలే ఏర్పాటు చేయలేదు. తర్వాత పెట్టినా మొక్కుబడి తనిఖీలే.

మిథున్‌రెడ్డిని ఎందుకు విచారించరు?

ఊరూరా వైకాపా నాయకులు మద్యం నిల్వ చేసినా.. సెబ్‌, పోలీసు అధికారులు, తనిఖీ బృందాలు వారికి నిర్దిష్టంగా సమాచారం, ఫిర్యాదులు అందితేనే దాడులు చేస్తున్నాయి. కేసు పెట్టేసి మమ అనిపించేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన్ను ఓడించాలని అధికార వైకాపా తొక్కని అడ్డదారులు లేవు. తాజాగా వైకాపా నాయకుల ఇళ్లల్లోనే 48,720 మద్యం సీసాలు పట్టుబడినా సూత్రధారులెవరో పోలీసులు తేల్చట్లేదు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే గోవా మద్యం ఏపీలోకి తీసుకొచ్చి, ఓటర్లకు పంచుతున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఆయనకు నోటీసులిచ్చి ఎందుకు విచారించట్లేదు? వైకాపా అభ్యర్థి తరఫున పంపిణీకే ఈ మద్యం నిల్వ చేసుకున్నప్పుడు వైకాపా అభ్యర్థి వంగా గీతపై ఎందుకు కేసు నమోదు చేయట్లేదు?
- 2014 ఎన్నికల సమయంలోనూ వైకాపా నాయకులు గోవాలో నకిలీ మద్యం తయారు చేయించి.. సీసాలపై నకిలీ లేబుళ్లు వేసి ఓటర్లకు పంచారు. ఆ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత సర్వేపల్లి, కావలి వైకాపా అభ్యర్థులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు వైకాపా నేతలపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి.


ఊరూరా గోవా మద్యమే

క్క పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని నలుగురు వైకాపా నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీ చేస్తే 48,720 సీసాల మద్యం పట్టుబడింది. ఇదంతా గోవా సరకే. విలువ రూ.80 లక్షల పైమాటే. నందిగామ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్‌రావు నామినేషన్‌ సందర్భంగా దాదాపు 20 వేలకు పైగా క్వార్టర్‌ సీసాలను పంపిణీ చేశారు. ఇవన్నీ గోవా బ్రాండ్లే. తాజాగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైకాపా ఎన్నికల పరిశీలకుడు సీహెచ్‌ ప్రభాకర్‌రావుకు చెందిన ఇటుకల బట్టీలో పట్టుబడిన 6,240 మద్యం సీసాలూ గోవా నుంచి తెచ్చినవే.  ఇప్పటి వరకూ పట్టుబడ్డ గోవా మద్యమంతా వైకాపా నాయకుల వద్దే దొరికింది. అందువల్లే పోలీసులు, సెబ్‌ అధికారులు వాటి గుట్టు తేల్చే దిశగా దర్యాప్తుపై దృష్టిసారించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని