రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది

జగన్‌ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది.

Updated : 29 Apr 2024 07:41 IST

వైకాపా ఇసుక దోపిడీ స్క్రిప్ట్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్టు!
బినామీ గుత్తేదారులతో వ్యాపారం
అనంతరం రంగంలోకి ‘ముఖ్య’నేత సోదరుడు
ఆన్‌లైన్‌ చెల్లింపుల్లేవ్‌! అంతా నగదు రూపంలోనే
ఎన్నికలవేళ వైకాపా విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నదంతా అదే?
కోర్టులు, ఎన్జీటీ ఆదేశాలనూ కరివేపాకులా పక్కనపడేసి దందా
ఈనాడు, అమరావతి

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు... అన్నారు భర్తృహరి...
                 * * *
ఐదేళ్ల పాలనలో ఆ అసాధ్యాన్నీ ‘సాధ్యం’ చేసింది జగన్‌ సర్కారు!
అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేసి... ‘తైలాన్ని’ పిండుకొంది!
వేల కోట్ల రూపాయాలు అప్పనంగా కొల్లగొట్టింది!
ఉచిత విధానం రద్దు చేసి... డిజిటల్‌ చెల్లింపులకు స్వస్తి చెప్పి...
మూడేళ్లలో రూ.మూడువేల కోట్లు సంపాదించడమంటే మాటలా!
ఎన్ని నదుల్ని గుల్ల చేశారో... ఎందరి కార్మికుల పొట్ట కొట్టారో..
ఇసుకగుంతలు తీసి ఎంతమందిని పొట్టనపెట్టుకున్నారో..
న్యాయస్థానాల ఆదేశాలు పక్కన పెట్టి..
ఎన్జీటీ సూచనలు పెడచెవిన పెట్టి..
ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి..  
అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఎన్నికల్లో ఖర్చుపెడుతూ..
ఏ రాష్ట్రానికి లేని ఘనత జగన్‌ ప్రభుత్వం సాధించింది.

జగన్‌ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. ‘రూ.వేల కోట్లు ఊడ్చేయడం’ అనే స్క్రిప్ట్‌ను పక్కాగా ముందే రాసుకుంది. దానిని అమలుచేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ‘‘ఆన్‌లైన్‌, డిజిటల్‌ చెల్లింపులకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా, కేవలం నగదు తీసుకొని.. అదే నగదుని ఎన్నికల అవసరాల కోసం వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ దాచిపెట్టి, ఎన్నికల వేళ ఆ నోట్ల కట్టలను బయటకు తీయాలి’’ అనే స్క్రిప్ట్‌ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అందుకే అధికారపార్టీ నేతలు ఎన్నికలవేళ ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడటంలేదు. ఇటీవల సీఎం నిర్వహించిన ఒక్కో సిద్ధం సభకు వేల ఆర్టీసీ బస్సులు బుక్‌చేయగా.. వాటికి రూ.కోట్లను కేవలం నగదుగా చెల్లించారంటే ఆ సొమ్ము ఎక్కడిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. మొత్తంగా అయిదేళ్లలో ప్రజలపై జగన్‌ ప్రభుత్వం ఇసుక రూపంలో రూ.4,200 కోట్ల మేర భారం వేసింది.

50 లక్షల మందిని రోడ్డున పడేసి..

గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్‌, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. జగన్‌ సీఎం అయిన వెంటనే ఉచిత ఇసుక విధానం రద్దుచేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. అయిదారు నెలలపాటు ఇసుక దొరకడం గగనమైపోయింది.

ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి రోజు కూలీలు రోడ్డునపడ్డారు. భవననిర్మాణ రంగానికి అనుబంధంగా 40 రంగాలకు చెందినవారికి పనులు లేకుండాపోయి పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నింటిలో కలిసి 20 లక్షల మంది కార్మికశాఖలో నమోదై ఉన్నారు. ఇలా నమోదు చేసుకోనివారు మరో 30 లక్షల మంది ఉంటారు. ఇలా మొత్తంగా 50 లక్షల మందికి అయిదారు నెలలపాటు పనుల్లేక అల్లాడిపోయారు.

వ్యాపారంగా మార్చేసిన జగన్‌ ప్రభుత్వం

నదుల్లో లభించే ఇసుకను వైకాపా ప్రభుత్వం ఆదాయ మార్గంగా ఎంచుకుంది. 2019 సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించింది. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు అప్పగించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించినా, ఎక్కువ మందికి ఇసుక లభించలేదు. దీంతో ప్రైవేటు సంస్థలకు ఇసుక వ్యాపారం అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రజలను పిండేసి.. రూ.4,200 కోట్లు వసూలు

అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఇసుక రూపంలో రాష్ట్ర ప్రజలపై వేసిన భారం అధికారికంగా రూ.4,200 కోట్ల వరకు ఉంది. తొలుత 20 నెలలు ఏపీఎండీసీ ఇసుక విక్రయాలు చేసినప్పుడు ప్రజల నుంచి రూ.1,680 కోట్లు రాబట్టారు. తర్వాత ప్రైవేటు గుత్తేదారులు వచ్చాక రూ.2,520 కోట్లు పిండేశారు. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా.. ప్రభుత్వానికి లెక్కచూపకుండా పెద్దలు చేసిన దోపిడీ రూ.3 వేల కోట్లకు పైనే ఉంది. ఇది కాకుండా గుత్తేదారులు దోచుకున్నది కూడా భారీగానే ఉంది.


పొరుగు రాష్ట్రాలకు నిత్యం వందల లోడ్లు

రాష్ట్రంలో 2021లో ప్రైవేటు సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించారు. అప్పటినుంచి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందల లారీల ఇసుక లోడ్లు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు.. అనంతపురం, కడప జిల్లాల నుంచి బెంగళూరుకు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి చెన్నైకి ఇసుక తరలిస్తున్నారు. ఆయా నగరాల్లో ఓ టిప్పర్‌ లోడ్‌కు రూ.లక్ష వరకు వస్తుండటంతో.. అక్రమంగా ఇలా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు.


అసలు స్క్రిప్ట్‌ మొదలైంది అప్పుడే..

2021 జనవరిలో టెండర్లు పిలిస్తే రాష్ట్రంలోని మూడు ప్యాకేజీలను ఉత్తరాదికి చెందిన జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌(జేపీ) సంస్థ దక్కించుకునేలా వ్యూహం రచించారు. టన్ను ఇసుక ధరను రూ.475కి పెంచేశారు. అయితే ఈ టెండర్లకు రెండు వారాల ముందు చెన్నై కేంద్రంగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ పుట్టుకొచ్చింది. చెన్నైకి చెందిన మైనింగ్‌ వ్యాపారి.. వైకాపా పెద్దలకు అత్యంత సన్నిహితుడు... టర్న్‌కీ సంస్థ వెనుక ఉన్న అసలు సూత్రధారి. ఆ సంస్థ ఇసుకలో ఉపగుత్తేదారుగా రంగప్రవేశం చేసి కనీవినీ ఎరగని రీతిలో దోచేసింది.


నగదు ఇచ్చి తీరాల్సిందేనని హుకుం

అంతకు ముందు ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలకు ఆన్‌లైన్‌ చెల్లింపులు మాత్రమే తీసుకుంటే.. టర్న్‌కీ వచ్చాక కేవలం నగదు వసూలు చేశారు. ప్రతి రీచ్‌లో వసూలైన నగదును హైదరాబాద్‌లోని ప్రభుత్వ పెద్దలు చెప్పినచోట అందజేస్తూ వచ్చారు. ముద్రిత బిల్లులు జారీచేస్తూ గనులశాఖకు తప్పుడు లెక్కలు చూపారు. రీచ్‌ల్లో అక్రమాలు బయటకు రాకుండా అక్కడుండే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు.


టర్న్‌కీని పంపేసి.. సిండికేట్లను తెచ్చి

అత్యధిక మొత్తం ఇసుకలో దోచేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావించడంతో.. ‘ముఖ్య’నేత సోదరుడే సీనులోకి వచ్చారు. 2022 ఆగస్టులో ఉపగుత్తేదారు టర్న్‌కీని పంపించేశారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ సిండికేట్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాను కీలక నేతకు అప్పగించారు. ఆ నేతలు జిల్లాల్లో రీచ్‌ల వారీగా ఎవరు ఎక్కువ సొమ్మిస్తే వారికి కట్టబెట్టారు. వాళ్ల నుంచి ప్రతినెలా సొమ్ము వసూలుచేసి.. అందులో నామమాత్రంగా కొంతే ప్రభుత్వానికి లెక్క చూపించి, మిగిలినదంతా దారిమళ్లించారు.

ఆత్మహత్య చేసుకునే వరకు వదల్లేదు..

సిండికేట్లు జిల్లాల్లో ఇసుక వ్యాపారులను పిండి పిప్పిచేశాయి. వీరి ఒత్తిళ్లకు తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు గతేడాది మార్చిలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల్లో రూ.21 కోట్లు నష్టమొచ్చినా.. ఆ సొమ్ము కోసం ఒత్తిడి చేయడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కడప జిల్లాలో ఓ ఇసుక రీచ్‌ కోసం నారాయణరెడ్డి అనే వ్యక్తి.. ఆ జిల్లా సిండికేట్‌ నిర్వాహకుడైన ఆర్టీసీ ఛైర్మన్‌ సోదరుడు వీరారెడ్డికి రూ.81 లక్షలు ఇచ్చారు. కొద్దిరోజులు రీచ్‌లో తవ్వకాలు జరిపాక, అనుమతులు లేవంటూ నిలిపేశారు. అతడి సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో గతేడాది జూన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

బకాయిలు చెల్లించని జేపీ

జేపీ సంస్థ ఇసుక వ్యాపార ఒప్పంద గడువు 2021 మే నుంచి 2023 మే వరకు ఉండగా, నవంబరు వరకు (30 నెలలపాటు) కొనసాగినట్లు చూపారు. ఆ సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ.63.66 కోట్లు చొప్పున 30 నెలలకు కలిపి రూ.1,909 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.1,059 కోట్లు  చెల్లించిందని కొన్నిరోజుల కిందట గనులశాఖ అధికారులు, జీఎస్టీ అధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అంటే ఇంకా రూ.850 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, దీనిపై స్పష్టతలేదు.

సిండికేట్లను తప్పించి.. నేరుగా సోదరుడే

రాష్ట్రంలో ఇసుక వ్యాపారంకోసం గతేడాది చివర్లో మళ్లీ టెండర్లు పిలిస్తే.. రెండు ప్యాకేజీలను తెలంగాణకు చెందిన ప్రతిమ ఇన్‌ఫ్రా, ఒక ప్యాకేజీని రాజస్థాన్‌కి చెందిన జీసీకేసీ అనే సంస్థలకు దక్కేలా చేశారు. పేరుకే ఇవి గుత్తేదారు సంస్థలుకాగా, వీటి పేరిట ‘ముఖ్య’నేత సోదరుడే ఇసుక వ్యాపారం చూస్తున్నారు. ఆయన తరఫున గుంటూరు జిల్లాకు చెందిన అంజిరెడ్డి ప్రధానపాత్ర పోషిస్తున్నారు.


న్యాయస్థానాలంటే లెక్కలేనితనం

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించినా పట్టించుకోలేదు. యంత్రాలతో ఇసుక తవ్వకాలపై పునఃపరిశీలన చేయాలంటూ ఎన్జీటీ.. గతేడాది మార్చిలో పర్యావరణ మదింపు సంస్థ (సియా)ను ఆదేశించింది. దీంతో 110 రీచ్‌ల్లో తవ్వకాలు ఆపేయాలని గనులశాఖను, గుత్తేదారు జేపీ సంస్థను గతేడాది ఏప్రిల్‌లో సియా ఆదేశించింది. కానీ ఎక్కడా తవ్వకాలు ఆపలేదు. భారీ యంత్రాలతో నదులను ఊడ్చేశారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ రీచ్‌లు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. అయితే ప్రభుత్వ పెద్దల సూచనలతో, గనులశాఖ ఉన్నతాధికారులు ఏయే రీచ్‌ల జాబితా ఇచ్చారో.. వాటిలోనే కలెక్టర్లు మొక్కుబడిగా పరిశీలించారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని కలెక్టర్లు ఒకేలా నివేదిక ఇచ్చారు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ మాత్రం ఉల్లంఘనలు నిజమని, అక్రమంగా ఇసుక తవ్వారని నివేదిక ఇచ్చింది. అయినా ‘ముఖ్య’నేత సోదరుడి బృందం తవ్వకాలు ఆపలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని