వారికి నో.. వీరికి ఎస్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు.

Updated : 29 Apr 2024 06:47 IST

సీఎస్‌, డీజీపీలను బదిలీ చేయాలన్న విపక్షాలను పట్టించుకోని ఈసీ
తితిదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ పొడిగించాలన్న సీఎం లేఖకు కేంద్రం సానుకూల స్పందన
ఆరు వారాల పాటు డిప్యుటేషన్‌ పొడిగిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. కానీ ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ (ఐడీఈఎస్‌)కు చెందిన ఏవీ ధర్మారెడ్డి అనే అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం (తితేదే) కార్యనిర్వహణాధికారిగా లేకపోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుందని, భక్తులకు దర్శనాలు చేయించడమే కష్టమవుతుందని సీఎం జగన్‌ ఒక లేఖ రాసిందే తడవు.. మరోమాటే లేకుండా డిప్యూటేషన్‌ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసేసింది. ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ మే 14తో ముగుస్తుండగా, ఈ ఏడాది జూన్‌ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు తితిదే ఈవోగా కొనసాగేలా ఆరు వారాలపాటు గడువు పొడిగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పడుతోంది.

రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుండగా, వారందరినీ కాదని.. డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌కు చెందిన ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి.. అత్యంత కీలకమైన తితిదే ఈవో పోస్టు కట్టబెట్టడమే ఆభ్యంతరకరమైతే, ఆయన లేకపోతే అసలు తిరుమల స్తంభించిపోతుందన్నట్టుగా డిప్యుటేషన్‌ను పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తితిదే ఈవో (ఎఫ్‌ఏసీ)గా, తితిదే పరిధిలోని పలు సంస్థలకు డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తూ.. సర్వాధికారాలూ తన చేతిలో పెట్టుకొని చక్రం తిప్పుతున్న ధర్మారెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని.. ‘అతి సున్నితమైన’ వ్యవహారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చక్కబెడతారని పేరుంది! ధర్మారెడ్డి తితిదే ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ కేంద్ర రక్షణ శాఖ మాత్రం ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించి, ఈఓగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.


డిప్యుటేషన్‌ పొడిగింపు రెండోసారి

ధర్మారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇది వరకే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్‌ గడువు వచ్చే నెల 14తో ముగుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14న కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోవాలి. కానీ తన ఆత్మబంధువులాంటి ధర్మారెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేని జగన్‌.. జూన్‌ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు, డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మార్చి 12న లేఖ రాశారు. తిరుమలలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. మే, జూన్‌ నెలల్లో సర్వదర్శనానికి 30 గంటల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుందని అందులో పేర్కొన్నారు. అన్ని గంటలపాటు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతారు కాబట్టి.. వారికి ఆహారం, వసతి, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించడంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం ఆ లేఖలో వెల్లడించారు. ధర్మారెడ్డి అయితేనే ఆ పనులు సజావుగా, సమర్థంగా చేయగలరని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని