మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ

వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్‌ ఛైర్‌లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు.

Published : 29 Apr 2024 06:02 IST

కదల్లేని, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దే పంపిణీ
దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి కూడా..
ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి దగ్గరే అందజేత
ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, అమరావతి: వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్‌ ఛైర్‌లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. ఇందుకోసం 14,995 గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. అలాగే సచివాలయాలకు దూరంగా ఉండే ఆవాసాల్లోని లబ్ధిదారుల కోసం 10,814 కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పింఛను పంపిణీని పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా సమస్య తలెత్తి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానట్లైతే.. వారికి మే 2న ఇంటి దగ్గరే నగదు అందించనున్నారు. ఇళ్ల వద్ద పింఛన్‌ తీసుకునే లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పింఛను యాప్‌లో ఉంటుంది. బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించే వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మే 5 నాటికి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది.


పంపిణీకి మార్గదర్శకాలు

  • ఇంటి దగ్గరే పింఛన్‌ అందించడానికి సచివాలయాల్లో సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచేలా జిల్లా కలెక్టర్లు సమన్వయం చేయాలి. పింఛన్‌దారులకు అసౌకర్యం తలెత్తకూడదు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు బ్యాంకుల నుంచి సచివాలయాలకు నగదు తీసుకెళ్లేందుకు అవసరమైన ధ్రువీకరణలు అందించాలి. వారు ఈ మొత్తాన్ని ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించే గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బందికి ఇస్తారు.
  • ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన పింఛన్ల వివరాలను ఆ రోజే సచివాలయ సిబ్బంది నుంచి సేకరించాలి. వారి దగ్గరున్న నగదు నిల్వను ప్రతిరోజూ సంబంధిత అధికారులు తెలుసుకోవాలి.
  • గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ లాగిన్‌లు అందిస్తారు. వారి వద్దనున్న మొబైల్‌లో పెన్షన్‌ పంపిణీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లను సచివాలయ సిబ్బందికి అందిస్తారు.
  • ఆధార్‌ ఐడెంటిఫికేషన్‌ (బయోమెట్రిక్‌/ ఐరిస్‌/ ఆధార్‌) ఆధారంగా పింఛన్‌ సొమ్మును పంపిణీ చేయాలి. ఆధార్‌ గుర్తింపు ద్వారా సాధ్యం కాకుంటే రియల్‌ టైమ్‌ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టం విధానంలో ఇవ్వాలి.
  • ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేని సచివాలయాల పరిధిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి వాడే పరికరాలను ఎంపీడీవో లాగిన్‌లోమ్యాపింగ్‌ చేయాలి.
  • మే పింఛనును డీబీటీ, నగదు విధానంలో చెల్లించడానికి అవసరమైన నిధి మొత్తం సంక్షేమ కార్పొరేషన్‌ బ్యాంకు ఖాతాకు ఏప్రిల్‌ 30నే బదిలీ అవుతుంది. ఆ మొత్తాన్ని గ్రామ/వార్డు సచివాలయాలకు విడుదల చేసి.. ఈ నెల 30న అవసరమైన మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసుకోడానికి వీలుగా ఆర్థిక శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.  కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 బ్యాంకులకు సెలవైనప్పటికీ... ఆరోజు సంబంధిత కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ అవుతుంది. ఇందులో బ్యాంకుల ప్రమేయం ఉండదు.
  • పింఛన్‌దారులకు బ్యాంకుల వద్ద అసౌకర్యం కలగకుండా బ్యాంకుల లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్లు, కంట్రోలర్లకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలివ్వాలి.
  • పింఛన్ల పంపిణీ సమయంలో రాజకీయ ప్రకటనలు, ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఫొటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల కోడ్‌ను సిబ్బంది కచ్చితంగా పాటించాలి. అవకతవకలకు పాల్పడితే పరిణామాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని