వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాల నిలుపుదల

మాజీ మంత్రి వివేకా హత్యకేసు విషయంలో వైకాపాపై గానీ, దాని అధ్యక్షుడు జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిపై గానీ వ్యాఖ్యలు చేయకూడదంటూ కడప జిల్లా కోర్టు ఏప్రిల్‌ 16న జారీచేసిన ఉత్తర్వులు, దాని తదనంతరం చేపట్టిన కోర్టుధిక్కరణ చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Updated : 18 May 2024 04:14 IST

తదనంతర ప్రొసీడింగ్సూ నిలిపివేత
కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్యకేసు విషయంలో వైకాపాపై గానీ, దాని అధ్యక్షుడు జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిపై గానీ వ్యాఖ్యలు చేయకూడదంటూ కడప జిల్లా కోర్టు ఏప్రిల్‌ 16న జారీచేసిన ఉత్తర్వులు, దాని తదనంతరం చేపట్టిన కోర్టుధిక్కరణ చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దాఖలుచేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్యకేసులో తమ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని, వారు ఈ విషయంపై మాట్లాడకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ వైకాపా దాఖలుచేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కడప ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి ఏప్రిల్‌ 16న అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేశారు.

ఆ కేసులో ప్రతివాదులు షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్‌కల్యాణ్, ఎం.రవీంద్రనాథ్‌రెడ్డిలతో పాటు, వారి అనుచరులకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కడప కోర్టు పేర్కొంది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ షర్మిల ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విషయాన్ని తిరిగి ట్రయల్‌ కోర్టుకే పంపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ షర్మిల దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీ శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇందులో షర్మిల తరఫున సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ కడప కోర్టు ఉత్తర్వులు భావప్రకటన స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.

‘‘వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి నిందితుడన్నది వాస్తవం. దానిగురించి మాట్లాడితే కోర్టుధిక్కరణ కేసులు పెడుతున్నారు. కడప కోర్టు ఉత్తర్వులు పిటిషనర్‌ ఎన్నికల ప్రసంగాలపై ప్రభావం చూపాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి ఉత్తర్వులు జారీచేయడం చట్టబద్ధం కాదు. ఆ ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు పూర్తయినా మాపై కోర్టుధిక్కరణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అందుకే కడప కోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతున్నా’’ అని వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి కడప కోర్టు ఏప్రిల్‌ 16న జారీచేసిన ఉత్తర్వులు, తదనంతర పరిణామాలపై స్టే జారీచేశారు. ‘‘కడప జిల్లా జడ్జి ఈ కేసులో పిటిషనర్ల వాదనలు వినకుండానే ఇంజంక్షన్‌ ఆర్డర్‌ జారీచేశారు. ఆ ఉత్తర్వు పిటిషనర్‌ భావప్రకటనా స్వేచ్ఛను హరించింది. అందువల్ల కడప కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, దాని తదనంతరం చేపట్టిన ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని