ఎయిర్‌కార్గో సేవలకు మోక్షం ఎప్పుడు?

వైకాపా ప్రభుత్వం ఎయిర్‌కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్‌గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్‌కార్గో సేవలు నిలిచిపోయాయి.

Published : 18 May 2024 03:41 IST

ఏడాదిగా వాయుమార్గంలో నిలిచిన ఎగుమతులు
రోడ్డు మార్గం ద్వారా సరకు తరలింపు
వాణిజ్య హబ్‌గా పేరొందిన విశాఖలో ఇదీ దుస్థితి

విశాఖ విమానాశ్రయంలో గతంలో సరకు లోడింగ్‌

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వం ఎయిర్‌కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్‌గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్‌కార్గో సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఫార్మా, ఆహార ఉత్పత్తులు, రొయ్యలను రోడ్డు మార్గంలో తరలించడంతో సంబంధిత సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా.. ప్రభుత్వంలో చలనం లేదు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) నిబంధనల ప్రకారం కార్గో నిర్వహణకు ఇప్పటికీ అధీకృత ఏజెన్సీని నియమించలేదు. ఈ అంశంపై దృష్టిసారించి నియమించాలని రాష్ట్రప్రభుత్వం నుంచి వినతులు వెళ్లకపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ కార్గో బాధ్యతలను ఓ సంస్థ నిర్వహించేది. కొవిడ్‌ సమయంలో అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో సరకు రవాణాపై అది ప్రభావం చూపింది. నెలకు రూ.7లక్షల చొప్పున 17 నెలల కాలానికి అద్దె చెల్లించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. మినహాయింపు ఇవ్వాలని సంస్థ యజమాని కోరినా.. పట్టించుకోకుండా వెళ్లిపోయేలా చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

వారంలో వంద ట్రక్కులు రోడ్డు మార్గంలోనే

విశాఖలో స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్, ఫార్మా సిటీ (వందకు పైగా కంపెనీలు), అచ్యుతాపురంలో బ్రాండిక్స్, ఇతర ఇంజినీరింగ్‌ పరిశ్రమలున్నాయి. ఫార్మాసిటీ నుంచి పెద్ద ఎత్తున ఔషధాలు.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఆహార ఉత్పత్తులు, ఇతర జిల్లాల నుంచి సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎయిర్‌కార్గో నిలిచిపోవడంతో ఆయా ఉత్పత్తులను రోడ్డు మార్గంలోనే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా వారానికి సుమారు 100కు పైగా ట్రక్కులు వెళ్తున్నట్లు సమాచారం. ఫార్మా సంస్థల నుంచి నెలకు కనీసం 20 టన్నులు, బ్రాండిక్స్‌ నుంచి 3 టన్నుల ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి. రోడ్డు మార్గంలో వీటిని తరలించడం ద్వారా.. సమయం వృథా, ఖర్చు పెరగడంతోపాటు నాణ్యత లేమితో నష్టాలు వస్తున్నాయని సంబంధిత యజమానులు ఆందోళన చెందుతున్నారు.

సూరత్‌ విమానం నిలిచిపోవడంతో

విశాఖ నుంచి ఏడాదికి కనీసం 2.6 లక్షల టన్నుల రొయ్యలు పొరుగు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటికి సూరత్, కోల్‌కతాలో మంచి గిరాకీ ఉంది. దీంతో రైతులు మంచి లాభాల కోసం అక్కడికి ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. 2020లో విశాఖ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ కార్గో విమాన సర్వీసు ప్రారంభం కాగా.. కొవిడ్‌ సమయంలో అది నిలిచిపోయింది. రాష్ట్రం నుంచి సూరత్‌కు రోడ్డు మార్గం ద్వారా రొయ్య పిల్లలు తీసుకెళ్లాలంటే కనీసం 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో రొయ్య పిల్లలకు సరిపడా ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నాయి.

కావాల్సిన సౌకర్యాలు

విశాఖ విమానాశ్రయంలో పేరుకు తగ్గట్టుగా.. కార్గో నిర్వహణకు అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు లేవు. కస్టమ్స్‌ అధికారులు నిత్యం అందుబాటులో ఉండట్లేదు. వివిధ ఔషధాలు, ఆహార ఉత్పత్తులను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో నిల్వచేసేందుకు మల్టిపుల్‌ టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ స్టోరేజ్‌ కావాలి. ప్యాకింగ్, ఉత్పత్తులు లోడ్‌ చేసేందుకు సెక్యూరిటీ స్క్రీనింగ్‌ సామగ్రి, సిబ్బంది కొరత వేధిస్తోంది.


ఏఏఐ ముందుగానే సమాచారమిచ్చినా

తంలో విమానయాన సంస్థలే కార్గో తనిఖీలు, స్క్రీనింగ్‌ పరీక్షలు చేపట్టేవి. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బీసీఏఎస్‌ నిబంధనల ప్రకారం ఏఏఐ ఆధ్వర్యంలోనే ఈ తనిఖీలు జరగాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ముందుగానే ఏఏఐ సమాచారమిచ్చినా.. విశాఖ విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో గతేడాది అంతర్జాతీయ, దేశీయ కార్గో సేవలు నాలుగు నెలలపాటు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ఎంపీల కోరిక మేరకు కొత్త ఏజెంట్‌ను నియమించేవరకు ఇండిగో సంస్థకు అనుమతులిచ్చారు. ఆయా సర్వీసుల్లో దేశీయంగా చాలా తక్కువ మొత్తంలోనే సరకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ కార్గో కాంప్లెక్స్‌ పూర్తిగా మూతపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని