జడ్పీ అధికారుల అత్యుత్సాహం

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సచివాలయ ఉద్యోగులను తీసుకునేందుకు కర్నూలు జడ్పీ సీఈవో కసరత్తు చేయడం  దుమారం రేపింది. పైగా.. కలెక్టరు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టామని తెలపడం విస్మయానికి గురి చేసింది.

Published : 18 May 2024 03:43 IST

సచివాలయ ఉద్యోగులకు ఓట్ల లెక్కింపు బాధ్యతల అప్పగింతకు కసరత్తు
వారిని తీసుకోవడం లేదని తేల్చిచెప్పిన కలెక్టర్‌

ఈనాడు, కర్నూలు: ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సచివాలయ ఉద్యోగులను తీసుకునేందుకు కర్నూలు జడ్పీ సీఈవో కసరత్తు చేయడం  దుమారం రేపింది. పైగా.. కలెక్టరు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టామని తెలపడం విస్మయానికి గురి చేసింది. ఓట్ల లెక్కింపు బాధ్యతల్లో ఉండే అధికారులు, ఉద్యోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయ ఉద్యోగులను నియమించనున్నట్లు కర్నూలు జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి గురువారం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వైకాపా హయాంలో నియమించిన వారిని లెక్కింపు ప్రక్రియలోకి ఎందుకు తీసుకుంటున్నారే ఆరోపణలు వచ్చాయి. పైగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకే సచివాలయ ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నామని సీఈవో ప్రకటించడమేంటని అధికారులూ విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌ జి.సృజన.. ఓట్ల లెక్కింపు విధులకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలు అవసరం లేదని, ఆయా బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన  ప్రభుత్వ ఇతర శాఖల ఉద్యోగులు ఉన్నారని స్పష్టతనిచ్చారు. సచివాలయ ఉద్యోగులను ఏ రకంగానూ లెక్కింపు ప్రక్రియలో ఉపయోగించుకోవడం లేదని శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సీఈవో సచివాలయ ఉద్యోగుల వివరాలు ఎందుకు సేకరించారు, కలెక్టరు ఆదేశాలు అని ఎందుకు చెప్పారు, వెనకున్న ఉద్దేశాలేంటి అనే కోణంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని