పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం

పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి.

Published : 18 May 2024 04:03 IST

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గ్రామస్థుడు

ప్రధానోపాధ్యాయుడితో పాటు హైదరాబాద్‌ చేరుకున్న విద్యార్థులు

సత్యవేడు, న్యూస్‌టుడే: పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. చెరివి పంచాయతీ మాదనపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విమానంలో విహార యాత్రకు పంపిస్తానని స్థానికుడైన ఉమాపతి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను చెన్నై నుంచి హైదరాబాద్‌కు విమానంలో పంపించారు. పదో తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పురుషోత్తం(552), వి.విష్ణు(515), మహా(509), తనూజ(505)లతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్‌ విమానంలో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ వారు రెండు రోజులు పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి తిరిగి తిరుపతికి చేరుకోనున్నారు. విహారయాత్రకు అయ్యే ఖర్చులను ఉమాపతి భరిస్తున్నారు. ఆయన ప్రోత్సాహక తీరు ఇతరులకు ఆదర్శనీయంగా ఉందని స్థానికులు, ఉపాధ్యాయులు అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని