‘పది’లో ఈ ఏడాది సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలు

రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్‌ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ-సీబీఎస్‌ఈ) సిలబస్‌ పాఠ్యపుస్తకాలను ముద్రించారు.

Updated : 19 May 2024 09:48 IST

8-10 తరగతులకు సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళిక
6, 7 తరగతుల్లో కిచిడీ సిలబస్‌
వెయ్యి బడులకు సీబీఎస్‌ఈ పరీక్షలు.. మిగతా వాటికి రాష్ట్రబోర్డు పరీక్షలు
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్‌ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ-సీబీఎస్‌ఈ) సిలబస్‌ పాఠ్యపుస్తకాలను ముద్రించారు. 8-10 తరగతులకు పూర్తిగా సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు కానుంది. 6,7తరగతుల్లో గణితం, సామాన్య శాస్త్రం, ఆంగ్ల పాఠ్యపుస్తకాలు సీబీఎస్‌ఈ కాగా.. మిగతావి రాష్ట్ర సిలబస్‌ పుస్తకాలు ముద్రించారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు రెండు విడతల కింద పుస్తకాలను ముద్రిస్తున్నారు. మొదటి విడతలో 3.26 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. రెండో విడతకు 1.05 కోట్ల పుస్తకాలు అవసరం కానున్నాయి. పుస్తకాల ముద్రణ 50 శాతానికిపైగా పూర్తికాగా.. మండల స్థాయి గిడ్డంగులకు తరలించేందుకు పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం చర్యలు చేపట్టింది.

  • గతేడాది వరకు 6, 7తరగతులకు ఆంగ్లం, ఆంగ్ల భాష నాన్‌ డీటెయిల్‌ పుస్తకాలు విడిగా ఉండగా.. ఇప్పుడు వీటిని ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు.
  • 6-10 తరగతులకు ప్రత్యేకంగా పర్యావరణ విద్య పుస్తకం ఉండగా.. దీన్ని తొలగించారు. 
  • 8వ తరగతికి ప్రత్యేకంగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ సిలబస్‌ను ప్రవేశ పెట్టారు. 
  • 9, 10 తరగతులకు గతంలో హిందీ, హిందీ నాన్‌ డీటెయిల్‌ విడిగా ఉండగా.. వీటిని విలీనం చేసి, ఒకే పుస్తకంగా ముద్రించారు.
  • పదోతరగతిలో తెలుగు, తెలుగు నాన్‌ డీటెయిల్‌గా ఉన్న పుస్తకాలను విలీనం చేశారు. ఒకే పుస్తకం తీసుకొచ్చారు.
  • 9, 10 తరగతుల కోసం హెల్త్‌-ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్‌- కమ్యూనికేషన్‌ టెక్నాలజీ పుస్తకాలను ఉన్నత పాఠశాలకు రెండు చొప్పున ఇస్తారు.

ఒకే సిలబస్‌.. పరీక్షలు మాత్రం వేర్వేరు..

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లభించింది. వీటికి ప్రత్యేకంగా ఆ పాఠ్యపుస్తకాలను ముద్రించి, సరఫరా చేయడం కష్టమని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ బడులన్నింటికీ సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేసింది. ఎనిమిదో తరగతి నుంచి ఒక్కో ఏడాది సిలబస్‌ను మార్చుకుంటూ వచ్చింది. ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలను మార్చేసింది. ఇప్పుడు విద్యార్థులందరూ ఒకటే సిలబస్‌ చదువుతారు. కానీ, పరీక్షలు మాత్రం వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడే గందరగోళం నెలకొంది.

  • సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉన్న వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ విద్యార్థులకు అంతర్గత మార్కులు 20% ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన విధానం వేరుగా ఉంటుంది.
  • రాష్ట్ర బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లోనూ సీబీఎస్‌ఈ సిలబస్‌నే అమలు చేస్తున్నారు. అంతర్గత మార్కుల విధానం లేదు. ప్రశ్నపత్రాలను బోర్డు ద్వారానే అందిస్తారు. ఒకే సిలబస్‌ చదివిన విద్యార్థులు కొందరు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తే.. మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తారు. ప్రశ్నపత్రాల స్థాయి, విద్యార్థి సామర్థ్యాల పరిశీలనకు ఇచ్చే ప్రశ్నల్లోనూ వ్యత్యాసం ఉంటుంది.
  • సీబీఎస్‌ఈలో రెండు భాషల విధానమే ఉంది. ఈ లెక్కన పదో తరగతిలో 5 సబ్జెక్టులే ఉంటాయి. అదే రాష్ట్ర బోర్డులో 3 భాషల విధానం ఉంది. ఇక్కడ తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలు చదవాలి. సీబీఎస్‌ఈలో ఆంగ్లంతోపాటు విద్యార్థి ఎంచుకున్న భాష సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. ఒకే సిలబస్‌ చదివిన విద్యార్థుల మధ్య పదోతరగతి పరీక్షల్లో ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.
  • ప్రైవేటు వారికి మార్కెట్‌లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థలకే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటివరకు ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణే పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూన్‌ పదో తేదీ వరకు పట్టొచ్చు. రెండు విభాగాలను ఒక్కరికే ఇవ్వడం వల్ల మార్కెట్‌లో లభించే పాఠ్యపుస్తకాలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు విద్యార్థులకు మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో జూన్‌ 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని