చాట్‌ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్‌వేర్‌ తీసుకొస్తాం

చాట్‌ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్‌చంద్ర తెలిపారు.

Updated : 19 May 2024 08:48 IST

లక్ష మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏఐపై ఇంటర్న్‌షిప్‌
స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్‌చంద్ర వెల్లడి

శిక్షణకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రవీణ్‌చంద్ర, కిరణ్‌చంద్ర, చైతన్య 

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: చాట్‌ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్‌చంద్ర తెలిపారు. దీని సాధనలో ఇంజినీరింగ్‌ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి కృత్రిమ మేధ(ఏఐ)పై ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్‌చంద్ర మాట్లాడారు. శతసహస్ర యాగం పేరిట లక్ష మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ వేసవిలో ఏఐపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో పదివేల మందికి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే రెండో బ్యాచ్‌ ప్రారంభిస్తామన్నారు. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్, ఓజోన్‌టెల్‌ కమ్యూనికేషన్స్, మెటా, టాస్క్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాల్గొనే విద్యార్థులు తెలుగు చాట్‌జీపీటీని తయారు చేసేందుకు అవసరమైన డేటా సేకరిస్తారన్నారు. ఇంటర్న్‌షిప్‌లో ఒక్కో విద్యార్థి కనీసం 50 మందిని కలిసి తమ ప్రాంతాల మాండలీకాలలో ఉన్న భాషా సంపదను డాక్యుమెంట్‌ చేస్తారని వివరించారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు కృత్రిమ మేధ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించేలా నిష్ణాతులైన వారు తర్ఫీదు ఇస్తారని తెలిపారు. నెల రోజులపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. పాల్గొనేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వివరాల కోసం https://swecha.org/summer-of-ai వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఓజోన్‌టెల్‌ కమ్యూనికేషన్స్‌ సీటీఓ చైతన్య చొక్కారెడ్డి, స్వేచ్ఛ కార్యదర్శి ప్రవీణ్‌చంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని