మమ్మల్ని వెంటనే భారత్‌కు రప్పించండి

కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో స్థానికులు, ఈజిప్ట్‌ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Published : 20 May 2024 04:37 IST

కిర్గిజ్‌స్థాన్‌లో విశాఖ విద్యార్థుల ఆవేదన

కిర్గిజ్‌స్థాన్‌లోని వసతి గృహంలో విశాఖ విద్యార్థులు

పెందుర్తి, న్యూస్‌టుడే: కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో స్థానికులు, ఈజిప్ట్‌ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెందుర్తి మండలంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన సుమారు 11 మంది విద్యార్థులు తమను వెంటనే భారత్‌కు రప్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌ఎస్‌కే రేవంత్‌ (రాయవరపువానిపాలెం, పెందుర్తి), ఉదయ్‌కిరణ్‌ (వేపగుంట), రామకృష్ణ (ప్రశాంతినగర్, పెందుర్తి), దిలీప్‌ (కాకినాడ), కుశల్‌కుమార్‌ (ఆమదాలవలస), హాజీ మహమ్మద్‌ (గాజువాక)లు ‘న్యూస్‌టుడే’తో ఆదివారం మాట్లాడారు. తామంతా బిష్కెక్‌లోని కిర్గిజ్‌ రష్యన్‌ స్లావిక్‌ యూనివర్సిటీలో వైద్యవిద్య అభ్యసిస్తున్నట్లు తెలిపారు. అల్లరిమూకలు వసతిగృహాల పరిసరాల్లో ఆయుధాలతో సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమతో ఆంధ్రాకు చెందిన మరికొంతమంది విద్యార్థులు ఉన్నారన్నారు. నెల రోజుల్లో తామంతా స్వదేశానికి రావాల్సి ఉందని, అల్లర్ల నేపథ్యంలో ఒక నెల ముందుగానే తమను రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బిష్కెక్‌లో విశాఖకు చెందిన సుమారు 200 మంది ఉన్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే పలు దేశాలు తమ విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నాయని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నిర్ణయం తీసుకుని తమను స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు.

సురక్షితంగా తెలుగు విద్యార్థులు

ఈనాడు, అమరావతి: కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల నుంచి వారు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. విద్యార్థులందరూ వసతిగృహాల్లోనే ఉండాలని సూచించింది. ఇప్పటివరకు నలుగురు తెలుగు విద్యార్థులు తమను సంప్రదించినట్టు వెల్లడించింది. ఏదైనా సమాచారం కావాలంటే రాష్ట్రానికి చెందిన తల్లిదండ్రులు, విద్యార్థులు +918632340678, +918500027678 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. అత్యవసరమైతే అక్కడి భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 0555710041ను సంప్రదించాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని