ఆంధ్రా విద్యార్థులకు అందని ఎంబీబీఎస్‌ సీట్లు

వైద్య విద్య సీట్లలో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు.

Updated : 24 May 2024 05:50 IST

యూనివర్సిటీ నుంచి వేరుపడిన సిద్ధార్థ వైద్య కళాశాల 
అయినా పాత విధానంలోనే సీట్ల కేటాయింపు
మొత్తం సీట్లలో 36% తెలంగాణ విద్యార్థులకే
నష్టపోతున్నామని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన

విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వైద్య విద్య సీట్లలో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల సీట్లను దామాషా ప్రకారం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలకు కేటాయించారు. సిద్ధార్థ కళాశాల ప్రస్తుతం విశ్వవిద్యాలయం నుంచి డీలింక్‌ అయినా నేటికీ అదే పద్ధతిలో సీట్లు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతిభ గల పేద విద్యార్థులకు మొండిచెయ్యి మిగులుతోంది. 

ఒకే గూటి కిందకు చేర్చి..

1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వైద్యవిద్య కోర్సులను ఒకే గూటికి తీసుకురావాలని.. దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వైద్య, దంత, ఆయుర్వేదం, హోమియో, నర్సింగ్, పారామెడికల్‌ కోర్సులు నిర్వహిస్తున్న 26 కళాశాలలను దాని కిందికి చేర్చారు. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వైద్యకళాశాల ఉండాలనే నిబంధనతో సిద్ధార్థ ప్రైవేటు వైద్యకళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ, రాయలసీమ విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో సిద్ధార్థ ప్రభుత్వ వైద్యకళాశాలలోని 100 ఎంబీబీఎస్‌ సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేవారు.

డీలింక్‌ తర్వాత కూడా..

1998లో ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి సిద్ధార్థ ప్రభుత్వ వైద్యకళాశాల డీలింక్‌ అయ్యింది. అయినా అదే నిష్పత్తిలో సీట్లను కేటాయిస్తున్నారు. విశ్వవిద్యాలయం నుంచి వేరుపడిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలగానే పరిగణించాల్సి ఉన్నా... ప్రజాప్రతినిధుల చొరవ లేక తెలంగాణ విద్యార్థులను ఏటా చేర్చుకోవాల్సి వస్తోంది. 14 ఏళ్ల పాటు ఏటా 36మంది చొప్పున 504 మంది తెలంగాణ విద్యార్థులను ఎంబీబీఎస్‌లో చేర్చుకున్నారు. అనంతరం భారతీయ వైద్యమండలి 100 సీట్లను 150కి పెంచింది. అప్పటినుంచి గత ఏడాది వరకు ఏటా 63 సీట్ల చొప్పున 12 ఏళ్లపాటు ఆంధ్రాకు చెందాల్సిన 756 సీట్లను తెలంగాణ విద్యార్థులతో భర్తీచేశారు. 2019లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా వచ్చిన 15% సీట్లతోనూ తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. అదే నిష్పత్తిలో పీజీ సీట్లనూ కేటాయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై పోరాడుతున్నా.. సున్నితమైన సమస్య అంటూ పాలకులు వాయిదా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా దృష్టిపెట్టి ఆంధ్రా ప్రాంత సీట్లను ఇక్కడి విద్యార్థులతోనే భర్తీ అయ్యేలా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 


లోకల్‌.. నాన్‌ లోకల్‌లోనూ..

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత లోకల్, నాన్‌ లోకల్‌ అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా లాంటి మెరుగైన ప్రభుత్వ వైద్యకళాశాలలు ఉండటంతో లోకల్‌ కోటాలో ఏపీ విద్యార్థులకు కేటాయించే 15% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి. తెలంగాణ నుంచి ఆంధ్రాలోని వైద్య కళాశాలలకూ విద్యార్థులు వచ్చేవారు. ఇక్కడ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో ఏటా 600 సీట్ల వరకు సీట్లను వారికి అందుబాటులో ఉంచేవారు. పదేళ్లలో దాదాపు 6వేల ఎంబీబీఎస్‌ సీట్లను ఇలా తెలంగాణకు కేటాయించారు. జూన్‌ రెండో తేదీతో పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో లోకల్, నాన్‌లోకల్‌ సీట్ల విషయంపై రెండు ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని