అన్నం బిల్లులూ పెండింగే

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలకు డైట్‌ ఛార్జీలు చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది. కొన్ని జిల్లాల్లో డిసెంబర్‌ నుంచి, మరికొన్ని జిల్లాల్లో జనవరి నుంచి బకాయిలున్నాయి.

Updated : 24 May 2024 05:33 IST

చాలాచోట్ల వసతిగృహ విద్యార్థుల డైట్‌ ఛార్జీలు నాలుగు నెలలుగా ఇవ్వలేదు
రాష్ట్రవ్యాప్తంగా రూ.130 కోట్ల మేర బకాయి

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలకు డైట్‌ ఛార్జీలు చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది. కొన్ని జిల్లాల్లో డిసెంబర్‌ నుంచి, మరికొన్ని జిల్లాల్లో జనవరి నుంచి బకాయిలున్నాయి. కోనసీమ జిల్లాల్లో కొన్ని వసతిగృహాలకు నవంబర్‌ నుంచే చెల్లింపులు నిలిపేసింది. అన్ని రకాల వసతిగృహాలకు కలిపి దాదాపుగా రూ.130 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ రావడానికి ముందు, ఆ తర్వాత దాదాపుగా రూ.13 వేల కోట్ల బిల్లుల్ని గుత్తేదారులకు చెల్లించిన ముఖ్యమంత్రి జగన్‌కు.. పేద పిల్లల తిండి ఖర్చులకు నిధులు విడుదల చేయడానికి మాత్రం మనసొప్పలేదు. చివరికి ఆర్థిక సంవత్సరం ముగియడంతో అప్పట్లో పెట్టిన బిల్లులు మురిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ వాటిని అప్‌లోడ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

వార్డెన్లపై ఒత్తిడి 

గత రెండేళ్లుగా వైకాపా ప్రభుత్వం డైట్‌ ఛార్జీలను సకాలంలో చెల్లించడం లేదు. గ్రీన్‌ఛానల్‌ ద్వారా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని ప్రచారం చేసుకోవడమే తప్ప ఏనాడూ నాలుగైదు నెలలు పెండింగే.  గతంలో ఎప్పుడూ మరీ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదు. బిల్లుల చెల్లింపు వివరాలు కూడా బయటికి తెలియకుండా ప్రభుత్వం గోప్యత పాటించింది. ప్రభుత్వం డైట్‌ ఛార్జీలు సకాలంలో చెల్లించకున్నా ఐదారు నెలలపాటు వార్డెన్లు అప్పులు తెచ్చి, పిల్లలకు అన్నం పెట్టారు. కిరాణా దుకాణాల్లో నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని దుకాణదారులు వార్డెన్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ బిల్లుల చెల్లింపును ప్రాధాన్యంగా తీసుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని