విద్యతో నేర్చుకున్నది సమాజానికి తిరిగిచ్చేద్దాం

విద్యాభ్యాసం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేయాలని, అంకితభావంతో దేశ ప్రజలకు సేవ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ యువతకు పిలుపునిచ్చారు.

Updated : 25 May 2024 06:03 IST

అంకిత భావంతో దేశ ప్రజలకు తోడ్పాటు అందించండి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ పిలుపు
అమరావతి విట్‌ వర్సిటీలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవం

వీఐటీ యూనివర్సిటీ వార్షిక నివేదికను విడుదల చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్,

వర్సిటీ ఫౌండర్‌ ఛాన్స్‌లర్‌ డా.జి.విశ్వనాథన్, వైస్‌ఛాన్స్‌లర్‌  డా.ఎస్‌.వి.కోటారెడ్డి, 

బెంగళూరు మైక్రోసాఫ్ట్‌ డేటా ప్లాట్‌ఫాం డైరెక్టర్‌ అమిత్‌చౌదరి, రిజిస్ట్రార్‌ జగదీష్‌ సి.ముడిగంటి

ఈనాడు, అమరావతి: విద్యాభ్యాసం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేయాలని, అంకితభావంతో దేశ ప్రజలకు సేవ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ యువతకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలోని ఏపీ విట్‌ (విఐటి) యూనివర్సిటీలో శుక్రవారం 7వ విశ్వవిద్యాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవికుమార్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘విద్యార్థులు అంకితభావంతో చదువుకోవాలి. వాస్తవానికి మీ విద్యా ఫలంతో.. ఇతరులు తృప్తి పొందుతారు. ఉదాహరణకు మీరు వైద్యులయితే ఆ ఫలాన్ని అనుభవించేది రోగులే. ఇంజినీర్‌ అయితే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. నేర్చుకున్న దాన్ని సమాజానికి తిరిగివ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆంగ్ల అక్షరాలు బీ- బర్త్‌ (పుట్టుక)కు, డీ- డెత్‌(చావు)కు గుర్తుగా భావిస్తే.. ఈ రెండింటి మధ్య అక్షరం సీ- కాంట్రిబ్యూషన్‌ (సహాయం)కు చిహ్నం. అంటే ఒక మనిషి జనన మరణాల మధ్య దేశానికి ఎంత సేవ చేశాడనేదాన్ని బట్టే అతణ్ని గుర్తుపెట్టుకుంటారు.

ఇంత మంది ఉన్నత విద్యావంతుల్ని సమాజానికి అందిస్తున్న విట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ ప్రజల మనసుల్లో ఉండిపోతారు’ అని పేర్కొన్నారు. విద్యార్థులు పేద ప్రజల గురించి ఆలోచించాలని.. వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వెళుతున్నవారు దేశం గర్వపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో ఉన్నా అందుకు సంబంధించిన చట్ట నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జస్టిస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వ్యక్తి చట్టనిబంధనల గురించి తెలియదు కాబట్టి క్షమించమంటే కుదరదన్నారు. అందువల్ల ఏం చేయొచ్చు అనే దానికంటే ఏం చేయకూడదనేదే ముందుగా తెలుసుకోవాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన మైక్రోసాఫ్ట్‌ (బెంగళూరు) డేటా ప్లాట్‌ఫామ్స్‌ డైరెక్టర్‌ అమిత్‌ చౌదరి కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తులో ప్రజా జీవనాన్ని సులభతరం చేయబోతోందన్నారు. దీన్ని దుర్వినియోగం కాకుండా బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు. ఎదగాలంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని విద్యార్థులకు సూచించారు.

విట్‌ స్థాపనకు ఆహ్వానించిన చంద్రబాబుకు ధన్యవాదాలు 

విట్‌ వ్యవస్థాపకులు, ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ అమరావతిలో విట్‌ ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించినందుకు మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడికి ధన్యవాదాలు తెలిపారు. దేశాభివృద్ధిలో విద్య పాత్ర చాలా కీలకమన్నారు. నాలుగు విట్‌ క్యాంపస్‌ల్లో 80 వేల మందికి పైగా విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. విట్‌ ఏపీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ ముదిగంటి జగదీష్‌చంద్ర, విద్యార్థి సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఖదీర్‌ పాషా, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని