సంక్షిప్త వార్తలు (6)

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శనివారం నిర్వహించిన ఉప విద్యాశాఖ అధికారుల (డీవైఈఓ) నియామక పరీక్షలోనూ వైకాపా ప్రభుత్వ నవరత్నాలపై భజన సాగింది.

Updated : 26 May 2024 06:05 IST

ఏపీపీఎస్సీ పరీక్షలోనూ ‘నవరత్నాల’ భజనే
అమ్మఒడి, ఇతర పథకాలపై ప్రశ్నలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శనివారం నిర్వహించిన ఉప విద్యాశాఖ అధికారుల (డీవైఈఓ) నియామక పరీక్షలోనూ వైకాపా ప్రభుత్వ నవరత్నాలపై భజన సాగింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాలను తీసుకు రాగా.. ఇప్పుడు వాటిపై పరీక్షలో ప్రశ్నలు అడగడం గమనార్హం. అమ్మఒడి కింద ప్రభుత్వం.. తల్లుల ఖాతాకు ఎంత జమచేస్తుంది? నవరత్నాలు ఎప్పుడు ప్రారంభించారు? రైతులు సుస్థిర అభివృద్ధి సాధించడానికి పెట్టిన పథకం పేరేంటి? క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడు ప్రారంభించారు? వంటి ప్రశ్నలు అడిగారు. తెలివితేటలు, సామర్థ్యాలను పరీక్షించే ఇలాంటి పరీక్షలో ఈ ప్రశ్నలు అడగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


డీవైఈఓ రాత పరీక్షకు 82.02% మంది హాజరు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈఓ) నియామక రాతపరీక్షకు 82.02% మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యాశాఖకు చెందిన ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను అనుసరించి 28,451 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 82.02% మంది పరీక్ష రాశారని, పరీక్ష సజావుగా జరిగిందని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.


నియోజకవర్గాలకు ఏఆర్‌వోల నియామకం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల్ని(ఏఆర్‌వో) నియమిస్తూ శనివారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నవారికి అదనంగా వీరిని నియమించినట్టు పేర్కొంది.


అంపైర్లు, స్కోరర్ల వేతనాల పెంపు
వెల్లడించిన ఏసీఏ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అంకితభావం, కృషి, నైపుణ్యాన్ని గుర్తిస్తూ.. అంపైర్లు, స్కోరర్ల వేతనాలను పెంచినట్లు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథరెడ్డి శనివారం తెలిపారు. పెంచిన వేతనాలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. జోనల్, జిల్లాస్థాయి అంపైర్‌కు రోజుకు రూ.1,500 నుంచి రూ.2,500.. స్కోరరుకు రూ.800 నుంచి రూ.1500 వేతనాలు అందనున్నాయన్నారు. రంజీ, వివిధ టోర్నీల్లోని అంపైర్లకు రూ.2వేల నుంచి రూ.3వేలు, స్కోరరుకు రూ.1000 నుంచి రూ.2వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బందికి రోజువారీ అలవెన్స్‌లను సైతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


ఎన్నికల విధులకు పోలీసు అధికారుల కేటాయింపు
సమస్యాత్మక నియోజకవర్గాల్లో విధుల నిర్వహణ

ఈనాడు, అమరావతి: సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు పోలీసు అధికారులను కేటాయిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులిచ్చారు. తమకు కేటాయించిన జిల్లా పరిధిలోని ఎస్పీ ఎదుట వెంటనే రిపోర్టు చేయాలని వారిని ఆదేశించారు. రాష్ట్రంలో సీఐడీ, ఏసీబీ, పీటీసీ, ఎస్‌ఈబీ, రైల్వే, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయిలోని 58 మంది అధికారులకు ఈ విధులు కేటాయించారు. వీరిలో 19 మందికి తొలుత కేటాయించిన జిల్లా నుంచి మరో జిల్లాకు మారుస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సుమారు 2 లక్షల మంది వరకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్షలకు ఏపీలో 26, తెలంగాణలోని 13 నగరాలు/పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని