అమరావతీ.. ఊపిరిపీల్చుకో!

వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.

Published : 05 Jun 2024 07:10 IST

రాజధానిలో అంబరాన్నంటిన సంబరాలు 
కూటమి గెలుపుతో హర్షాతిరేకాలు
సంబరాలను అడ్డుకోబోయిన తుళ్లూరు డీఎస్పీ 
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు

మందడంలో అమరావతి, తెదేపా జెండాలతో నినాదాలు చేస్తున్న మహిళలు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - తుళ్లూరు: వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.  అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కాబోతుండడంతో నినాదాలు చేస్తూ టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ అమరావతీ ఊపిరి పోసుకో..’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమ గీతాలకు నృత్యం చేస్తూ ఆకుపచ్చ, పసుపు కండువాలను గాలిలో తిప్పుతూ కేరింతలు కొట్టారు. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారంటూ హర్షం వ్యక్తంచేశారు. ఐదేళ్లుగా పడుతున్న బాధలు తొలిగాయని తమకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్సాహం రైతుల్లో కనిపించింది. 

  • తుళ్లూరు శిబిరంలో భారీ ఎల్‌ఈడీ తెర ఏర్పాటుచేసి రైతులు, మహిళలు ఫలితాలను మంగళవారం ఉదయం నుంచే ఉత్కంఠగా వీక్షించారు. ఫలితాల కోసం అందరూ టీవీలకు అతుక్కుపోవడంతో రాజధాని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రెండు రౌండ్లలోనే ఓటింగ్‌ సరళి తెలిసిపోవడం... తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధిస్తుండడంతో ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చారు. ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. జై అమరావతి. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఆలయాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు పూజలు చేశారు. 
  • మందడం, వెలగపూడిలో మహిళలు పసుపు చీరలు ధరించి రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహాలను నీటితో శుద్ధి చేసిన అనంతరం క్షీరాభిషేకం నిర్వహించారు. జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. వెలగపూడి శిబిరంలో అమరావతి గీతాలకు నృత్యాలు చేశారు. దొండపాడులో మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి చేరుకొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమ కష్టాలు తొలగిపోయాయంటూ మందడంలో మహిళలు మిద్దె సెంటర్‌లో కేకులు కోసి పంచారు. జై అమరావతి, చంద్రబాబునాయుడు వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బోరుపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా, జనసేన నాయకులు జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తంచేశారు. వడ్డమాను గ్రామంలో మహిళలు పసుపు రంగును చల్లుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 
  • ఐనవోలు గ్రామంలో డీజేలతో తెదేపా, జనసేన యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో సైకిళ్లకు జెండాలు కట్టుకుని ర్యాలీగా గ్రామంలో తిరిగారు. పెదపరిమిలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పుట్టి రామచంద్రరావుతో కలసి యువత టపాసులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు వందనాలంటూ తుళ్లూరు శిబిరంలో మహిళలు మోకాళ్లపై నిలుచొని చేతులు జోడించి వందనం చేశారు. వెలగపూడి, తుళ్లూరు శిబిరాలను ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సతీమణి కవిత, కుమార్తె మానస సందర్శించారు. రైతుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఏబీవీని, రైతులను జగన్‌ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అంతిమంగా న్యాయం జరిగిందన్నారు. 

తుళ్లూరు డీఎస్పీ ఓవరాక్షన్‌

రాజధాని గ్రామాల్లో రోడ్లపై గస్తీ తిరుగుతున్న తుళ్లూరు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌.. తన సిబ్బందితో హడావుడి చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న రైతులు, మహిళల వద్దకు వచ్చి 144 సెక్షన్‌ అమల్లో ఉందని, అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని మైక్‌లో అల్టిమేటం జారీ చేశారు. అక్కడ గుమికూడిన వారిని పోలీసులు సెల్‌లో వీడియోలు, ఫొటోలు తీశారు. డీఎస్పీ ఓవరాక్షన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ఐదేళ్లుగా మమ్మల్ని సీఎం జగన్, మీరు చాలా ఇబ్బందులు పెట్టారు. కూటమి గెలుపుతో అయినా మీరు మారరా? ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని కట్టడి చేస్తారు?  ఇక ఎవరికీ తలవంచేది లేద’ని మండిపడ్డారు. దీంతో చేసేది లేక డీఎస్పీ వెనుదిరిగారు. 


అమరావతి అగ్రపథాన నిలుస్తుంది

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో మరోసారి మోదీ ప్రధానిగా కొలువుదీరనుండడం అమరావతికి శుభసూచకం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల్లో ఆనందాన్ని నింపింది.  కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు అందుతుందన్న నమ్మకం ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా ప్రపంచంలో అగ్రపథాన అమరావతి నిలుస్తుంది. 

ఆరె శివారెడ్డి, కన్వీనర్, అమరావతి పరిరక్షణ సమితి 


జగన్‌ దుష్ట పాలనకు చరమ గీతం

మరావతిపై జగన్‌ కక్షగట్టి అరాచకం సాగించారు. దుష్టపాలనకు నేటితో ప్రజలు చరమగీతం పాడారు. కూటమి గెలుపు  ప్రజలందరి విజయం. రాజధానిపై జగన్‌ సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన వీర మహిళల శపథం నెరవేరింది. 

పువ్వాడ సుధాకర్, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు


రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం

రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం అయింది. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అయింది. అమరావతికి ఇక అన్నీ మంచి రోజులే. 

పోతుల బాలకోటయ్య, అధ్యక్షుడు, అమరావతి బహుజన ఐకాస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని