పుట్టిముంచిన అప్పుల పుట్ట!

జగన్‌ ఘోర పరాజయానికి ఆయన చేసిన అప్పులు కూడా ప్రధాన కారణమయ్యాయి. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు జగన్‌.

Updated : 05 Jun 2024 09:42 IST

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
విలవిల్లాడిన సామాన్యుడు
ఓటు రూపంలోకి మారిన ఆగ్రహం

ఈనాడు, అమరావతి: జగన్‌ ఘోర పరాజయానికి ఆయన చేసిన అప్పులు కూడా ప్రధాన కారణమయ్యాయి. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు జగన్‌. పింఛనర్లు పడిన కష్టాలైతే ఇన్నీఅన్నీ కావు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వలేదు. సరఫరాదారులకు సొమ్ములు చెల్లించకుండా మొండికేశారు. వెరసి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతి దారుణంగా పట్టాలు తప్పించారన్న విషయం రాష్ట్రంలోని సామాన్య జనానికి అనుభవపూర్వకంగా అర్థమైపోయింది. ఆ ఆగ్రహాన్నే ఓటురూపంలో ప్రదర్శించాడు ఓటరు.

రాష్ట్రం మొత్తం అప్పులు ఈ ఏడాది మే ప్రారంభం నాటికే రూ.10,75,000 కోట్లకు మించిపోయాయి. తాజాగా రుణం రూ.11 లక్షల కోట్లకు చేరిపోయింది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన కూలీ సైతం రాష్ట్ర అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారంటే జగన్‌ సర్కారు ఆర్థిక దుస్థితి ఎంతటి దయనీయ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తన ఇంటిని ఉద్యోగికి అద్దెకు ఇచ్చానని, పదో తేదీలోపు ఆయనకు జీతం రాక అద్దె చెల్లించడం లేదని, ఫలితంగా ఆ ఇంటి ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారిందని ఓ సీనియర్‌ జర్నలిస్టు ఫేస్‌బుక్‌లో తన ఆవేదనను పోస్టు చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ గుత్తేదారులు రోడ్డెక్కారు. మరో గుత్తేదారు దొంగతనానికి పాల్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు, బిల్లులు చెల్లించకపోవడంతో ఇలా అన్ని వర్గాలు నరకాన్ని చవిచూశాయి. 

అంతటా మందగమనమే..

అసలే అంతంతమాత్రంగా ఉన్న రాబడిని జగన్‌.. అప్పులు తీర్చడం, రెవెన్యూ ఖర్చులకు మాత్రమే వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. జీతాలు, బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో లక్షలాది సామాన్య కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. నిర్మాణ రంగంతో సహా అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ పరంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఎస్టేట్‌ రంగం ఊపిరిపోసుకున్నదీ లేదు. డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయి. ఫలితంగా ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోయారు. 

రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా..

అయిదేళ్ల తన ప్రభుత్వ హయాంలో రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చిన జగన్‌.. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తులూ సృష్టించలేకపోయారు. ఆ నిధులతో మూలధన వ్యయం చేయకపోవడంతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు. తెచ్చిన అప్పులతో ఆస్తులు సృష్టించినా రాబడి మరికొంత పెరిగి రాష్ట్రానికి కాస్తోకూస్తో ప్రయోజనం కలిగేది. అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో అప్పులు ఇంతింతై అన్నట్లు అమాంతంగా పెరిగాయి. వడ్డీలు మోయలేనంత భారంగా మారాయి. ఇలా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా అంచులకు చేరింది. ఆంధ్రుడి జీవితం కష్టాల చక్రంలో చిక్కుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని