అక్రమాలకు అండ.. అవినీతిని కాదనకుండా

నేను ఐఏఎస్‌ని.. మీ రాజకీయ నాయకులు చెప్పేదానికల్లా అయ్యా.. ఎస్‌.. అనే అధికారిని కాదు-  ఓ తెలుగు సినిమాలో నిజాయతీపరుడైన అధికారి పాత్ర పోషించిన హీరో మాటలివి.

Updated : 07 Jun 2024 07:35 IST

ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పినా తానా తందానా
ఐఏఎస్‌లమని మర్చిపోయి అంటకాగిన ఉన్నతాధికారులు 
వైకాపా అరాచక పాలనలో వీరూ కీలకమే
ఈనాడు - అమరావతి

నేను ఐఏఎస్‌ని.. మీ రాజకీయ నాయకులు చెప్పేదానికల్లా అయ్యా.. ఎస్‌.. అనే అధికారిని కాదు-  ఓ తెలుగు సినిమాలో నిజాయతీపరుడైన అధికారి పాత్ర పోషించిన హీరో మాటలివి. నిజజీవితంలోనూ అలా ధైర్యంగా, దమ్ముగా నిలబడాల్సిన అధికారుల్లో కొందరు వైకాపా ప్రభుత్వ పెద్దలకు సాగిలపడిపోయారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేశారు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి, నిబంధనలు తుంగలోతొక్కి న్యాయస్థానంలో దోషులుగానూ నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దలకు తాబేదార్లలా పనిచేసే ఇలాంటి అధికారులను చరిత్రలో చూడలేదని ఎన్ని విమర్శలొచ్చినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఆ అధికారులు వైకాపా ఎజెండాను భుజాన మోయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎన్ని చెప్పినా.. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులదే. ప్రభుత్వ భవనాలన్నిటికీ వైకాపా రంగులు వేయమని జగన్‌ ప్రభుత్వం ఆదేశిస్తే... అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అది సరికాదని చెప్పలేదు. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి ఎందుకు అంగీకరించారు? ప్రజల సొమ్ము కాబట్టి ఎంత వృథా జరిగినా పర్వాలేదా? జగన్‌ ప్రభుత్వంలో అధికారులు ఎంతగా నిబంధనల్ని తుంగలో తొక్కారో రాస్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. కొత్త ప్రభుత్వం కొలువుతీరాక అలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 


చెప్పేవి సుద్దులు.. చేసేవి అడ్డగోలు పనులు!

జగన్‌ ప్రభుత్వంలో వైకాపా కార్యకర్త కంటే ఎక్కువగా జెండా మోసిన అధికారుల్లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఒకరని తెదేపా వర్గాలు విమర్శిస్తున్నాయి. జగన్‌ అధికారంలోకి రాగానే ఆయన సీఎం కార్యాలయంలో తిష్ఠ వేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌)గానూ చక్రం తిప్పారు. చంద్రబాబు హయాంలో సీఏంఓలో, ఇతర కీలక శాఖల్లో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టించడం, ఎవరిపై కేసులు పెట్టాలో సూచించినవారిలో ఆయన మొదటి స్థానంలో ఉంటారని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజులపాటు సీఎంఓలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది. సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులనూ ఇబ్బంది పెట్టేవారని.. తనకు గిట్టని సీనియర్‌ అధికారుల్ని ఏకంగా సీఎంఓ నుంచే వెళ్లగొట్టారని అధికార వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. అడ్డగోలు నిర్ణయాలతో తలబొప్పి కట్టడంతో.. ఒక దశలో ఆయన్ను మళ్లీ దిల్లీకి పంపేశారు. కానీ ఏదోలా ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఈసారి పాఠశాల విద్యాశాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు పైరవీలకు తలొగ్గి 1,400 మంది ఉపాధ్యాయుల్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఓ కార్యక్రమంలో జగన్‌ ముందు ఆయన మోకాళ్లపై కూర్చుని మాట్లాడిన తీరు చూసి.. ఇంతగా దిగజారిపోవాలా అని అధికారులే ముక్కున వేలేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖలో జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధ్వంసకర విధానాలన్నింటికీ ఆయనే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


వివాదాస్పద నిర్ణయాల వెనుక ‘రేవు’ హస్తం!

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వెళ్లిపోయాక.. ఆ స్థానంలోకి వచ్చిన రేవు ముత్యాలరాజు కూడా దాదాపుగా అదే స్థాయిలో హవా చలాయించారు. ఇటీవల కాలం వరకు ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్‌)గానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకుండా నిలిపివేయడం, అత్యంత వివాదాస్పదమైన జీవో నం.1 జారీ చేయడం వంటి నిర్ణయాల వెనుక కీలకపాత్ర ఆయనదేనన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా... రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే అధికారులను ముత్యాలరాజే ఎంపిక చేశారని, అదే జాబితాలను ఎన్నికల సంఘానికి పంపారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.


గనుల దోపిడీపై.. ధృతరాష్ట్ర పాత్ర

రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీగా మైనింగ్‌ దోపిడీ జరుగుతోందని తెలిసినా.. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కళ్లు మూసుకున్నారని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ద్వివేది అప్పట్లోనే అనేక విమర్శలు మూటగట్టుకున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే అసాధారణమైన పోస్టులు దక్కించుకుని, అధికారం చలాయించారు. ఆయన పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండగానే ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం వంటి వివాదాస్పద నిర్ణయాల్ని అమలు చేశారు. ఆ తర్వాత గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా..  ‘ముఖ్య’నేతకు ఇసుకలో భారీ లబ్ధి కలిగేలా టెండరు నిబంధనలు రూపొందించడంలో, ఒకే సంస్థకు టెండర్లు దక్కేలా చూడటంలో కీలకంగా వ్యవహరించారన్నది తెదేపా వర్గాల ఆరోపణ. ఇసుక గుత్తేదారు సంస్థ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేసినా ఆయన పట్టించుకోలేదని.. గనులశాఖ, ఏపీఎండీసీల్ని వైకాపా ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతూ ఏకపక్ష నిర్ణయాలతో వెంకటరెడ్డి భ్రష్టుపట్టించినా, అడ్డుకునే ప్రయత్నమే చేయలేదని తెదేపా వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడిస్తూ, వాళ్లు చెప్పినచోట్ల దస్త్రాలపై సంతకాలు చేయడం వల్లే.. నాలుగేళ్లుగా ద్వివేదిని గనులశాఖలో కొనసాగించారని ఆరోపిస్తున్నాయి. 


ఆర్థిక అరాచకానికి అండా దండా 

వైకాపా పాలనలో సాగిన ఆర్థిక అరాచకానికి ప్రతి దశలోనూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ అండదండలు అందించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం రూ.11 లక్షల కోట్లకు చేరడానికి.. ప్రభుత్వ పెద్దలు తీసుకున్న ప్రతి అడ్డగోలు నిర్ణయానికీ రావత్‌ తలాడించడమే కారణమని ధ్వజమెత్తుతున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు ముఖ్యమంత్రి వద్ద ఉంటూ ఆర్థిక నిర్వహణకు, అప్పుల అరాచకానికి ప్రణాళికలు రచిస్తే వాటిని తు.చ. తప్పక అమలు చేసింది ఆయనేనన్న అరోపణలున్నాయి. అప్పులపై కాగ్‌ అడిగిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖల వద్ద వివిధ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాలను ఒక కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించి వాటిని కూడా వాడేయడం, ఖజానా ఆదాయాన్ని వేరే కార్పొరేషన్లకు దొడ్డి దోవలో మళ్లించి అప్పులు తీసుకువచ్చేందుకు రావత్‌ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టించిందీ, కిందిస్థాయి సిబ్బంది కొన్ని పనులు చేయడానికి జంకితే వారిని బెదిరించి భయపెట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దొడ్డిదోవన అప్పులు పుట్టించిందీ ఆయనేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.


వైకాపా ప్రయోజనాలే పరమావధి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్రంలో అత్యున్నత పోస్టు.. అలాంటి బాధ్యతల్లో ఉన్న జవహర్‌రెడ్డి వైకాపా ఎజెండాను భుజానికెత్తుకుని గతంలో ఏ అధికారికీ రానంత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. జగన్‌ కోటరీలోని అత్యంత కీలక అధికారుల్లో ఆయనా ఒకరు. వైకాపా పెద్దలతో పూర్తిగా అంటకాగుతూ, అనేక అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, అస్మదీయ గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు మొదలు ప్రతి అంశంలోనూ ఆయన వైకాపాకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేశారని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా ఆయన తీరు మారలేదని, ఆ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే... లబ్ధిదారులకు ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీని జవహర్‌రెడ్డి నిలిపేశారు. జగన్‌ ఎప్పుడో బటన్లు నొక్కిన పథకాలకు సంబంధించిన నిధుల్ని లబ్ధిదారులకు ఎన్నికల సమయంలో విడుదల చేసేందుకు ప్రయత్నించి ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని చవిచూశారు. ఎన్నికల సమయంలోనూ వైకాపాకు అత్యంత అనుకూలమైన అధికారుల్ని కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించడంలో జవహర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. విశాఖ చుట్టుపక్కల పేదల నుంచి ఎసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంలోనూ జనసేన నాయకుడు మూర్తియాదవ్‌ వంటివారు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు.


ఆయనే డిఫ్యాక్టో ముఖ్యమంత్రి!

ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి ఐదేళ్లూ చెలరేగిపోయారని, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు, మొత్తం పాలననే తన కనుసన్నల్లో నడిపించారని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. సీఎస్‌కు మించి.. ఆయన అధికారులపై పెత్తనం చేశారు. డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. అధికారం మొత్తం ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డే సాగించారన్న విమర్శలున్నాయి. తమ నాయకులు, ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు పథక రచన, దాన్ని పక్కాగా అమలు చేయడంలో ధనుంజయరెడ్డి కీలకపాత్ర పోషించేవారని, సీఎం పేషీ నుంచి నిరంతరం ఫాలోఅప్‌ చేస్తూ అధికారులపై ఒత్తిడి పెంచేవారని తెదేపా నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన అనేక అరాచకాలకు పాల్పడ్డారని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఆర్థికశాఖను గుప్పిట్లో పెట్టుకున్నారని, ఏ కార్యక్రమానికి నిధులు విడుదల చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సిందేనని సమాచారం. కీలకమైన శాఖలన్నింటిపైనా ఆయన పెత్తనం చేశారని, ధనుంజయరెడ్డి చెబితే... ముఖ్యమంత్రి చెప్పినట్టే అన్న స్థాయిలో అధికారం చెలాయించారని వైకాపా నాయకులే చెబుతున్నారు. ఆఖరికి వైకాపా నాయకులకు పదవులు దక్కాలన్నా, పనులు కావాలన్నా, అధికారులకు పోస్టింగ్‌లైనా, బదిలీలైనా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే అన్నంతగా చెలరేగిపోయారు. ఆయన ఏ స్థాయిలో పెత్తనం చేశారో.. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రాజానగరం తాజా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం విలేకర్ల సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు. ధనుంజయరెడ్డి వారం క్రితం పదవీ విరమణ చేశారు.


ఆమె తలచుకుంటే.. నిబంధనలు బలాదూర్‌!

జగన్‌ అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి.. వైకాపా ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కీలకమైన పురపాలకశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె.. నిబంధనల్ని తోసిరాజని తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల్ని శిరసావహించారని తెదేపా వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ పనులకు రూ.400 కోట్లకుపైగా బిల్లులు చెల్లించేందుకు ఆఘమేఘాలపై జీఓలిచ్చారని ఆరోపిస్తున్నాయి. లోకేశ్‌ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలో వైకాపా నేతలు చేయించిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఆమె అనుమతులిచ్చారన్నది వారి ఆరోపణ. వైకాపా ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంలో అధికారులు నిర్ణయించిన ధరకు ఆమె గుడ్డిగా తలూపడంతో అనేక అక్రమాలు జరిగాయని విపక్షాలు చెబుతున్నాయి. రాజధాని అమరావతి విధ్వంసంలో ఆమె ప్రమేయం కూడా ఉందన్నది తెదేపా వర్గాల ఆగ్రహం.


బెదిరిస్తే.. తప్పుడు వాంగ్మూలం ఇచ్చి, ఇరికించేస్తారా? 

తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణలపై రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఎసైన్డ్‌ భూముల్లో అవకతవకల పేరుతో వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెదేపా హయాంలో పురపాలకశాఖ (సీఆర్‌డీఏ) ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్‌గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్‌.. విచారణలో చంద్రబాబు, నారాయణలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారన్నది తెదేపా ఆగ్రహం. ప్రభుత్వం తమను బెదిరించి వాంగ్మూలం ఇప్పించిందని ఆ అధికారులు చెబుతున్నారు. ‘ప్రభుత్వం బెదిరిస్తే, అరెస్ట్‌ చేస్తామంటే.. అవి అక్రమ కేసులని తెలిసీ, ఏ మాత్రం సంబంధం లేని నాయకుల్ని ఇరికించేస్తారా? ఏమీ జరగకపోయినా జరిగిందని చెబుతారా?’ అని తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని