వైకాపా బంటుల్లా పేట్రేగిపోయిన ఐపీఎస్‌లు

రాష్ట్రంలో కొంతమంది ఐపీఎస్‌ అధికారులు గత ఐదేళ్లలో పేట్రేగిపోయారు. అఖిల భారత సర్వీసు అధికారులమనే సంగతే మరిచిపోయి.. వైకాపా బంటుల్లా, జగన్‌ భక్తుల్లా పనిచేశారు.

Updated : 07 Jun 2024 13:40 IST

గత ఐదేళ్లలో అధికారపార్టీతో అంటకాగారు 
అక్రమ కేసులతో విపక్షాలను వేధించారు
కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో వారిపై తెదేపాలో చర్చ
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కొంతమంది ఐపీఎస్‌ అధికారులు గత ఐదేళ్లలో పేట్రేగిపోయారు. అఖిల భారత సర్వీసు అధికారులమనే సంగతే మరిచిపోయి.. వైకాపా బంటుల్లా, జగన్‌ భక్తుల్లా పనిచేశారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాస్తూ.. ప్రతిపక్షాలను అణచివేశారు. అక్రమ కేసులతో వేధించారు. బాధితులపైనే రివర్స్‌లో కేసులు పెట్టారు. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిబంధనలు, చట్టాలను లెక్క చేయకుండా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా ఓటమి పాలై... తెదేపా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో తమను పనిగట్టుకుని వేధించిన ఐపీఎస్‌ అధికారులపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.


పోలీసు వ్యవస్థనే... వైకాపా అనుబంధ  విభాగంగా మార్చేసిన రాజేంద్రనాథరెడ్డి

డీజీపీగా పనిచేసిన కేవీ రాజేంద్రనాథరెడ్డి.. వైకాపా అరాచకాలు, దౌర్జన్యాలకు వెన్నుదన్నుగా నిలిచి.. పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేశారన్న విమర్శలున్నాయి. పోలీసుదళాల అధిపతిగా ఉంటూ.. పూర్తిగా వైకాపా కార్యకర్తలా పనిచేశారని తెదేపా భావిస్తోంది. వైకాపా దమనకాండపై ఫిర్యాదులివ్వడానికి వెళ్తే తమకు ఏ ఒక్క రోజూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెదేపా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ అంతటా వైకాపా నాయకుల మాటే చలామణీ అయ్యేలా చేసి అసలు సిసలైన పోలీసు పెత్తందారుగా వ్యవహరించారనే పేరు మూటగట్టుకున్నారు. వైకాపా అక్రమాలకు కొమ్ముకాసేవారికి కీలక జిల్లాల్లో ఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారన్న విమర్శలున్నాయి. పల్నాడు, తిరుపతి, చిత్తూరు సహా అన్ని జిల్లాల్లో వైకాపా కార్యకర్తల్లా పనిచేసే వారినే డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలుగా నియమించారని, వారి ద్వారా వైకాపాకు అనుచిత ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులు రాజేంద్రనాథరెడ్డిపై ఉన్నాయి.


దురాగతాలకు మాస్టర్‌ మైండ్‌  పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు!

వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కొనసాగించిన అణచివేత, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసుల వెనుక మాస్టర్‌ మైండ్‌గా నిఘా విభాగాధిపతిగా పనిచేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులే వ్యవహరించారని తెదేపా శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన తెరపై ఎక్కడా కనిపించకుండా.. ప్రతిపక్ష నాయకులను ఎవర్ని, ఎక్కడ దెబ్బతీయాలి? వైకాపా ప్రభుత్వంపై ఎదురు తిరుగుతున్నవారిని ఎలా అణచి వేయాలన్న దానిపై వ్యూహరచన చేసి అమలు చేశారని గుర్తించాయి. వైకాపా విజయం కోసం నిఘా వ్యవస్థ, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రతిపక్ష నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు ఆ పార్టీ నాయకులకు చేరవేయడానికి పీఎస్‌ఆర్‌ నేతృత్వంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారన్న ఫిర్యాదులున్నాయి. తమ పార్టీ ముఖ్య నాయకులపై కేసులు బనాయించి పీఎస్‌ఆర్‌ వేధించారని తెదేపా శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.


తెదేపా ముఖ్యులను వేధించడమే కొల్లి రఘురామిరెడ్డి ఎజెండా

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతి కొల్లి రఘురామిరెడ్డి గత ఐదేళ్లలో ఏ పోస్టులో కొనసాగినా, ఏ బాధ్యతలు నిర్వహించినా..తెదేపాలోని ముఖ్య నాయకుల్ని వేధించడం, వారిని ఇబ్బంది పెట్టడమే ప్రధాన ఎజెండాగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపై కేసులు బనాయించి, వేధించడంలో సిట్‌ అధిపతిగా రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్‌గ్రిడ్, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యుల తరఫున రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆయనే అమలు చేశారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను విచారణ పేరిట వేధించారు. ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పోస్టులో ఉంటూ..ఆ విభాగాన్ని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే వాడారని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి. 


వైకాపా అధికార ప్రతినిధిలా సంజయ్‌

సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌ వైకాపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారుల నియమావళి, చట్టాలంటే లెక్కలేకుండా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో అమరావతి, హైదరాబాద్, దిల్లీల్లో ప్రెస్‌మీట్లు పెట్టి, వైకాపా అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి తెదేపా అధినేత చంద్రబాబుపై బురద చల్లడమే ఎజెండాగా పనిచేశారని తెదేపా నాయకులు చెబుతున్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా, ఛార్జిషీటు ఫైల్‌ చేయకముందే నిరాధార ఆరోపణలతో ప్రెస్‌మీట్లు పెడుతూ ఆయన రాజకీయ కుట్రలో భాగమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.


ఎగిరెగిరిపడ్డ కాంతిరాణా తాతా

విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా, అనంతపురం రేంజ్‌ డీఐజీగా పనిచేసిన కాంతి రాణా తాతా.. వైకాపాలో పెద్దల అండదండలు చూసుకుని ఎగిరెగిరి పడ్డారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు, ఆ తదనంతర పరిణామాల్లో ఈయనది పైకి కనిపించని వివాదాస్పద పాత్ర ఉందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలకు ముంగిట జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనలో హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి.. తెదేపా ముఖ్య నాయకులను ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అంతకు ముందు నందిగామలో చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనలో తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి దాన్ని అటకెక్కించేశారు. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారని, అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టారన్న విమర్శలున్నాయి. తెదేపా, భాజపా, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులివ్వడం, వైకాపాతో అంటకాగుతున్న ఐపీఎస్‌ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే.. వారందరి తరఫున వకల్తా పుచ్చుకుని ఐపీఎస్‌ అధికారుల సంఘం పేరిట ప్రకటనలివ్వడం వంటివి అందరూ గుర్తు చేసుకుంటున్నారు.


ప్రభుత్వంపై పోస్టు పెడితే కేసే.. సునీల్‌కుమార్‌ తీరిది

అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ సీఐడీ విభాగాధిపతిగా ఉన్న సమయంలో.. వైకాపాను, ఆ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారన్న విమర్శలున్నాయి. సునీల్‌కుమార్‌ హయాంలోనే.. రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి రాత్రంతా నిర్బంధించి.. ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఫిర్యాదులున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టు చేస్తే చాలు వారిని వేటాడి, వెంటాడి, అర్ధరాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడి మరీ వారిని అరెస్టులు చేశారని, వైకాపా సేవల కోసమే ఉన్నట్లుగా సీఐడీని మార్చేశారని తెదేపా ఆరోపిస్తోంది.


చిత్తూరు జిల్లాలో అరాచకం సృష్టించిన రిషాంత్‌రెడ్డి

చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రిషాంత్‌రెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్వ సైన్యాధ్యక్షుడిలా వ్యవహరిస్తూ ఆయన ఏం చెబితే అదే చట్టమన్నట్లుగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి. పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలు సహా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. చంద్రబాబును కుప్పం వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. హత్యాయత్నాలకు, దాడులకు తెగబడ్డ వైకాపా నాయకులకు కొమ్ముకాశారు. పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైకాపా మూకలు దాడికి పాల్పడితే.. వందల మంది తెదేపా శ్రేణులపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తెదేపా కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు ఇచ్చినందుకు దాని యజమానిని పిలిచి హెచ్చరించి... ఖాళీ చేయించారు. పుంగనూరును అరాచక కేంద్రంగా మార్చడంలో రిషాంత్‌రెడ్డిదే ప్రధాన పాత్ర అనే విమర్శలున్నాయి.


అరాచకాలకు వత్తాసు అమ్మిరెడ్డి

అనంతపురం డీఐజీగా పనిచేసిన ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి.. ప్రతిపక్షాలపై వైకాపా నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తెదేపా వారిపై అక్రమ కేసులు బనాయించారు. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులిచ్చి అక్రమాలకు సహకరించారు. అంగళ్లలో చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో బాధితుడైన చంద్రబాబు, తెదేపా శ్రేణులపైనే రివర్స్‌లో హత్యాయత్నం కేసు పెట్టారు. పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో వైకాపా నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారు. అంతకు ముందు గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలోనూ వివాదాస్పదమయ్యారు.


పిన్నెల్లి దాష్టీకాలకు వెన్నుదన్నుగా రవిశంకర్‌రెడ్డి

వైకాపా అరాచకాలకు వత్తాసు పలికిన వారిలో పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి ప్రధానమైన వారు. వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టీకాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులు మాచర్లను మరో చంబల్‌లోయగా, తాలిబన్‌ సామ్రాజ్యంగా మార్చేస్తే వారికి అన్నీ తానై వ్యవహరించారు. తెదేపా శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారు. వారిని పెద్ద ఎత్తున బైండోవర్‌ చేశారు. అరాచక శక్తులుగా మారిన వైకాపా నాయకులు పేట్రేగిపోతుంటే వారికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఈయన హయాంలో పల్నాడు జిల్లాలో తెదేపా నేతల హత్యలు, వారిపై దాడుల పరంపర కొనసాగింది. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిధిగా హాజరైన ప్రజాగళం సభ భద్రతనూ గాలికొదిలేశారు.


చెవిరెడ్డి, భూమన అరాచకాలకు కొమ్ముకాసిన పరమేశ్వర్‌రెడ్డి

తిరుపతి, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేసిన పరమేశ్వర్‌రెడ్డి.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిల అరాచకాలకు కొమ్ముకాస్తూ తెదేపా శ్రేణులను వేధించారన్న విమర్శలున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్ల దందా సాగగా వాటికి ఈయన సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన దొంగ ఓట్ల వ్యవహారంలో నమోదైన కేసులను నీరుగార్చేశారు. సూత్రధారులు, పాత్రధారులైన వైకాపా నాయకుల్ని కాపాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన ప్రకటనలపై రాజకీయ నాయకుడి తరహాలో విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారు.


తెదేపా శ్రేణులపై  అక్రమ కేసులు పెట్టించిన జాషువా

కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన పల్లె జాషువా మచిలీపట్నం, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైకాపా అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు చేసిన దాడుల్లో ప్రతిపక్ష నాయకులు బాధితులుగా మారగా.. వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు. పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుతో అంటకాగారన్న విమర్శలున్నాయి. చిత్తూరులో తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. రౌడీషీట్లు తెరిచారు. బైండోవర్లు చేశారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతుంటే వెన్నుదన్నుగా నిలిచారు. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను చిత్రహింసలకు గురిచేశారనే ఫిర్యాదులున్నాయి.


వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టిన అన్బురాజన్‌

  • కడప, అనంతపురం ఎస్పీగా పనిచేసిన కేకేఎన్‌ అన్బురాజన్‌.. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు. వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేసి..ప్రతిపక్షాలను వేధించారు.

  • నెల్లూరు ఎస్పీగా పనిచేసిన తిరుమలేశ్వర్‌రెడ్డి..ఆ జిల్లాలో తెదేపా శ్రేణులను అణచివేశారు. తెదేపా నాయకుడు నారాయణ లక్ష్యంగా అనేకసార్లు దాడులు చేయించి వేధించారు. 

  • కర్నూలు రేంజీ డీఐజీ సీహెచ్‌.విజయారావు నెల్లూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. ఈయన హయాంలో పోలీసులు, వైకాపా నాయకులు కలిసి చేసిన వేధింపులకు తాళలేక నెల్లూరు జిల్లాలో పలువురు దళితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు