ఇక ధైర్యంగా రాష్ట్రానికి వస్తా.. వారణాసి నుంచి ఆరుద్ర సెల్ఫీ వీడియో

జగన్‌ సర్కారు ఘోర పరాజయంతో.. ఆయన ప్రభుత్వంలో వేధింపులకు గురైన బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మహిళలను వేధించిన వైకాపా పాలన పోయి..

Updated : 07 Jun 2024 08:59 IST

మంచం పట్టిన కుమార్తెకు వారణాసిలో సపర్యలు చేస్తున్న ఆరుద్ర

ఈనాడు, కాకినాడ: జగన్‌ సర్కారు ఘోర పరాజయంతో.. ఆయన ప్రభుత్వంలో వేధింపులకు గురైన బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మహిళలను వేధించిన వైకాపా పాలన పోయి.. తెదేపా ప్రభుత్వం రావడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకినాడ గ్రామీణం రాయుడిపాలేనికి చెందిన బాధితురాలు ఆరుద్ర ఆనందం వ్యక్తంచేశారు. వెన్నెముక సమస్యతో మంచం పట్టిన కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం తన ఇంటిని అమ్మేందుకు యత్నిస్తే నాటి మంత్రి దాడిశెట్టి రాజా దగ్గర పనిచేసినవాళ్లు అడ్డుపడి వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేయని రోజు లేదు. ఈ అన్యాయాన్ని చెప్పుకోవడానికి నాటి సీఎం జగన్‌ను కలవడానికి వెళ్తే అక్కడా తిరస్కరణ ఎదురవడంతో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరే గతంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్థానికంగా వైకాపా నాయకులు, పోలీసుల వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం రాష్ట్రం విడిచి వారణాసి వెళ్లిపోయిన ఆమె గురువారం అక్కడి నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆరుద్ర.. ‘ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు.. వారంతా నాకు మద్దతు ఇచ్చేలా చంద్రబాబును నిలబెట్టారు. ఆయన ఉంటే ఏ ఆడపిల్లకూ అన్యాయం జరగదు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ల పాలనలో ఆడపిల్లలకు రక్షణ దొరకుతుంది. మాకు జరిగిన అన్యాయంపై రాష్ట్రానికి వచ్చి వారిని కలుస్తాను’ అని ఆరుద్ర పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని