రిజర్వాయర్లలో నీటిమట్టాల తగ్గుదల

దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటిమట్టాలు రాను రాను క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రధానమైన 150 రిజర్వాయర్లలో మొత్తం నీటినిల్వ 39.765 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) ఉన్నట్లు తాజా గణాంకాలు చూపుతున్నాయి.

Published : 07 Jun 2024 05:43 IST

దక్షిణాదిలో పరిస్థితి తీవ్రం

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటిమట్టాలు రాను రాను క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రధానమైన 150 రిజర్వాయర్లలో మొత్తం నీటినిల్వ 39.765 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) ఉన్నట్లు తాజా గణాంకాలు చూపుతున్నాయి. ఇది ఆయా జలాశయాల్లోని మొత్తం నీటినిల్వ సామర్థ్యంలో 22 శాతం మాత్రమే. వారం రోజుల కిందట ఈ రిజర్వాయర్లలో 23 శాతం నీటినిల్వలు ఉండేవి. వేసవికాలం మొదలయ్యాక గత మూడు నెలలుగా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. దక్షిణాది జలాశయాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీటిలో 13 శాతం నీటినిల్వలు మాత్రమే ఉన్నాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రధాన జలాశయాలను గుర్తించారు. వీటి మొత్తం నీటినిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం కాగా, ప్రస్తుతం ప్రమాదకరస్థాయిలో 7.114 బీసీఎం నిల్వలు మాత్రమే ఉన్నాయి. 2023 జూన్‌ నెలలో నమోదైన 23 శాతం నిల్వల కంటే ఇది చాలా తక్కువ. గత పదేళ్ల సగటు తీసుకున్నా ఈ జలాశయాల్లో 19 శాతం నీటినిల్వలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తన వారాంతపు రిజర్వాయర్‌ బులెటిన్‌ను గురువారం విడుదల చేసింది. 

  • గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా, సబర్మతీ నదుల పరీవాహక ప్రాంతాల్లో మాత్రం సాధారణ నీటినిల్వల కంటే అధికంగానే ఉన్నట్లు బులెటిన్‌ పేర్కొంది. సింధు, గోదావరి నదుల్లో పరిస్థితులు సాధారణ నిల్వలకు దగ్గరగా ఉన్నాయి. మహానది, కృష్ణా, కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలకు కొరత ఉన్నట్లు నివేదిక తెలిపింది. అస్సాం, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో గతేడాది కంటే మెరుగైన స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయి. ఇందుకు భిన్నంగా హిమాచల్‌ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో నీటినిల్వలు తగ్గిపోయాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని