వీఎస్‌యూలో రాత్రికి రాత్రే శిలాఫలకాల ఏర్పాటు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ సుందరవల్లి నిర్ణయాలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆమె యూనివర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 08 Jun 2024 06:22 IST

తెదేపా నాయకుల ఆందోళన... శిలాఫలకాల తొలగింపు

శిలాఫలకాలను తొలగిస్తున్న నాయకులు

వెంకటాచలం, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ సుందరవల్లి నిర్ణయాలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆమె యూనివర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో గతంలో నిర్మించిన భవనాలకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు గురువారం రాత్రి హడావుడిగా శిలాఫలకాలు వేయించారు. వీటిలో ఒక భవనాన్ని ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా (మే 6న) ప్రారంభించినట్లు ఉంది. ఇది సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి రావడంతో వీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు విశ్వవిద్యాలయానికి వెళ్లి పరిశీలించారు. రాత్రికి రాత్రే శిలాఫలకాలు ఏర్పాటు చేయడంపై వీఎస్‌యూ అధికారులను నిలదీశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు భవనాలను ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. గతంలో నిర్మించిన భవనాలకు అప్పుడే శిలాఫలకాలు ఎందుకు వేయలేదని ప్రశ్నించగా వీఎస్‌యూ అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ శిలాఫలకాలను తెదేపా నాయకులు తొలగించారు.

నిర్మించిన భవనాలకు శిలాఫలకాలు

రిజిస్ట్రార్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వీఎస్‌యూలో గతంలో నిర్మించి, ప్రారంభించిన భవనాలకు గురువారం కోడ్‌ ముగిసిన తర్వాత శిలాఫలకాలు వేశామన్నారు. ప్రస్తుతం ఆ భవనాలను ఉపయోగిస్తున్నామని, శిలాఫలకాలు గతంలోనే తయారుచేసినవని పేర్కొన్నారు. కోడ్‌ ముగిసిన తర్వాత వేద్దామని పక్కన పెట్టామని, అప్పటి భవనాలకే ఏర్పాటు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని