రామోజీరావు అందరి శ్రేయోభిలాషి

రామోజీరావు అందరి శ్రేయోభిలాషి. భారతీయ మీడియా, సినిమా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విస్తృతమైన సేవలు అందించారు. ఆయా రంగాలపై చెరగని ముద్ర వేశారు. తెలుగు జర్నలిజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు.

Updated : 09 Jun 2024 08:07 IST

తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ 

రామోజీరావు అందరి శ్రేయోభిలాషి. భారతీయ మీడియా, సినిమా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విస్తృతమైన సేవలు అందించారు. ఆయా రంగాలపై చెరగని ముద్ర వేశారు. తెలుగు జర్నలిజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఫిల్మ్‌సిటీ ఆయన సృజనాత్మకతను, ప్రత్యేకతను, దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. విశాలమైన ల్యాండ్‌స్కేప్‌లు, విభిన్న సెట్‌లు, నిర్మాణాలతో సినీ నిర్మాతలకు ‘వన్‌స్టాప్‌ డెస్టినేషన్‌’గా సేవలు అందిస్తోంది. కొన్నేళ్లుగా ప్రపంచ వినోద పరిశ్రమలో అగ్రగామిగా నిలుస్తోంది. ఆయన చాలామందికి మార్గదర్శిగా, ప్రేరణగా నిలిచారు. ప్రతి రంగంలో వినూత్న ఆవిష్కరణలు, నిబద్ధతతో విజయాలు సాధించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా.


సామాజిక మార్పునకు గొప్పగా కృషి చేశారు 

- హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ 

దేశంలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు నిరంతరం పోరాడారు. ఆటుపోట్లు ఎదురైనా పట్టుదలతో ముందుకెళ్లారు. సామాజిక మార్పు కోసం గొప్పగా కృషి చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల ఉన్నతికి ‘ఈనాడు-ఈటీవీ’ ద్వారా ఎంతో సేవ అందించారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక సలహాలిచ్చి ముందుకు నడిపించారు. రామోజీరావు మరణం దేశానికి తీరనిలోటు. నేను స్వయంగా ఓ ఆత్మీయుడిని కోల్పోయా. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని కలిగించాలి.


ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరచూ కలిసే వాడిని 

- త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి 

పత్రిక, వ్యాపార రంగాల్లో రామోజీరావు చేసిన కృషి చిరస్మరణీయం. ఆయనతో నాకు ఎనలేని అనుబంధం ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తరచూ కలిసేవాడిని. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. 


యువతకు స్ఫూర్తిదాత 

- గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ 

దేశంలో యువతకు, భావితరాలకు రామోజీరావు స్ఫూర్తిగా నిలిచారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. పత్రిక, వ్యాపార రంగాల్లో ఎన్నో వినూత్న ఒరవడులు తీసుకొచ్చారు. భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన ఆలోచనా విధానం, మార్గదర్శనం మనందరికీ ఆదర్శప్రాయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.


ఆ విజయాల వెనుక కఠోర శ్రమ 

- గడ్డం ప్రసాద్‌కుమార్,తెలంగాణ శాసనసభ స్పీకర్‌ 

రామోజీరావు మరణవార్త చాలా బాధించింది. విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన ఎంతో కష్టపడి విజయాలు సాధించారు. వ్యాపార, సామాజికవేత్తగా పేరుగాంచారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.


ఆయన సేవలు చిరస్మరణీయం

- దత్తాత్రేయ హోసబలే, ఆర్‌ఎస్‌ఎస్‌

రామోజీ ఫిల్మ్‌ సిటీ వ్యవస్థాపకుడు రామోజీరావు మరణం జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు. తాను ఎంచుకున్న రంగంలో ఆయన ఆవిష్కరణలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు సద్గతి ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఓం.శాంతి.


మార్గనిర్దేశకుడు

- ఎడిటర్స్‌ గిల్డ్‌

‘ఎడిటర్స్‌ గిల్డ్‌ మాజీ అధ్యక్షుడు రామోజీరావు మరణం విచారకరం. మీడియా మొఘల్‌గా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన ఆయన ఎన్నో అంశాల్లో మనందరికీ మార్గనిర్దేశకుడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి. ఆయనో ఐకాన్‌. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి.. దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది.

(1987లో రామోజీరావు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. పత్రికా స్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించారు.)


చిరకాలం గుర్తుంటారు

- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

మీడియా పరిశ్రమకు రామోజీరావు చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయి. ఆయన మరణంపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. మీడియా, వినోద రంగం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఈ రెండు రంగాలను విప్లవాత్మకంగా మార్చారు. నిత్య నూతన ఆవిష్కర్త, వ్యాపారవేత్తగా ఈనాడు దినపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్‌ సిటీతోపాటు పలు సంస్థలను నెలకొల్పారు. సామాజిక రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు.


సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు

- రద్దయిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

మీడియా, వినోద రంగాల్లో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన మరణం నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఓం శాంతి.


ఉత్కృష్ట వ్యక్తి

- అమిత్‌ షా

రామోజీరావు ఉత్కృష్ట వ్యక్తి. మీడియా దిగ్గజం. ఐకానిక్‌ పారిశ్రామికవేత్త. ఆయన మరణం అత్యంత బాధాకరం. అసమాన ప్రతిభతో అనేక రంగాల్లో రామోజీరావు సానుకూల మార్పులను తీసుకొచ్చారు. ఆయన రాణించని రంగం లేదు. భౌతికంగా మనతో లేకపోయినా ఆయన లెగసీ ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు నా సానుభూతిని తెలియజేస్తున్నా.


మీడియా, సినీ ప్రపంచానికి తీరని లోటు

- రాజ్‌నాథ్‌సింగ్‌

రామోజీరావు మరణం ఎంతో బాధ కలిగించింది. తెలుగు మీడియా రంగంలో సుదీర్ఘమైన అనుభవంతో మీడియా, చలన చిత్రాలు, వినోద రంగ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా, సినీ ప్రపంచానికి తీరని లోటు. ఓం శాంతి.


మీడియా రంగాన్ని దూరదృష్టితో మార్చిన వ్యక్తి

- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

భారత మీడియా రంగాన్ని దూరదృష్టితో విప్లవాత్మకంగా మార్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ప్రముఖ సినీ నిర్మాత, మీడియా వ్యవస్థాపకుడు, విద్యా వేత్త రామోజీరావు మరణం తీరని లోటు. సినిమా, జర్నలిజం రంగానికి ఆయన విశేష సేవలందించారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి.


వినోద రంగంపై చెరగని ముద్ర 

- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

భారత మీడియా రంగంలో అగ్రగామి, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు మరణం తీరని లోటు. జర్నలిజం, సినిమా, వినోద రంగాల్లో ఆయన చేసిన సేవలు చెరగని ముద్ర వేశాయి. మీడియా ప్రపంచాన్ని మార్చివేశాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా.


విశేష సేవలందించారు

- ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

రామోజీరావు మరణించడం తీవ్ర విషాదం. ఆయన ఎంతో దూరదృష్టి కలిగినవారు. మీడియా, జర్నలిజం, సినీ పరిశ్రమలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన అందించిన విశేష సేవలు ఘన వారసత్వాన్ని అందించాయి. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.


క్లిష్ట సమయంలో అండగా నిలిచారు

- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

రామోజీరావు మరణించడం బాధాకరం. ఆయన ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉత్సుకత, దూరదృష్టి, అంకిత భావంతో చెరగని ముద్ర వేయడంతోపాటు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కేరళ విపత్తు సమయంలో అండగా నిలిచారు. పునర్నిర్మాణానికి సహకరించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. గొప్పయోధుడి మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.


గొప్ప స్నేహితుణ్ని కోల్పోయా 

- లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌

రామోజీరావు మరణం తెలుగు సమాజానికి, భారతీయ జర్నలిజానికి తీరని లోటు. రాజీలేని, నిర్బయ పోరాట పటిమ, అంకిత భావం, ఆవిష్కరణ, సమగ్రత, విశ్వసనీయత, రైతుల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం ఆయన నిలిచారు. 5 దశాబ్దాలపాటు మీడియా ప్రపంచంలో విశ్వరూపంలా, తెలుగు ప్రజల ఆధునిక చరిత్రలో అంతర్భాగంగా నిలిచారు. తెలుగు ప్రజలు ఒక ఛాంపియన్‌ను, జర్నలిజం ఓ గొప్ప పోరాట యోధుడిని కోల్పోయింది. నేను గొప్ప స్నేహితుణ్ని కోల్పోయాను. గొప్ప యోధుల్లో ఒకరు రామోజీరావు. ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయి.


అనేక రంగాల్లో ఎనలేని సేవలు

- జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ఏపీ గవర్నర్‌ 

జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యారంగాల్లో రామోజీరావు ఎనలేని సేవలందించారు. తెలుగు పాత్రికేయంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. మీడియా, వినోదరంగంలో నిష్ణాతుడిగా నిలిచారు. ఆయా రంగాల్లో సేవలకుగానూ ఆయన్ను పద్మవిభూషణ్‌ వరించింది.


తెలుగు భాష పరిరక్షణకు కృషి

- కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌ 

రామోజీరావు ఎన్నో సంస్థలను స్థాపించి యువత, మహిళలకు ఉపాధి కల్పించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయకేతనం ఎగురవేస్తూ ముందుకు సాగారు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించారు.


మీడియా రంగం మహోన్నత వ్యక్తిని కోల్పోయింది

- జస్టిస్‌ దుప్పల వెంకటరమణ, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో తెలుగు మీడియా రంగం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా.


తెలుగు జాతికి తీరని లోటు

- జస్టిస్‌ బట్టు దేవానంద్, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి 

గుడివాడ నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహావ్యక్తి రామోజీరావు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు. రామోజీరావు మృతికి తీవ్ర సంతాపం  తెలియజేస్తున్నా.


తెలుగు ప్రజలకు తీరని లోటు

- మోషేన్‌రాజు, ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ 

రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. ఈనాడు పత్రికను తెలుగువారి ఇంట్లో నిత్యావసరంగా మార్చిన  వ్యక్తి రామోజీరావు.


పాత్రికేయ రంగంలో చెరగని ముద్ర

- పురందేశ్వరి, ఏపీ భాజపా అధ్యక్షురాలు 

ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీరావు తెలుగు భాషకు ఎనలేని సేవలందించారు. పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన ఆయన.. ప్రస్తుతం లేరనే వార్త కలచివేస్తోంది. సినీరంగంలోనూ ఎంతోమంది కళాకారుల్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి.


తెలుగు జాతికి తీరని లోటు 

- తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

తెలుగు మీడియా మేరునగధీరుడు, వ్యాపారవేత్త, ప్రఖ్యాత సినీ నిర్మాత పద్మవిభూషణ్‌ రామోజీరావు మరణం తెలుగుజాతికి తీరనిలోటు. చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు ఆయన జీవితం మనకో ఉదాహరణ. తెలుగు పత్రికా రంగంలో ‘ఈనాడు’ ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో గ్రామీణుల సమస్యలకు సరైన ప్రాధాన్యమిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అన్నదాత ద్వారా రైతుల్లో చైతన్యం తెచ్చారు. వసుంధర ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యం నింపారు. తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నబడ్జెట్‌ సినిమాలతో కొత్త నటుల్ని పరిచయం చేసి వారికి గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు, మీడియా రంగానికి, టీవీ పరిశ్రమకు తీరనిలోటు. 


తెలుగు సంస్కృతికి చిరునామా 

- త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి

తెలుగు భాషను సుసంపన్నం చేసిన, తెలుగువారి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామోజీరావు నిష్క్రమణ తెలుగు వారికి తీరని లోటు. ఆయన మన సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామా. ప్రజా శ్రేయస్సు కోసం జీవితాంతం పాటుపడిన రామోజీరావుకు భగవంతుని పాదాల చెంత చోటు దక్కాలని ప్రార్థిస్తున్నా. రామోజీరావు ఆశయాలను కొనసాగించే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా.


చండ్రరాజేశ్వరరావు అంటే ఆయనకు అభిమానం

- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ 

రామోజీరావు మరణంతో తెలుగు ప్రపంచం చిన్నబోయింది. తెలుగు   ప్రజలకు ఇది చీకటి రోజు. ఆయన వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషి. చండ్రరాజేశ్వరరావు పట్ల ఎంతో     అభిమానంతో ఉండేవారు. హైదరాబాద్‌లో చండ్రరాజేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు భూరివిరాళాన్ని అందించారు. ఫిల్మ్‌సిటీ ప్రపంచంలోనే కీర్తిపొందింది.


సభాపతిగా తెలుగు వాడకంపై నన్ను అభినందించారు 

- జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

మీడియాకు సామాజిక బాధ్యత ఉందని గుర్తించడమే కాకుండా ఎంత కష్టమైనా సరే విలువలతో జర్నలిజం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌సిటీ నిర్మించారు. తెలుగుభాషకు ఆయన చేసిన సేవ ఎనలేనిది. సభాపతిగా ఉన్నప్పుడు చర్చల్లో తెలుగు భాష ఎక్కువగా వాడాలని నేను చేసిన ప్రయత్నానికి ఆయన ఫోన్‌ చేసి అభినందించారు.


తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలు

- ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌

రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 


అలుపెరగని అక్షరయోధుడు

- తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 

ప్రజాపక్షపాతి, అలుపెరగని అక్షరయోధుడికి కన్నీటి నివాళ్లు. జనహితం కోసం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు అందరికీ మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో పోరాడారు. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు.


ఈనాడుతో నవశకానికి నాంది పలికారు

-  తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు పత్రికతో రామోజీరావు నవశకానికి నాంది పలికారు. ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువయ్యారు. నిజాలు నిర్భయంగా వెల్లడించి సమాజాన్ని చైతన్యం చేశారు. సమాచార హక్కు చట్టం, సుజలాం..సుఫలాం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటు.


ప్రజల కోసమే ప్రభుత్వాలు పని చేయాలనేవారు 

- మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేయాలని రామోజీరావు తపించేవారు. రైతు కుటుంబంలో జన్మించి కఠోర శ్రమతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యం. మార్గదర్శి, ప్రియా ఫుడ్స్, కళాంజలి.. ఇలా ఎన్నో సంస్థల్ని స్థాపించారు. జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీని నెలకొల్పారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.


చిత్రసీమలో ఉషాకిరణాలు ప్రసరింపజేశారు

- ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

మా నాన్న ఎన్టీఆర్‌తో రామోజీరావు అనుబంధం ప్రత్యేకమైంది. పత్రికా రంగంలో ఆయన మకుటం లేని మహారాజు. భావి పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రసీమలోనూ ఆయన ఉషాకిరణాలు ప్రసరింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీని తెలుగునేలపై నెలకొల్పారు. 


భావితరాలకు స్ఫూర్తి రామోజీరావు

 - వైఎస్‌ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు

అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు అందుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి రామోజీరావు. ఆయన మరణం అత్యంత విషాదకరం. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 


ఎంచుకున్న ప్రతిరంగంలోనూ విశిష్ట ప్రతిభ చూపారు 

- రామకృష్ణ, సీపీఐ ఏపీ కార్యదర్శి 

తెలుగు పత్రికా రంగంలో పెను మార్పులకు రామోజీరావు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన ఘనత ఆయనది. ఎంచుకున్న ప్రతి రంగంలో రామోజీరావు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. 


జర్నలిజానికి వన్నె తెచ్చారు

-పనబాక లక్ష్మి, కేంద్ర మాజీ మంత్రి

పత్రికారంగంలో ఎన్నో కొత్త పోకడలు ప్రవేశపెట్టి జర్నలిజానికే వన్నె తెచ్చిన ఘనత రామోజీరావుది. గ్రామగ్రామాన ఇంటింటికి దినపత్రికను చేరవేసి పెనువిప్లవం సృష్టించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రత్యేక స్థానానికి చేరుకున్నారు. రామోజీరావు లేని లోటును పూరించడం కష్టం.


దిగ్భ్రాంతికి గురి చేసింది 

- శ్రీనివాసరావు, సీపీఎం ఏపీ కార్యదర్శి 

రామోజీరావు మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత ఆయనదే. పత్రికను మారుమూల గ్రామాలకు చేర్చారు. తెలుగు భాషాభివృద్ధికి మీడియాను ఉపయోగించడం వంటి అంశాలు తెలుగు జర్నలిజం చరిత్రలో నిలిచిపోతాయి. సారా వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచారు. రామోజీ ఫిలిం సిటీని నిర్మించి సినిమా పరిశ్రమకు తోడ్పడ్డారు. ఆయన మృతి తీరని లోటు.


అఖండ జ్యోతి ఆరిపోయింది

- మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు

సొంత అభిప్రాయాలతో జీవించారు. జీవితంలో ఎవరికీ తలవంచలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. ఒక లెజెండ్‌. ఆయన మృతి ఈ దేశానికి, రాష్ట్రానికి నష్టం.


ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం 

- పరిటాల సునీత, పరిటాల శ్రీరాం 

మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. పరిటాల రవి ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా మా కష్టాలు ఆయనకు చెప్పుకొనేవాళ్లం. ప్రజల పక్షాన గొంతెత్తిన వ్యక్తి ఆయన. అక్రమాలపై ధైర్యంగా పోరాడారు. వచ్చే తరాలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి.


పేద ప్రజల గొంతుకగా ఈనాడును నడిపారు

- టి.హరీశ్‌రావు, తెలంగాణ మాజీ మంత్రి

రామోజీరావు మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు. పేద ప్రజల గొంతుకగా ‘ఈనాడు’ పత్రికను నడుపుతూ ఎంతో మంది పక్షాన నిలిచిన మహనీయుడు ఆయన. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కృషి వల్లే ప్రజలకు వార్తా పత్రికలు దగ్గరయ్యాయి. అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించి నగరాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తెలుగు భాష పరిరక్షణ కోసం చేసిన కృషి మరువలేనిది. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో ఆయన సాధించిన విజయాలు యావత్‌ తెలుగు జాతికి గర్వకారణం. చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపారు. సమాజ సేవ చేసి ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన కుటుంబానికి, సంస్థ ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం. 


పాత్రికేయ దిగ్గజం రామోజీరావు

- వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజయ్‌ ఉపాధ్యాయ, నరేంద్ర భండారి 

మీడియా దిగ్గజం రామోజీరావు ఆకస్మిక మృతి బాధాకరం. ఈనాడు, ఈటీవీలతోపాటు ఈటీవీ భారత్‌ యాప్‌ ద్వారా పాత్రికేయ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ ద్వారా ఏటా వందల మంది జర్నలిస్టులను తయారు చేశారు. రామోజీరావు చూపిన మార్గంలో పాత్రికేయులు, ప్రజలు నడవాలని ఆకాంక్షిస్తున్నాం. 


నూతనత్వానికి ఆద్యులు

- తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు. దినపత్రికల విస్తరణకు, నూతనత్వానికి ఆద్యులు. తెలుగు భాష సమున్నతికి జర్నలిజం ద్వారా కృషి చేసిన కృషీవలుడిని కోల్పోవడం విచారకరం. 


రామోజీరావు అస్తమయం ప్రజలకు అశనిపాతం

- విద్యావేత్త చుక్కా రామయ్య

బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలకు అశనిపాతం. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు వారి జీవితాల్లో పెనవేసుకుపోయిన ఆయన విశిష్ట వ్యక్తిత్వం పోరాట స్ఫూర్తికి నిదర్శనం. పత్రిక, సినిమా, టీవీ, వ్యాపార, డిజిటల్‌ రంగాల్లో ఆయనది చెరగని ముద్ర. అసాధారణ వ్యక్తి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. 


సారా వ్యతిరేక ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు 

- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

రామోజీరావుతో నా అనుబంధం దశాబ్దాల నాటిది. సారా వ్యతిరేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడానికి ఆయన కృషి చేశారు. ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇవ్వడం, ఆ వెంటనే అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సారాను నిషేధించడంలో ఈనాడు, రామోజీరావు పాత్ర కీలకమైనది.


ధర్మం ఏంటనేది తెలియజేశారు

- సుజనాచౌదరి

మీడియాలో భయం లేకుండా న్యాయం, ధర్మం ఏంటనేది ప్రతి వ్యక్తికీ తెలియజేశారు. ధర్మంగా వ్యాపారం చేయడం ఎలాగో చూపించారు. నాలుగు శతాబ్దాల నుంచి మీడియా ఎలా ఉండాలో చూపించారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థ కోసమే చేశారు. 


తెలుగు జాతికి తీరని లోటు 

- టీడీ జనార్దన్‌

పత్రిక, టీవీ, సినీ రంగాల్లో రామోజీరావు తనదైన ముద్రవేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రామోజీ గ్రూపు సంస్థల ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. 


రామోజీరావు నా పితృసమానులు

- నందమూరి రామకృష్ణ

రామోజీరావు నా పితృసమానులు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. వివిధ రంగాలకు విశేషసేవలు అందించారు. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించారు. వారి ఆత్మకు శాంతికలగాలి.


ప్రజాజీవితంలో బలమైన ముద్రవేశారు

- విజయసాయిరెడ్డి, వైకాపా నేత

ప్రజా జీవితంలో రామోజీరావు బలమైన ముద్రవేశారు. తెలుగు పత్రికా రంగాన్ని దాదాపు అయిదు దశాబ్దాల పాటు ప్రభావితం చేశారు. ఆయన మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 


అందరికీ ఆదర్శప్రాయులు  

- మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

రామోజీరావు అందరికీ ఆదర్శప్రాయులు. శ్రమిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చనడానికి ఆయన జీవితమే నిదర్శనం. పత్రికా రంగంలో వినూత్న ఒరవడిని తీసుకొచ్చారు. 


హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు 

- మంత్రి జూపల్లి కృష్ణారావు 

రామోజీరావు గొప్ప వ్యక్తి. పత్రికా రంగంలోనే కాకుండా తెలుగుభాషకు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి తీసుకొచ్చారు. ఆయన అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. రామోజీ ఫిలింసిటీని ఏర్పాటుచేసి హైదరాబాదుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు కల్పించారు.


క్రమశిక్షణకు మారు పేరు 

- మంత్రి కొండా సురేఖ 

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు క్రమశిక్షణ, పట్టుదలతో దేశం గర్వించదగ్గ శక్తిగా ఎదిగారు. మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి, జర్నలిజానికి గొప్ప విలువను తీసుకొచ్చారు. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్రతో ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. 


అలుపెరుగని అక్షర యోధుడు

- మంత్రి సీతక్క

తెలుగు వారి జీవితాల్లో రామోజీరావు అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ప్రజాపక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడాయన. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేశారు. 


అక్షరయోధుడి మరణం తీరని లోటు 

- మంత్రి దామోదర్‌ రాజనర్సింహ 

‘ఈనాడు’తో ప్రజా చైతన్యానికి కృషి చేసిన అక్షర యోధుడు రామోజీరావు. ఉత్తమ అభిరుచి కలిగిన సినీ నిర్మాతగా, ఫిల్మ్‌ సిటీ అధినేతగా, వివిధ వ్యాపార సంస్థల స్థాపకులుగా ఎన్నో అద్భుత విజయాలను సాధించి విశిష్ట వ్యక్తిగా నిలిచారు. 


ఆప్యాయంగా పలకరించేవారు 

- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

మీడియా, రాజకీయాలు, చిత్రరంగం, ప్రజాజీవితంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. ఆయన ఓ దిగ్గజం. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన మరణం బాధాకరం. 


రైతుల ప్రగతికి బాటలు 

- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

‘ఈనాడు’తో ప్రజల్ని నిరంతరం చైతన్యపరిచిన రామోజీరావును కోల్పోవడం తెలుగుజాతికి తీరని లోటు. ఆధునిక సాగు పద్ధతులను వివరించే అన్నదాత పత్రిక ద్వారా లక్షల మంది రైతుల ప్రగతికి బాటలు వేశారు.


విలువలతో కూడిన ఒరవడికి ఆద్యుడు

- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు రామోజీరావు. ఆయన మరణం మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి తీరనిలోటు.


ప్రజా చైతన్యానికి నాంది పలికారు 

- మంత్రి శ్రీధర్‌బాబు 

మీడియా, సినిమా రంగాల్లో రామోజీరావు సేవలు మరువలేనివి. ‘ఈనాడు’తో ప్రజా చైతన్యానికి నాంది పలికారు. ఫిల్మ్‌సిటీ అధినేతగా, వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, మీడియా దిగ్గజంగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఆయన మరణం బాధాకరం.


అమ్మభాషకు వన్నె తెచ్చారు 

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

రామోజీరావు మరణం తీరని లోటు. ‘ఈనాడు’తో ప్రజల్లో మీడియాపై సానుకూల దృక్పథాన్ని పెంచిన అక్షర శిల్పి. తెలుగు-వెలుగుతో అమ్మ భాషకు వన్నె తెచ్చేందుకు విశేష కృషి చేశారు.


సినీ ప్రముఖుల సంతాపాలు

రామోజీరావు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినీ దిగ్గజం. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ‘‘నిన్ను చూడాలని’’ చిత్రంతో నన్ను తెలుగు సినీపరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. 

నటుడు ఎన్టీఆర్‌


పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు మరణం అత్యంత బాధాకరం.

నటుడు రామ్‌చరణ్‌


రామోజీరావుతో నాకు 43 ఏళ్ల అనుబంధం. తాను ప్రజల మనిషినని.. వారి కోసమే బతుకుతున్నానని చెప్పేవారు. ఆయన మరణం తెలుగు వారికే కాదు.. యావత్‌ ప్రపంచానికీ తీరని లోటు.

నటుడు మోహన్‌బాబు


రామోజీరావు మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలి.

నటుడు రవితేజ


నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

నటుడు అల్లు అర్జున్‌


రామోజీరావుది మరణమని నేను అనుకోవట్లేదు. ఆయనది నిర్యాణం.

సంగీత దర్శకుడు కీరవాణి


రామోజీరావు మృతితో తెలుగు వారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. నన్ను అత్యంత ప్రేమించిన వ్యక్తి ఆయన.

నటుడు రాజేంద్రప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని