Andhra Pradesh: కోడ్‌ అమల్లో ఉన్నా అదే పెత్తనమా!

అధికార పార్టీ నేతలకు నచ్చని అధికారిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు.. అనుకూలమైన అధికారిని ఎలా అందలం ఎక్కించవచ్చో తెలుసుకోవాలంటే దేవాదాయ శాఖను చూస్తేనే అర్థమవుతుంది. కమిషనరేట్‌లో ఉండాల్సిన అదనపు కమిషనర్‌ను అక్కడి నుంచి వెళ్లగొట్టి, కనీసం ఆయనకు ఛాంబర్‌ కూడా లేకుండా చేశారు.

Updated : 27 May 2024 05:24 IST

అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు
కమిషనరేట్‌కు దూరంగా అదనపు కమిషనర్‌
పోస్టే లేని జాయింట్‌ కమిషనర్‌కు పెత్తనం

ఈనాడు, అమరావతి: అధికార పార్టీ నేతలకు నచ్చని అధికారిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు.. అనుకూలమైన అధికారిని ఎలా అందలం ఎక్కించవచ్చో తెలుసుకోవాలంటే దేవాదాయ శాఖను చూస్తేనే అర్థమవుతుంది. కమిషనరేట్‌లో ఉండాల్సిన అదనపు కమిషనర్‌ను అక్కడి నుంచి వెళ్లగొట్టి, కనీసం ఆయనకు ఛాంబర్‌ కూడా లేకుండా చేశారు. ఎందుకంటే అమాత్యునికి ఆయనంటే ఇష్టం ఉండదు మరి. మరోవైపు కమిషనరేట్‌లో ఎటువంటి పోస్టూ లేని జాయింట్‌ కమిషనర్‌ తీసుకొచ్చి కీలక నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆయనంటే అమాత్యునికి వల్లమాలిన ఇష్టమే అందుకు కారణం. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గాల్సిన అవసరం లేదు. కోడ్‌ అమల్లోకి వచ్చి 40 రోజులైనా.. ఇప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు జీహుజూర్‌ అంటున్నారు.

కమిషనరేట్‌ గడప తొక్కనివ్వకుండా..

జాయింట్‌ కమిషనర్‌ కేడర్‌ కలిగిన అన్నవరం ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ఆయన్ను గతేడాది అక్టోబరులో బదిలీ చేశారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌గా ఉన్న రామచంద్రమోహన్‌ను అన్నవరం ఆలయ ఈవోగా బదిలీ చేశారు. వాస్తవానికి దేవాదాయ శాఖలో రెండు అదనపు కమిషనర్‌ పోస్టులూ కమిషనరేట్‌లోనే ఉన్నాయి. ఆ కేడర్‌ అధికారి అక్కడే పని చేయాలి. కానీ అన్నవరం ఆలయానికి బదిలీ చేశారు. అదేలా చేస్తారని విమర్శలు రావడంతో డిప్యుటేషన్‌పై పంపినట్లు సవరణ ఆదేశాలిచ్చారు. తర్వాత మళ్లీ బదిలీ ఆదేశాలిచ్చారు. దీనిపై రామచంద్రమోహన్‌ హైకోర్టును ఆశ్రయించారు. బదిలీ చెల్లదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన్ను అదనపు కమిషనర్‌గా ఉంచుతూనే.. అన్నవరం ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు మరో ఆర్డర్‌ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆయనకు కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌గా విధుల్లేకుండా చేశారు. కేవలం అన్నవరం ఈవోగానే పనిచేసేలా చూస్తున్నారు. కీలక బాధ్యతలు చూడాల్సిన ఆయన్ను కమిషనరేట్‌ గడప తొక్కనివ్వకుండా, అసలు ఛాంబరే లేకుండా చేశారు. విచిత్రం ఏమిటంటే.. రామచంద్రమోహన్‌ అన్నవరం ఈవోగా 9 నెలల నుంచి విధులు నిర్వర్తిస్తుండగా, ఆయనకు కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌ పోస్టు పేరిట జీతమిస్తున్నారు.

విమర్శలొచ్చినా అందలం

అనేక విమర్శలతో అన్నవరం ఆలయ ఈవో పోస్టు నుంచి బదిలీ అయిన చంద్రశేఖర్‌ ఆజాద్‌కు మాత్రం దేవాదాయ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఆయన్ను కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌ స్థాయిలో అన్ని బాధ్యతలు చూసేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి కమిషనరేట్‌లో జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) పోస్టు ఒక్కటే ఉంటుంది. ఆ పోస్టులో.. గతంలో దుర్గగుడి ఈవోగా పనిచేసిన భ్రమరాంబ ఉన్నారు. అయినప్పటికీ.. ఏ పోస్టు లేకుండా ఆజాద్‌ను కమిషనరేట్‌లో కూర్చోబెట్టారు. భూములు, పరిపాలన అంశాలు, పదోన్నతులు, బదిలీలు తదితర కీలక సబ్జెక్టులన్నీ ఆయనే చూస్తున్నారు. విచిత్రంగా ఈయనకు.. ఇప్పటికీ అన్నవరం ఆలయ ఈవో పేరిట జీతం చెల్లిస్తుండటం విశేషం.

అమాత్యుడి పెత్తనమే..

దేవాదాయ శాఖలో ఇంకా అమాత్యుని పెత్తనం నడుస్తోందనడానికి కమిషనరేట్‌లో పరిస్థితులే నిదర్శనం. ఓ కీలక ఉన్నతాధికారి.. అమాత్యుడు చెప్పినట్లే ఇప్పటికీ నడుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అందుకే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినాసరే.. అసలు పోస్టుల్లోని అధికారులకు విధులు అప్పగించకుండా చూస్తున్నారు. గతంలో రామచంద్రమోహన్‌పై సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్‌ భూముల విషయంలో ఉద్దేశపూర్వక కేసులు పెట్టారు. విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. ఇప్పటికీ ఆ విచారణ పూర్తికాలేదు. అయినాసరే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే వారం ముందు.. ఆయనపై శాఖాపరమైన విచారణకు కీలక ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. విజిలెన్స్‌ విచారణ కొలిక్కి రాకుండా ఇలా శాఖాపరమైన విచారణకు ఆదేశాలివ్వడం వెనుక కూడా అమాత్యుడి ఒత్తిడి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని