Palnadu: జంగాలపల్లెలో వీవీ ప్యాట్‌ ఎలా విరిగింది?

పల్నాడు జిల్లా నూజండ్ల మండలం జంగాలపల్లెలోని పోలింగ్‌ బూత్‌ 259లో ఎన్నికలనాడు వైకాపా, తెదేపా వారి మధ్య వివాదంలో వీవీ ప్యాట్‌ కింద పడి విరిగింది. బూత్‌లోకి వచ్చిన వృద్ధుల ఓటు తానే వేస్తానని వైకాపా ఏజెంట్‌ పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.

Updated : 25 May 2024 06:01 IST

సీసీ ఫుటేజి కోరిన ఉన్నతాధికారులు

జంగాలపల్లె మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ నం. 259లో విరిగిన వీవీ ప్యాట్‌

నూజండ్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా నూజండ్ల మండలం జంగాలపల్లెలోని పోలింగ్‌ బూత్‌ 259లో ఎన్నికలనాడు వైకాపా, తెదేపా వారి మధ్య వివాదంలో వీవీ ప్యాట్‌ కింద పడి విరిగింది. బూత్‌లోకి వచ్చిన వృద్ధుల ఓటు తానే వేస్తానని వైకాపా ఏజెంట్‌ పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. తెదేపా, వైకాపా వర్గాలు నెట్టుకోవడంతో వైకాపా ఏజెంట్‌ తగిలి వీవీ ప్యాట్‌ కిందపడింది. విషయాన్ని వైకాపా వారు వినుకొండ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెప్పగా ఆయన వచ్చి పోలింగ్‌ నిలిపేయించారు. గ్రామంలో ఎక్కువ శాతం తెదేపా అనుకూలురున్నారని.. పోలింగ్‌ నిలిపేస్తే నష్టపోతామని గమనించిన తెదేపా నాయకులు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి ఓటింగ్‌ ప్రారంభించాలని పట్టుబట్టారు. మరోసారి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, అధికారులు సర్దిచెప్పి మెకానిక్‌ను రప్పించి వీవీ ప్యాట్‌ను సరిచేయించారు. రెండు గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభించారు. దీనిపై అప్పుడు పోలింగ్‌ అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో వీవీ ప్యాట్‌ ధ్వంసం సంఘటన వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీసీ టీవీ ఫుటేజిని కోరారు గ్రామంలో ఉన్న రెండు వర్గాల్లో పది మందిని సీఐ సుధాకరబాబు స్టేషన్‌కు పిలిపించి ఆ రోజు సంఘటనపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని