Andhra Pradesh: ఇసుక తవ్వకాలపై గనుల శాఖ పెద్దల దొంగాట

మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్‌ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు.

Updated : 25 May 2024 06:13 IST

ఇంతకాలం అధికారుల చేతులు కట్టేశారు..
ఇప్పుడేమో చర్యలు తీసుకోలేదంటూ నోటీసులిస్తున్నారు
అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు చీవాట్లతో మైనింగ్‌ ఏడీలకు తాఖీదులు

ఈనాడు, అమరావతి: మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్‌ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇసుక అక్రమ తవ్వకాల నెపాన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులపైకి నెట్టి చేతులు దులిపేసుకునేందుకు చూస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదో వివరణ ఇవ్వాలని, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కొన్ని జిల్లాల గనులశాఖ ఏడీలు, విజిలెన్స్‌ ఏడీలకు తాఖీదులు ఇవ్వడంతో ఆ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా గనులశాఖలోని ఇద్దరు కీలక అధికారులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలువురు గనులశాఖ సంచాలకులు (జిల్లా గనులశాఖ అధికారులు), జిల్లా విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఏడీలకు.. ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నోటీసులిచ్చారు. మీ జిల్లాల్లోని కృష్ణా, గోదావరి నదుల్లో రీచ్‌ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, యంత్రాల వినియోగం వంటివి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ వాటిలో పేర్కొన్నారు. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ సంచాలకులు ఈ తాఖీదులు ఇచ్చారు. ఏ జిల్లాలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎన్జీటీకి) కొన్నాళ్ల కిందట నివేదిక ఇచ్చారు. గనులశాఖ ఉన్నతాధికారులు సూచించిన రీచ్‌ల్లో మాత్రమే తనిఖీలు చేసి, అక్కడ ఎటువంటి తవ్వకాల్లేవని నివేదికల్లో  పేర్కొన్నారు. అయితే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు రీచ్‌ల్లో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని, కొన్ని రీచ్‌ల హద్దులు దాటి తవ్వకాలు సాగిస్తున్నారని, భారీ యంత్రాలను వినియోగిస్తున్నారని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికలన్నీ తప్పేనని తేటతెల్లమైంది. ఈ విషయం తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగానూ ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. దీంతో గనుల శాఖ ఉన్నతాధికారులు అక్రమాలు చేసిన గుత్తేదారు సంస్థను, వైకాపా నేతలను వదిలేసి.. ఆఘమేఘాలపై ఆయా జిల్లాల మైనింగ్‌ ఏడీలకు తాఖీదులిచ్చి, వివరణ కోరారు.

ఇంతకాలం అంటకాగింది ఉన్నతాధికారులే!

2021 మే నుంచి జేపీ సంస్థ పేరిట, గత ఏడాది చివరి నుంచి జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల పేరిట రాష్ట్రమంతా ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ సాగింది. ఎటువంటి నిబంధనలు పాటించలేదు. గనులశాఖకు తప్పుడు లెక్కలు చూపారు. లీజులతో పనిలేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వేశారు. ఇవన్నీ తెలిసినా సరే వాటి జోలికి వెళ్లొద్దంటూ అన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులను.. ఆ శాఖ ఉన్నతాధికారులు మొదట్లోనే గట్టిగా హెచ్చరించారు. ఎంత మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోవద్దని చెప్పారు. దీంతో జిల్లాల్లో అధికారులు నోరెత్తలేదు.   అదే అదనుగా గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, వైకాపా నేతలు చెలరేగిపోయారు. ఎక్కడైనా గనులశాఖ అధికారులు రీచ్‌ల్లో తనిఖీలు చేసినా, ఇసుక లారీలను ఆపి,        వే బిల్లులు పరిశీలించినా ఎదురుతిరిగేవారు. వెంటనే సీఎంఓ నుంచి, గనులశాఖ ఉన్నతాధికారి నుంచి వారికి హెచ్చరికలు వచ్చేవి. గత ఏడాది ఓ ఇసుక రీచ్‌లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారని ఫిర్యాదు రావడంతో కృష్ణా జిల్లా ఏడీ తన బృందంతో తనిఖీకి వెళ్లారు. అక్కడున్న ఇసుక గుత్తేదారు ప్రతినిధి.. ‘నువ్వెందుకు వచ్చావు? ఎవరు  వెళ్లమన్నారు? ఈ రీచ్‌లో తవ్వకాలు చేస్తున్నది ఎవరో తెలుసా? అసలు నువ్వు తనిఖీకి వచ్చిన విషయం మీ డైరెక్టర్‌కు తెలుసా? మీ డైరెక్టర్‌కు ఫోన్‌ చెయ్‌’ అంటూ ఏడీపై విరుచుకుపడ్డాడు. దీంతో అధికారి బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.

జిల్లాల్లో అధికారులే బలిపశువులు?

ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా ఉండటంతో గనులశాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. తరచూ రీచ్‌ల్లో తనిఖీలు చేయాలని పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు దందా జరిగినప్పుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వని ఉన్నతాధికారులు.. కేసు వారి మెడకు చుట్టుకోనుండటంతో జిల్లాల్లో అధికారులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని