Arogya Sri: ఆరోగ్యశ్రీ రోగులకు ఏదీ సాంత్వన?

రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.

Updated : 26 May 2024 08:57 IST

నిత్యం బకాయిల గొడవ
నిధులు విదల్చని వైకాపా సర్కారు
చికిత్సకు వచ్చే వారి నుంచి ఆసుపత్రుల వసూళ్లు
నిర్వహణ అస్తవ్యస్తం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గ్రీన్‌ఛానల్‌ కింద బిల్లులు చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు. దీన్ని సాకుగా చూపుతూ రోగులను ఆందోళనకు గురిచేసేలా సేవల నిలిపివేతపై ప్రైవేటు ఆసుపత్రులు తరచూ ప్రకటనలిస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు వసూళ్లకు తెగబడుతున్నాయి. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. చర్చల అనంతరం కొన్ని నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నిధులపై ప్రభుత్వహామీతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఇలాంటి తంతు ఇటీవల సాధారణమైంది. 

బకాయిలతో సంబంధం లేకుండా కొన్ని ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపైనే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరినవారి నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు. కొన్ని ఆసుపత్రులవారు రకరకాల పేర్లతో రోగుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. రోగుల సొంత డబ్బుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాకే చేర్చుకుంటున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అడపాదడపా ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్సల కోసం వేతనంలో ప్రతినెలా రూ.300 వరకు చెల్లించే ఉద్యోగులకూ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. సొంత డబ్బులతోనే వారు చికిత్స పొందుతున్నారు. వీరి క్లెయిమ్స్‌లో ప్రభుత్వం 40% వరకు కోత పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యంపై పకడ్బందీ ఆడిటింగ్‌ వ్యవస్థ లేదు. దీన్ని ‘కాగ్‌’ ప్రశ్నించింది. బకాయిలను సకాలంలో చెల్లించనందున మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు బహిరంగంగా చెబుతున్నాయి.

బకాయిల చెల్లింపుల ప్రభావం

అనుబంధ ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు బకాయిలున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే రూ.175 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రులకు వచ్చే పేమెంట్‌ కేటగిరీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆసుపత్రులకు పేమెంట్‌ కేటగిరీ కింద వచ్చేవారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. వాటి బిల్లులను ఏడెనిమిది నెలల నుంచి చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కొన్ని ఆసుపత్రులవారు పాత యంత్రాలు, పరికరాలతోనే పరీక్షలు చేస్తున్నారు. అత్యవసరమైతే సెకండ్‌ హ్యాండ్‌ యంత్రాలు కొంటున్నారు. యాంజియోగ్రామ్‌ కోసం వాడే వైర్‌ను ఆరోగ్యశ్రీ కింద చేరే రోగుల్లో ముగ్గురు, నలుగురికి వాడుతున్నారని సమాచారం. దీనివల్ల అది కొన్ని సందర్భాల్లో రోగి రక్తనాళాల్లో విరిగి ఉండిపోయే ప్రమాదముంది. ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలూ చెల్లించలేని పరిస్థితుల్లో ఆసుపత్రులున్నాయి. పట్టణాలు/నగరాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులకు యాజమాన్యాలు భారీగా వేతనాలిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు రాబడి లేదన్న ఉద్దేశంతోనూ వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.


పొరుగు రాష్ట్రాల్లోనూ సమస్యలే

కొన్ని ప్రధాన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అనుబంధ గుర్తింపు వద్దనుకుంటున్నాయి. దీనివల్ల సీనియర్‌ వైద్యనిపుణుల సేవలు రోగులకు అందడం లేదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఎంపికైన కొన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉచిత చికిత్సను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ప్రయోజనం పొందేవారు తక్కువ. బిల్లులు అందక అత్యవసర కేసులనే ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నారని తెలిసింది. 


ప్రభుత్వాసుపత్రులకూ కష్టాలే

ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెంచేలా వైద్యులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి సకాలంలో సొమ్ములు రావట్లేదు. తాజా సమాచారం ప్రకారం.. రూ.175 కోట్ల వరకు ప్రభుత్వాసుపత్రులు, వాటిలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రోత్సాహాకాల కింద చెల్లించాల్సి ఉంది. ఇవి అందక ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కష్టమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న ప్రతి రోగి వివరాలను ట్రస్టుకు పంపేందుకు కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బందీ లేరు. ఉన్నవారికీ వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని