Kris city: కోడ్‌కు ముందు.. క్రిస్‌ సిటీ కట్టబెట్టేశారు!

‘ఎన్నికల సందట్లో సడేమియా’ అన్నట్లు.. ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే అధికారపార్టీ పెద్దలు క్రిస్‌ సిటీ టెండర్లు కట్టబెట్టేశారు.

Updated : 26 May 2024 08:20 IST

టెండరు విలువపై 15% అదనం
ఆ భారం రూ.153 కోట్లు 
ఐదేళ్లు వేచి చూసి.. ఎన్నికల ముందు హడావుడిగా ఎల్‌ఓఏ

ఈనాడు, అమరావతి: ‘ఎన్నికల సందట్లో సడేమియా’ అన్నట్లు.. ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే అధికారపార్టీ పెద్దలు క్రిస్‌ సిటీ టెండర్లు కట్టబెట్టేశారు. మూడేళ్లుగా నానబెట్టి.. ఎన్నికలకు మూడు నెలల ముందు గుట్టుగా పనికానిచ్చేశారు. గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి లెటర్‌ ఆఫ్‌ అవార్డును (ఎల్‌ఓఏ) జగన్‌ ప్రభుత్వం ఇచ్చేసింది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలో (సీబీఐసీ) భాగంగా రూ.1,021.41 కోట్లతో ప్రతిపాదించిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ) ప్రాజెక్టును చడీచప్పుడూ లేకుండా టెండరు ధరపై 15% అధిక మొత్తానికి బిడ్‌ వేసిన బీవీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టింది. రూ.153.21 కోట్లు నిర్మాణసంస్థకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భవిష్యత్తులో వచ్చే ఎస్కలేషన్లు దీనికి అదనం. ప్రాజెక్టు అమలుకు నిధులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, ఇంప్లిమెంటేషన్‌ ట్రస్టు (నిక్‌డిక్ట్‌) అందిస్తుంది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి.. గుత్తేదారు సంస్థ ఎంపికకే జగన్‌ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది.

అంచనాల్లో తగ్గించి.. అదనం పేరుతో ఇచ్చేసింది

క్రిస్‌ సిటీ టెండర్లలో ప్రభుత్వ పెద్దల మతలబు చూస్తే విస్తుపోవాల్సిందే. తొలుత రూ.1,190 కోట్లతో టెండర్లు పిలిస్తే.. మూడోసారి అవే పనులను రూ.1,021.41 కోట్లకు తగ్గించింది. ఇలా తగ్గించిన మొత్తానికి దాదాపు సమానంగా గుత్తేదారునికి మరో రూపంలో దోచిపెట్టింది. 15% అదనపు మొత్తానికి బిడ్‌ను ఖరారు చేయడంతో బీవీఎస్‌ఆర్‌ సంస్థకు నికరంగా రూ.1,174.62 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన మూడేళ్లు జాప్యం చేసి జగన్‌ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. ఆ మేరకు యువతకు ఉపాధి అవకాశాలను మాత్రం దూరం చేసింది.

హడావుడిలో మతలబు ఏంటో?

క్రిస్‌ సిటీ నిర్మాణ పనులకు జగన్‌ ప్రభుత్వం ఏటా ఒకటి చొప్పున 3 టెండరు ప్రకటనలిచ్చింది. గుత్తేదారుల నుంచి స్పందన లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది. పనులు కట్టబెట్టడంలో ప్రభుత్వ పెద్దల తీరుతో ప్రముఖ కంపెనీలు పలాయనం చిత్తగించాయి. 

ఒకటో సారి: 2021-22లో తొలిసారి రూ.1,190 కోట్లతో జగన్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నమూనా, నిర్మాణం, టెస్టింగ్, మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు.. నాలుగేళ్లు నిర్వహణ పనులను గుత్తేదారులకు అప్పగించేలా 2021 సెప్టెంబరు 20న టెండరు ప్రకటన ఇచ్చింది. నిర్దేశిత గడువు ముగిసినా గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. రెండుసార్లు గడువులు పెంచినా మార్పు లేక.. టెండరు ప్రక్రియను రద్దుచేశారు.

రెండో సారి: అవే పనులకు (2022-23లో) రూ.1,054.63 కోట్లకు అంచనాలను కుదించి.. రెండోసారి 2022 జూన్‌ 15న టెండరు ప్రకటన ఇచ్చింది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ వంటి కంపెనీలు బిడ్‌లు వేశాయి. సంప్రదింపుల తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టడానికి ఒక్క సంస్థా ముందుకు రాలేదు.

మూడో సారి: 2023-24లో అంచనాలను రూ.1,021.41 కోట్లకు తగ్గించి.. మూడోసారి 2023 సెప్టెంబరు 26న టెండరు ప్రకటన ఇచ్చింది. బీవీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, మేఘా, ఎన్‌సీసీ సంస్థలు బిడ్‌లు వేశాయి. రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత ఎల్‌1గా నిలిచిన బీవీఎస్‌ఆర్‌కు 2024 ఫిబ్రవరిలో ఎల్‌ఓఏ ఇచ్చింది. అంటే.. ఎన్నికల కోడ్‌కు కొద్దిరోజుల ముందు హడావుడిగా కట్టబెట్టారన్నమాట.


ఐదేళ్లూ.. అభూత కల్పనలతో కాలయాపన

సీబీఐసీ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రం మంజూరుచేసింది. అందుకు అనుగుణంగా భూసేకరణ చేపట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10,502 ఎకరాలు, చిత్తూరు పరిధిలో 1,587 ఎకరాల్లో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. పర్యావరణ అనుకూల నయా నగరం నిర్మిస్తామంటూ ఐదేళ్లుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్‌ జోన్, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, పని ప్రదేశంలో నివాసాలు, ఫుడ్‌ కోర్టు, అధునాతన బస్టాప్‌.. ఇవన్నీ కలిపి ఒక నగరాన్నే నిర్మిస్తామని ఊదరగొట్టింది. ఫుడ్‌ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ యూనిట్లు వస్తాయంటూ విలువైన కాలాన్ని వృథా చేసింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని