Pinnelli: పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దు

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైనవి తీవ్ర కేసులని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దని ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసి హైకోర్టులో వాదనలు వినిపించారు.

Updated : 28 May 2024 07:03 IST

బెయిలిస్తే ఓట్ల లెక్కింపు రోజున నేరాల్ని పునరావృతం చేస్తారు
ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది  హైకోర్టులో వాదనలు
తొమ్మిది కేసుల్లో పిన్నెల్లి నిందితుడు
పోలీసులను గాయపరిచి,  తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న పీపీ
వాదనలు పూర్తి.. నేడు నిర్ణయం  

ఈనాడు, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైనవి తీవ్ర కేసులని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దని ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసి హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్‌ (పిన్నెల్లి) పూర్వ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజున అరాచకాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు, ప్రస్తుత కేసులు భిన్నమైనవని చెప్పారు. బెయిలిస్తే ఆయన సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, నేరఘటనలను పునరావృతం చేస్తారని చెప్పారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి నేరఘటనలను పునరావృతం చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా మరుసటి రోజు అనుచరులతో ర్యాలీ తీసి, ప్రతిపక్ష నేతలను బెదించారని గుర్తు చేశారు. పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకు 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారని, పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగియడంతో మంగళవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి సోమవారం ప్రకటించారు.

ఆ మూడు కేసులివే

రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామ పోలింగ్‌ స్టేషన్‌లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. దీనిపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లితోపాటు మరో 15 మందిపై ఐపీసీ 307(హత్యాయత్నం), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎంను బద్దలుకొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీసినందుకు ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 506, 509, ఆర్‌పీ చట్టం సెక్షన్‌ 131 కింద కేసు నమోదు చేశారు. పోలింగ్‌ మరుసటిరోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారు. ఫిర్యాదు మేరకు పిన్నెల్లి అయన సోదరుడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.


ఎలాంటి షరతులకైనా ఓకే

-పిన్నెల్లి న్యాయవాది 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ ఇచ్చిందని, ఈ ఉత్తర్వుల ఉద్దేశాన్ని నెరవేరకుండా చూసేందుకు పోలీసులు వరుస కేసులు నమోదు చేసి పిటిషనర్‌ను అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. జూన్‌ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటారన్నారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో మంగళవారం తగిన ఉత్తర్వులు జారీచేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని