Pinnelli: పిన్నెల్లి పాస్‌పోర్ట్‌ కోర్టులో అప్పగింత

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్‌పోర్ట్‌ను ఆయన న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అందజేశారు.

Published : 30 May 2024 04:32 IST

గురజాల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్‌పోర్ట్‌ను ఆయన న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్టు సమర్పించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేసిన సమయంలో అడ్డుకోబోయిన నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ చెరుకూరి నాగశిరోమణిపై దుర్భాషలాడడం, పోలింగ్‌ మర్నాడు తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించి, సీఐ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరచడం వంటి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలని, రోజూ ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని, పాస్‌పోర్టును గురజాల కోర్టులో అప్పగించాలని ఎమ్మెల్యే పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పాస్‌పోర్టును ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అప్పగించారు.


రెండో రోజు ఎస్పీ కార్యాలయంలో హాజరైన ఎమ్మెల్యే పిన్నెల్లి

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం రెండో రోజు కూడా ఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. రిజిష్టర్‌లో సంతకం చేసి  వెళ్లిపోయారు. నరసరావుపేట పట్టణం వినుకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో మంగళవారం రాత్రి ఆయన బస చేసి తిరిగి అక్కడికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని