Amaravati: అమరావతి నుంచి తరలిపోతున్న సామగ్రి.. తాజాగా ఎల్‌అండ్‌టీకి చెందిన ప్లాస్టిక్‌ ఫ్రేముల వంతు

రాజధాని అమరావతి నుంచి గుత్తేదారు సంస్థలు సామగ్రిని తరలిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మేఘా సంస్థ తాగునీటి పైపులు, విద్యుత్తు కేబుళ్లను తరలించింది. ఈ జాబితాలోకి తాజాగా ఎల్‌అండ్‌టీ చేరింది.

Updated : 30 May 2024 07:56 IST

తుక్కు కింద కొన్న దిల్లీ వ్యాపారులు

సామగ్రి తరలించేందుకు సిద్ధంగా ఉన్న కంటెయినర్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు: రాజధాని అమరావతి నుంచి గుత్తేదారు సంస్థలు సామగ్రిని తరలిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మేఘా సంస్థ తాగునీటి పైపులు, విద్యుత్తు కేబుళ్లను తరలించింది. ఈ జాబితాలోకి తాజాగా ఎల్‌అండ్‌టీ చేరింది. భూగర్భంలో వేసే పైపులను ఉంచే ప్లాస్టిక్‌ ఫ్రేములను విక్రయించేయడంతో వాటిని కొన్న వ్యాపారులు కంటెయినర్లలో తరలిస్తున్నారు. మందడం సమీపంలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పక్కన ఎల్‌అండ్‌టీ సంస్థ గోదాము ఏర్పాటుచేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ రాజధానిలో వివిధ నిర్మాణ పనుల కాంట్రాక్టులను దక్కించుకుంది. రాజధానిలో భూగర్భవిధానంలో తాగునీటి పైపులు, విద్యుత్తు, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ వేసేందుకు పలు రకాల సామగ్రిని సమకూర్చుకుంది. పనుల్లో భాగంగా 2018లో విద్యుత్తు పైపుల మధ్య అమరిక కోసం వాడే ప్లాస్టిక్‌ ఫ్రేములను భారీ పరిమాణంలో తెచ్చి నిల్వ ఉంచింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిచాయి. అప్పటినుంచి సామగ్రి నిరుపయోగంగా ఉంది. ఈ ప్లాస్టిక్‌ ఫ్రేములను తుక్కు కింద అమ్మేయాలని సంస్థ నిర్ణయించిందని చెబుతున్నారు. వీటిని దిల్లీకి చెందిన వ్యాపారులు కొన్నట్లు తెలిసింది. రెండు నెలల కిందట కొంత సరకు తరలినట్లు సమాచారం. ఇప్పటివరకు మొత్తం ఐదు కంటెయినర్లలో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వీటిని కొన్నవారు బుధవారం మందడం వచ్చి దగ్గరుండి మరీ వాటిని తరలిస్తున్నారు. 

ప్రాధేయపడిన రైతులు

ఎల్‌అండ్‌టీ నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ‘ఇన్నాళ్లు వేచి ఉన్నారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అప్పటివరకైనా ఆగండి. ప్రస్తుతానికి తరలింపును నిలిపేయండి’ అని ప్రాధేయపడ్డారు. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని