Andhra Pradesh poll violence: శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?

పల్నాడులో పోలింగ్‌ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది.

Updated : 18 May 2024 09:11 IST

పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డీఎస్పీల వరకూ బాధ్యులే
ఎస్పీ బిందుమాధవ్‌కు అన్ని వైపుల నుంచీ సహాయ నిరాకరణ
తప్పంతా ఆయనపైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు
ఈనాడు - అమరావతి

అల్లరి మూకలు రోడ్డుమీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట. వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి

పోలింగ్‌ రోజున ఫోన్‌లో పల్నాడు ఎస్పీ ఆదేశం.

అవసరం లేదు సార్‌... ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు

సంఘటన స్థలంలో ఉన్న కిందిస్థాయి పోలీసు అధికారుల సమాధానం.

సార్‌.. అరాచక శక్తుల్ని బైండోవర్‌ చేయకుండా వదిలేశారు

ఎన్నికలకు కొన్నిరోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ... అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్టు.

అరే, ఎందుకు లేవయ్యా... ఇప్పటికి చేసింది చాలు. ఇక అవసరం లేదు

అప్పటి డీజీపీ సమాధానం

ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచండి. నా అనుమతి లేకుండా బయటకు పంపొద్దు

ఎస్పీ ఆదేశం

పది నిమిషాల్లోనే మున్సిపల్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే హల్‌చల్‌. అదేంటయ్యా... ఎందుకు వదిలేశారని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్‌... అందుకే వదిలేశామని కిందిస్థాయి పోలీసుల సమాధానం.

ల్నాడులో పోలింగ్‌ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. అయితే, ఆయన సస్పెన్షన్‌కు గురవడానికి వెనుక... అప్పటి డీజీపీ నుంచి, కిందిస్థాయి అధికారుల వరకు అందరూ సహాయనిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారని... డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం. పోలింగ్‌ తేదీ దగ్గర పడేసరికి ఆ పోలీసు అధికారులంతా... ఆయనకు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తోంది. వైకాపా నాయకులు, కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతున్నా, దాడులు చేస్తున్నా.. వారిని నియంత్రించాలన్న ఎస్పీ ఆదేశాల్ని ఎవరూ లెక్కచేసినట్లు కనిపించలేదు. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా... అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలింగ్‌ రోజున ఐజీ శ్రీకాంత్‌ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరిదారిన వారు ఆదేశాలివ్వడంతో ఎస్పీ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఈసీ మాత్రం బిందుమాధవ్‌ను సస్పెండ్‌చేసింది. శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా, ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో... అక్కడి పరిస్థితుల్ని తరచిచూస్తే అర్థమవుతుంది.

సీఎస్‌ నియమిస్తే బదిలీ... ఈసీ నియమిస్తే సస్పెన్షన్‌

ఎన్నికల సమయంలో పల్నాడులో చోటుచేసుకున్న పరిణామాల్ని, వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్‌ విషయాలు తెలిశాయి. పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా... పాత డీజీపీ, కొత్త డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు.. చివరకు సీఎస్‌ ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండ విషయంలో సీఎస్‌ చేసిన సిఫార్సులపైనా విమర్శలు వస్తున్నాయి. సస్పెన్షన్‌కు సీఎస్‌ సిఫార్సు చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఇద్దరూ ఈసీ నియమించినవారే. బదిలీ చేయాలని సిఫార్సుచేసిన పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ మాత్రం రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సీఎస్‌ నియమించినవారు. ఈసీ నియమించిందనే ఆ అధికారులిద్దరి సస్పెన్షన్‌కు సీఎస్‌ సిఫార్సు చేశారన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. అలాగే.. బిందుమాధవ్‌ను అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదటి నుంచీ శత్రువులా చూశారని, ఏ విషయంలోనూ సహకరించలేదని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది.

పోలింగ్‌ రోజున వైకాపా నాయకుల అడుగులకు మడుగులు

అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేసిన కొందరు డీఎస్పీలు, సీఐలు, కిందిస్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందుమాధవ్‌ నివేదిక సమర్పించినా... అప్పటి డీజీపీ వారిని బదిలీ చేయకపోవడంతో పోలింగ్‌ రోజున వారంతా చెలరేగిపోయారు. వారిలో ప్రధానంగా... తాజాగా ఈసీ సస్పెండ్‌ చేసిన గురజాల, నరసరావుపేట డీఎస్పీలు ఎ.పల్లంరాజు, వీఎస్‌ఎన్‌ వర్మ తదితరులున్నారు. తన కింద పనిచేసే సిబ్బంది మాట వినకపోతే... కొన్నిచోట్లకు ఎస్పీ వెళ్లి అల్లరిమూకల్ని చెదరగొట్టాల్సి వచ్చింది. 

  • పోలింగ్‌ రోజున నరసరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే... ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపేస్తారని పోలీసులు బదులిచ్చారు. 
  • స్ట్రైకింగ్‌ ఫోర్స్‌... నరసరావుపేట ఎమ్మెల్యే వెంట తిరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్‌లో 10 వాహనాలతో... 70-80 మంది వెళ్తుండగా ఎస్పీకి తెలిసి అన్ని వాహనాల్ని ఎందుకు అనుమతించారని అడిగితే, రెండే వాహనాలున్నాయని అబద్ధం చెప్పారు.
  • ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని పోలింగ్‌ రోజు మధ్యాహ్నం గృహనిర్బంధం చేశారు. తన అనుమతి లేకుండా ఆయనను బయటకు వెళ్లనివ్వవద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే ఎమ్మెల్యే మున్సిపల్‌ స్కూల్‌ దగ్గర కనపడటంతో ఎస్పీ అవాక్కయ్యారు. ఎందుకు విడిచిపెట్టారని పోలీసుల్ని అడిగితే... ఓటు వేస్తానంటే తీసుకొచ్చామని బదులిచ్చారు.
  • పోలింగ్‌ రోజు కండ్ల[కుంటలో తెదేపా, ఇతర   అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబసభ్యులపై ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్‌ చేసి సహాయం కోరితే... వారిని ఆదుకోవడానికి రాకపోగా.. ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి డీఎస్పీ చెప్పారు. దాంతో వారిపై మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
  • పోలింగ్‌ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణారెడ్డి వందలమందితో కారంపూడి వెళ్లి తెదేపా కార్యాలయంపై దాడి చేసి, పలువుర్ని కొట్టారు. కారుకు నిప్పుపెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.

ఒంటరైన ఎస్పీ

అన్నివైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో ఎస్పీ బిందుమాధవ్‌ దాదాపు ఒంటరి అయ్యారు. కిందిస్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా, వైకాపా ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేయడంతో మొత్తం గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక... కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంకు తరలించి, తెల్లవారుజామున ఐదు గంటల వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. పల్నాడు జిల్లాలో 86 శాతానికి పైగా పోలింగ్‌ జరిగిందంటే దానిలో ఎస్పీ కృషి చాలా ఉందని, ఎస్పీ బాగా పనిచేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా కూడా కొనియాడారు.

సీఎస్‌పై చర్యలుండవా?

సీఎస్‌ స్థాయిలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఒక్కసారీ సమీక్షించని జవహర్‌రెడ్డి... ఎస్పీలు, కలెక్టర్‌ల సస్పెన్షన్‌కు, బదిలీకి సిఫార్సు చేయడమేంటని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నికల బందోబస్తుకు 34 కంపెనీల బలగాలు కావాలని కోరితే, 19 కంపెనీల బలగాల్నే ఇచ్చి సర్దుకోమన్నారని అధికారులు చెబుతున్నారు. తీరా అక్కడ శాంతిభద్రతల సమస్యల తలెత్తితే.. ఆ నెపాన్ని జిల్లా అధికారులపై వేసేసి, ఉన్నతాధికారులు తప్పించుకున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.


అదనపు బలగాలు అడిగినా ఇవ్వలేదు

అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దర్‌కూ ఉన్నతాధికారుల నుంచి, కిందిస్థాయి సిబ్బంది నుంచి పూర్తి సహాయనిరాకరణ ఎదురైనట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జకీర్‌ను బదిలీ చేయాలని అప్పటి డీఐజీ అమ్మిరెడ్డిని ఎస్పీ కోరినా పట్టించుకోలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ ఎస్పీకి సహకరించకపోవడం, వైకాపా నాయకులతో కుమ్మక్కవడం వల్లే తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడులు జరిగాయని సమాచారం. తాడిపత్రిలో ఘర్షణల నేపథ్యంలో అదనపు బలగాల్ని పంపాలని ఎస్పీ కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని, చివరకు ఎస్పీయే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఆ క్రమంలో ఆయనకూ గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వైకాపాకి కొమ్ముకాసే డీఎస్పీ వీఎన్‌కే చైతన్యను అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి కర్నూలు రేంజి డీఐజీ విజయారావు తాడిపత్రికి పిలిచించారని, ఆ విషయం ఎస్పీ అమిత్‌ బర్దర్‌కి తెలియదని సమాచారం.


వైకాపా నాయకులకు వేగుల్లా...

  • పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు అధికారపార్టీకి వేగుల్లా పనిచేశారు. పోలింగ్‌ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని అనుమానం వచ్చినవారిని అరెస్టుచేయాలని ముందురోజు ఎస్పీ ఆదేశిస్తే.. వారిలో 30 మందిని వదిలేశారు.
  • అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఎస్పీ టెలికాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల్ని ఎప్పటికప్పుడు అధికారపార్టీ నాయకులకు పోలీసులు చేరవేసేవారు.
  • అభ్యర్థుల వాహనాల్ని ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే... వారు చేయకపోగా, ఆ సమాచారాన్ని వారికి చేరవేశారు. 
  • హింసాత్మక సంఘటనలో, అల్లర్లో జరిగినప్పుడు ఫలానా వాళ్లను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే... వాళ్లు అధికారపార్టీకి చెందినవారైతే ఇదిగో చేసేస్తున్నాం అని అబద్ధం చెప్పి, చేయకుండా వదిలేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని