AP Power Cuts: పట్టణాల్లోనూ కోతలు

దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో మంగళవారం 161 ఫీడర్ల పరిధిలో వివిధ కారణాలతో విద్యుత్‌ సరఫరా నిలిచింది. అనంతపురం సర్కిల్‌లో మొత్తం 29 ఫీడర్లలో సరఫరా నిలిచింది.

Updated : 29 May 2024 07:03 IST

రాష్ట్రంలో 253 ఫీడర్లలో సమస్యలు
గంటల తరబడి నిలిచిన విద్యుత్‌ సరఫరా
ఉక్కపోతతో ప్రజలకు ఇక్కట్లు
సాంకేతిక కారణాల వల్లే అంటున్న డిస్కంలు 
ఈనాడు - అమరావతి


  • దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో మంగళవారం 161 ఫీడర్ల పరిధిలో వివిధ కారణాలతో విద్యుత్‌ సరఫరా నిలిచింది. అనంతపురం సర్కిల్‌లో మొత్తం 29 ఫీడర్లలో సరఫరా నిలిచింది. కదిరి డివిజన్‌లోని మొహమ్మదాబాద్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం వరకూ కూడా విద్యుత్‌ సరఫరా లేదు.
  • తిరుపతి సర్కిల్‌లో 25 ఫీడర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. కేశవకుప్పం ఫీడర్‌ పరిధిలోని అన్నూరు సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఉదయం 6 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేదు. 12 గంటలుగా విద్యుత్‌ నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప లేదు.

ఉన్నట్లుండి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. లేకుంటే లోవోల్టేజీతో లైట్లు మిణుకు మిణుకుమంటాయి. మారుమూల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే సరిపెట్టుకోవచ్చు. కానీ పట్టణాల్లోనూ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు.  నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామంటూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చెప్పే మాటలు నిజం కావని చెప్పడానికి పట్టణ ప్రాంతాల్లో తలెత్తుతున్న విద్యుత్‌ అంతరాయాలే నిదర్శనం. ఓల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగా ఇంట్లో ఉపయోగించే విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాష్ట్రంలో అనేక చోట్ల విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి కరెంటు లేక ప్రజలు ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా రాత్రి వేళల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. విద్యుత్‌ లైన్ల నిర్వహణ.. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచకపోవడం లాంటివి తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి.

గంటల తరబడి కోతలు

ఫీడర్ల పరిధిలో విడతల వారీగా డిస్కంలు విద్యుత్‌ కోతలు విధిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని ఫీడర్ల పరిధిలో మంగళవారం 12 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిందంటే పరిస్థితి తీవ్రత ఊహించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఫ్యాన్‌ లేకుండా ఇంట్లో ఉండాలంటే నరకంలా ఉంటోంది. ఈ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో పడే బాధ వర్ణనాతీతం. మూడు డిస్కంల పరిధిలో 22,113 గ్రామాలు ఉంటే.. మంగళవారం ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేశామని డిస్కంలు పేర్కొంటున్నాయి. 33కేవి, 11కేవి ఫీడర్లు 253 బ్రేక్‌డౌన్‌ అయ్యాయని..సమస్యలను చక్కదిద్ది విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించినట్లు చెబుతున్నాయి. అయితే సాయంత్రం ఆరుగంటల వరకూ లభించిన సమాచారం మేరకు పలు ఫీడర్ల పరిధిలో గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

  • అనంతపురం సర్కిల్‌లో హిందూపురం గ్రామీణ, శ్రీసత్యసాయిజిల్లా, పరిగి మండలంలోని గ్రామాలకు విద్యుత్తును పంపిణీ చేసే ఫీడర్‌ నిర్వహణ కోసం ఉదయం 8.30 గంటలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామని సబ్‌స్టేషన్‌ సిబ్బంది ‘ఈనాడు’కు చెప్పారు. 
  • కడప సర్కిల్‌లో 31 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరా ఆపేశారు. దుగ్గాయపల్లె సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఉదయం 6.15 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేదు. విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ పంపిణీ నిలిచిందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కరెంటు సప్లైని పునరుద్ధరించలేదు. పులివెందుల గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్‌ పంపిణీ చేసే ఫీడర్‌లోనూ సమస్య తలెత్తడంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. 
  • కర్నూలు సర్కిల్‌లో 31 ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కౌతాళం మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసే ఫీడర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఉదయం 6.40 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేదు. అలాగే  కొత్తపల్లి ఫీడర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పత్తికొండ సబ్‌ డివిజన్‌ పరిధిలోని గ్రామాలకు సాయంత్రం 5.50 నుంచి విద్యుత్తు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
  • నెల్లూరు సర్కిల్‌లో 25 ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాయుడుపేట పట్టణానికి విద్యుత్‌ సరఫరా చేసే ఫీడర్‌ పరిధిలో లైన్ల మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాలకు వేకువజామున 2.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. 
  • తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో 32 ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం సర్కిల్‌ పరిధిలోని గాంధీపురం ఫీడర్‌ తాడితోట సబ్‌స్టేషన్‌ పరిధిలోని వినియోగదారులకు ఉదయం 7 గంటల నుంచి విద్యుత్తు సరఫరా లేదు. సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణానికి విద్యుత్‌ సరఫరా చేసే సబ్‌ స్టేషన్‌ పరిధిలోని వినియోగదారులకు సాయంత్రం 6.10 గంటల నుంచి కరెంటు లేదు.

బొగ్గు సరిపడా లేనందువల్లేనా..?

ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 11,558 మెగావాట్లుగా గత శుక్రవారం నమోదైంది. జూన్‌లో గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 14 వేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో అన్ని వనరులూ కలిపి 20,610 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా.. అందులో పునరుత్పాదక విద్యుత్‌ యూనిట్లు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే విద్యుత్తు వాతావరణ పరిస్థితులకు లోబడి ఉండటంతో కచ్చితంగా అందుతుందన్న గ్యారంటీ లేదు. జెన్‌కో థర్మల్‌ కేంద్రాల సామర్థ్యం 6,610 మెగావాట్లుగా ఉంటే.. వాటి ద్వారా సోమవారం సగటున 3,522 మెగావాట్ల విద్యుత్తు (53 శాతం) మాత్రమే గ్రిడ్‌కు అందింది. బొగ్గు కొరత కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి రావడం లేదు. విజయవాడలోని వీటీపీఎస్‌ మినహా.. ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం దగ్గర ఒక్కరోజు ఉత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో వాటిని బ్యాక్‌డౌన్‌ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని