YSRCP: అయినవారికి భూముల పందేరం

వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు.

Updated : 24 May 2024 06:34 IST

ఏకపక్షంగా భూ రికార్డుల్లో వివరాలు తారుమారు
‘రెవెన్యూ’ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం
అక్రమంగా.. ప్రభుత్వ భూముల కైంకర్యం
ఈనాడు - అమరావతి

వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు. ఇదే అదనుగా పలువురు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో ధారదత్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులపేర్లతోనూ రాసేసుకుంటున్నారు. భూయజమానుల నిర్థారణ, విస్తీర్ణం, సర్వే నంబర్లకు ప్రామాణికంగా తీసుకునే ‘వెబ్‌ల్యాండ్‌’లో ఉండే వివరాలను బ్యాంకుల రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తుండడం గమనార్హం. మ్యుటేషన్‌ విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించిన డిజిటల్‌కీని తహసీల్దార్లకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు వైకాపా ఐదేళ్ల పాలనలో భారీగా వెలుగులోకి వచ్చాయి. వీటిలో విచారణ వరకు వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్లు మార్చడంపై ఇటీవల హైకోర్టు సైతం మండిపడింది.  నెల్లూరు జిల్లా కలిగిరి మండల వాసి..తమ సొంత భూములను ప్రభుత్వానికి చెందినవిగా మార్చారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లా వాసి ఒకరు తమ పేరుమీద ఉన్న భూమిని ఇతరుల పేర్లతో మార్చారని హైకోర్టులో పిటిషన్‌ను వేశారు.

ఈ రెండు కేసుల్లో సంబంధితులకు నోటీసులు ఇచ్చి.. వారి వాదన వినకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రెవెన్యూ సిబ్బందిపై హైకోర్టు మండిపడింది. రెవెన్యూశాఖలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది తహసీల్దార్లు, ఇతర సిబ్బంది ముడుపులు తీసుకొని వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను మార్చేస్తున్నారు. భూ యజమానిగా నిర్థారించేందుకు అవసరమైన మ్యుటేషన్ల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మరో ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలో బ్యాంక్‌ నుంచి రూ.5 లక్షల రుణం పొందేందుకు వీలుగా వెబ్‌ల్యాండ్‌లో తహసీల్దార్‌ ఒకరు తప్పుడు ఎంట్రీలు వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మండలంలో నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని వారసత్వం కింద మార్చి..ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. శింగనమల మండల పరిధిలోని ఏడు గ్రామాల పరిధిలో ఉన్న 166 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దపంజిని మండలంలో ఓ తహసీల్దారు 24 గంటల్లో రిలీవ్‌ కావాల్సి ఉండగా ముందురోజు అక్రమంగా.. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని భూముల వివరాలను మార్చేశారు. ఈ వ్యవహారాలు చాలా మేరకు స్థానిక వైకాపా నాయకుల ఛత్రఛాయల్లో జరగడం గమనార్హం.

ప్రభుత్వ భూముల ధారదత్తం

ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలంటే.. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పడే ఎసైన్‌మెంట్‌ కమిటీ సిఫార్సు చేయాలి. అయితే కొందరు వైకాపా నేతలు ఎసైన్‌మెంట్‌ కమిటీ సిఫార్సులతో నిమిత్తం లేకుండానే తమవారికి ప్రభుత్వ భూములను డీకే పట్టాల ద్వారా ఇప్పించేస్తున్నారు. ఇలా వైఎస్సార్‌ జిల్లాలో 162.06 ఎకరాలను 40 మందికి డీకే పట్టాల రూపంలో పంపిణీ చేసేశారు. చిత్తూరు జిల్లాలో  నాలుగు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారు. కె.వి.పల్లి మండలం నూతనకాల్వ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన 7.04 ఎకరాల భూమి వివరాలను వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేట్‌ క్యాటగిరీ కింద మార్చారు.

అనంతపురం జిల్లాలో తహసీల్దార్‌ ఒకరు.. ప్రజా ప్రయోజనాల కోసం పంచాయతీ కేటాయించిన భూమిని ఇళ్ల పట్టాల రూపంలో ఇతరులకు పంపిణీ చేశారు. ఇందుకు పంచాయతీకి సంబంధించిన తీర్మానం నకిలీది కావడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీఆర్వో ఒకరు అటవీ భూమి కాజేసేందుకు వెబ్‌ల్యాండ్‌ను అనుకూలంగా మార్చుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక తహసీల్దారు ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యులకు చెందినదిగా చూపుతూ రికార్డులు సృష్టించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన 66 మందికి మరో తహసీల్దారు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇదే అదునుగా కొందరు అధికారులు తమ వారికి ఈ భూములను కట్టబెడుతున్నారు. మరోవైపు మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది తహసీల్దార్‌ వద్ద మాత్రమే ఉండే డిజిటల్‌కీని  దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని