Garbage tax: చెత్త పన్ను వసూళ్ల నిలిపివేత!

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు వసూలు చేయొద్దని పుర, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలనిచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు.

Published : 08 Jun 2024 06:26 IST

పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు
అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామన్న ఎన్డీయే
చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్‌ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు వసూలు చేయొద్దని పుర, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలనిచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్‌ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున ఏటా దాదాపు రూ.200 కోట్లు వసూలుచేసింది. ఎన్నికల ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించినా సామాన్యులు ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూళ్లను తెదేపా, జనసేన మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలున్నాయి. 

‘క్లాప్‌’ పేరుతో నిధులు ఊడ్చేశారు

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని 2021 అక్టోబరులో వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వెంటనే చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో కొందరు  పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపు 2,164 ఆటోలు కొనిపించారు. వీటిని స్వచ్ఛాంధ్ర సంస్థ ద్వారా 48 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఇచ్చారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలుచేసి చెత్త తరలించే ఒక్కో ఆటోకు నెలకు రూ.65 వేల చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వం పుర కమిషనర్లను ఆదేశించింది. ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్టు ఒప్పందం వరకు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

22 రోజులుగా విజయవాడలో రోడ్డెక్కని ఆటోలు

పట్టణ స్థానిక సంస్థల నుంచి ముక్కుపిండి వసూలు చేసుకుంటున్న ప్రైవేటు సంస్థల నిర్వాహకులు ఆటోల డ్రైవర్లకు అరకొరగా జీతాలు చెల్లించి శ్రమ దోపిడీ చేస్తున్నారు. జీవో 7 ప్రకారం ఒక్కో డ్రైవర్‌కు రూ.18,500 చొప్పున వేతనమివ్వాలి. అత్యధిక చోట్ల రూ.13 వేలకు మించి ఇవ్వడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ జమ చేయడం లేదు. జీతాలు పెంచాలని విజయవాడలో 22 రోజులుగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులతో గతంలో మాదిరిగానే చెత్త సేకరిస్తున్నారు.

విశాఖలో ప్రైవేటు ఏజెన్సీకి జీవీఎంసీ దాసోహం

విశాఖలో చెత్త సేకరించేందుకు ఆటోలు సమకూర్చిన ప్రైవేటు ఏజెన్సీకి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు దాసోహమయ్యారు. జీతం పెంచాలని ఆటో డ్రైవర్లు ఎన్నికల ముందు ఆందోళన చేయగా రూ.3 వేల చొప్పున అదనంగా చెల్లించేందుకు జీవీఎంసీ అడ్డగోలుగా అంగీకరించింది. దీనివల్ల నగరపాలక సంస్థపై నెలకు రూ.18 లక్షలు, ఏడాదికి రూ.2.16 కోట్ల భారం పడుతోంది. వాస్తవంగా అదనపు భారం మొత్తాన్ని ప్రైవేటు ఏజెన్సీలవారు భరించాలి. అంతేకాక జీవీఎంసీలో ఇప్పటికే ఉన్న కార్మికులతో ఇళ్ల నుంచి చెత్త సేకరించాలన్న ఆదేశాలనూ అధికారులు పక్కన పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మరో 600 మంది కార్మికులను తీసుకుని వీరందరికి కలిపి నెలకు రూ.7.20 కోట్ల చొప్పున ఏడాదికి రూ.86.40 కోట్లు చెల్లిస్తున్నారు. 

క్లాప్‌లో భాగంగా రెండో విడత మరో 36 పట్టణ స్థానిక సంస్థల్లో చెత్త సేకరణకు స్వచ్ఛాంధ్ర సంస్థ రూ.21.18 కోట్లు వెచ్చించి కొన్న ఈ-ఆటోలు అత్యధికం షెడ్లకే పరిమితమయ్యాయి. 2023 జూన్‌ 8న అప్పటి సీఎం జగన్‌ జెండా ఊపి ప్రారంభించిన ఆటోలను తాడేపల్లి నుంచి అతి కష్టంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుర, నగరపాలక సంస్థలకు పంపినా వీటిలో అత్యధికం ఇప్పటికీ పని చేయడం లేదు. ఒక ప్రైవేటు సంస్థ ద్వారా ఈ-ఆటోలు కొనుగోలు చేయించి నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని