Ramoji Rao: ఫొటోలో పొరపాటును చెబితే.. బీరువా బహూకరించారు

విలువలకు ప్రాణం పోయడంలో అక్షర యోధుడు రామోజీరావుకు ఎవరూ సాటిరారని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ఏవో, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్‌ అన్నారు.

Updated : 10 Jun 2024 06:55 IST

విలువలకు ప్రాణం పోసే వ్యక్తి రామోజీరావు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ద్వారా పాఠశాలకు అందజేసిన బీరువా 

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: విలువలకు ప్రాణం పోయడంలో అక్షర యోధుడు రామోజీరావుకు ఎవరూ సాటిరారని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ఏవో, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్‌ అన్నారు. రామోజీరావు మృతి నేటి సమాజానికి తీరని లోటంటూ.. 1990లో జరిగిన చిన్న సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మార్గదర్శిలో పొదుపు చేసిన సొమ్ముతో ఓ వ్యక్తి తన మనవరాలి వివాహం చేశారనే విషయాన్ని ఆదివారం సంచికలో ‘తరతరాల అనుబంధం’ శీర్షికన ప్రచురించారు. అయితే అందులో ఆయన తన మనవరాలిని ఎడమ చేతితో దీవిస్తున్నట్లుగా ఫొటో పొరపాటున తారుమారై ప్రచురితమవడంతో ఆ విషయాన్ని తాను లేఖ ద్వారా రామోజీరావు దృష్టికి తీసుకెళ్లినట్లు రవికుమార్‌ చెప్పారు. ‘ఉన్నత ప్రమాణాలు పాటించే ఆయన మరుసటి వారంలో ఆ పొరపాటును సవరిస్తూ.. కుడి చేతితో దీవిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను సరిగా ప్రచురించడంతో పాటు నా సూచనను అభినందిస్తూ రూ. 1,116 చెక్‌ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ద్వారా అందించారు. ధన రూపంలో బహుమతి వద్దని ఏలూరు మార్గదర్శి కార్యాలయానికి వెళ్లి విన్నవించగా, ‘తరతరాల అనుబంధం’ పేరుతో బీరువాను కొని మా పాఠశాలకు బహూకరించారు. అలాంటి మహోన్నత వ్యక్తులతో అనుబంధం ఎన్నటికీ మరువలేనిది’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని